Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ విధానాలపై విద్యార్థులు ఉద్యమించాలి
- ఎస్ఎఫ్ఐ అఖిల భారత అధ్యక్షులు విపి సాను పిలుపు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశంలోని బీజేపీ ప్రభుత్వం తెస్తున్న నూతన జాతీయ విద్యావిధానం-2020 ప్రమాదకరమని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) అఖిల భారత అధ్యక్షులు విపి సాను విమర్శించారు. కేంద్రం అనుసరిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని ఆయన విద్యార్ధులకు పిలుపునిచ్చారు. ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్శీటిలో ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి అశోక్ రెడ్డి అధ్యక్షతన సోమవారం నిర్వహించిన సెమినార్లో విపి సాను ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో నూతన విద్యావిధానం పేరుతో విద్యారంగాన్ని కార్పొరేటీకరణ, కషాయీకరణ, కేంద్రీకరణ చేయాలనే కుట్రలు బీజేపీ ప్రభుత్వం చేస్తున్నదని విమర్శించారు. ఈ విధానం అమలు చేయడం ద్వారా ఉన్నత విద్యను పేదవిద్యార్థులకు దూరం చేసే విధానాన్ని అమలు చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ఇప్పటికే అన్ని రంగాలనూ ప్రయివేటుపరం చేసిన ఆ ప్రభుత్వం విద్యారంగాన్ని కారు చౌకగా కార్పొరేట్ శక్తులకు అప్పజేప్పేందుకు కుట్ర చేస్తున్నదని విమర్శించారు. విద్యా, ఉఫాధి లేకుండా చేస్తున్నదని అన్నారు. అగ్నిఫథ్ పేరుతో ఆర్నెల్ల శిక్షణ ఇచ్చి నాలుగేండ్లు ఉద్యోగమిచ్చి వెళ్లగొట్టే విధానానికి శ్రీకారం చుట్టిందన్నారు. వన్ ర్యాంక్, వన్ పింఛన్ పేరుతో గప్పాలు కొట్టిన మోడీ ప్రభుత్వం ఇప్పుడు నో ర్యాంక్, నో పింఛన్ అంటున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయాల్లో ప్రగతిశీల భావాలు ఉండకూడదనే కోణంలో ప్రభుత్వ విద్యను, వర్సిటీలను నిర్వీర్యం చేస్తున్నదని విమర్శించారు. కేంద్రంలో రెండు లక్షల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయనీ, వర్సిటీల్లోనూ బోధన, బోధనేతర పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. వాటి భర్తీ గురించి ఎలాంటి చర్చ లేదన్నారు. మోడీ ప్రభుత్వం తొలుత ఏటా రెండు కోట్ల ఉద్యోగాల పేరుతో మోసం చేసి, ఇప్పుడు 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ మోసపూరిత వాగ్ధానాలు చేస్తున్నదని విమర్శించారు. అందుకే దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు విద్యార్థులు, యువత ఐక్యంగా ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా జాతాలు నిర్వహిస్తామని చెప్పారు. రానున్న కాలంలో దేశ విద్యారంగ పరిరక్షణకు విద్యార్థులు ఉద్యమించి నూతన జాతీయ విద్యావిధానానికి వ్యతిరేకంగా పోరాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎల్ మూర్తి, కార్యదర్శి టి నాగరాజు, డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఎ వెంకటేష్, నగర నాయకులు శ్రీమాన్, అభిమన్యు, శివ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.