Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తమ్మినేని, చాడ సహా పలువురి నివాళి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సీపీఐ రాష్ట్ర మాజీ సహాయ కార్యదర్శి సిద్ధి వెంకటేశ్వర్లు అంత్యక్రియలు సోమవారం హైదరాబాద్‌లో ఉన్న దిల్సుక్నగర్లోని వివి నగర్ శ్మశాన వాటికలో ముగిశాయి. అంతకుముందు హైదరాబాద్‌లోని గ్రీన్‌హిల్స్ కాలనీలోని ఆయన నివాసంలో సిద్ధి వెంకటేశ్వర్లు భౌతికకాయాన్ని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి సహా పలువురు నాయకులు సందర్శించి ఘనంగా నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పశ్య పద్మ, విఎస్ బోస్, బాగం హేమంతరావు, కార్యవర్గ సభ్యులు బొమ్మగాని ప్రభాకర్, పల్లా నర్సింహారెడ్డి, రవీంద్రాచారి, ఉజ్జిని రత్నాకర్ (ఏఐటీయూసీ), సీపీఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, కొత్తగూడెం జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా, నాయకులు అయోధ్య, మౌలానా, పలువురు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన నాయకులు, కార్యకర్తలు భౌతికకాయానికి నివాళులర్పించారు. ప్రజాసంఘాల నాయకులు సదానంద్ గౌడ్( ఎస్టీయూ) కరుణకుమారి (ఏఐటీయూసీ), కెవిఎల్ (అయిప్సో), అంజయ్యనాయక్ (గిరిజన సమాఖ్య), పాండురంగాచారి(పంచ వృత్తి దారుల సంఘం), కలకొండ కాంతయ్య( బీకేఎంయూ), ఎం ప్రవీణ్ గౌడ్ (బిల్డింగ్ వర్కర్స్ యూనియన్), శివరామకృష్ణ (ఏఐఎస్ఎఫ్), ధర్మేంద్ర (ఏఐవైఎఫ్) నివాళులర్పించి ఆయనకు తుదివీడ్కోలు పలికారు.