Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేసీఆర్ రైతువ్యతిరేకి అనడం ఈ శతాబ్దపు జోక్ :
రైతుబంధును పీఎం కిసాన్‌గా మార్చారంటూ కేటీఆర్ ఎద్దేవా
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు రైతు వ్యతిరేకి అంటూ కేంద్రహోంమత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి కె తారక రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఈ శతాబ్దపు జోక్ అని ఎద్దేవా చేశారు. అబద్ధాలకు అమిత్‌షా బాద్షాగా మారిపోయారని ఆరోపించారు. ఈ మేరకు కేటీఆర్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఒకవైపు కేసీఆర్ ఆలోచన విధానాల నుంచి రూపొందిన రైతుబంధును మక్కీకి మక్కీగా కాపీ కొట్టి పీఎంకిసాన్గా పేరు మార్చిన పథకం ఎవరిదంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతు వ్యతిరేక నల్ల వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చి 700 మంది రైతుల ప్రాణాలను బలిగొన్న తర్వాత... దేశవ్యాప్తంగా రైతాంగం నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో క్షమాపణ చెప్పిన వారెవరని అమిత్‌షాను అడిగారు. కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజనలో చేరలేదంటూ కేసీఆర్‌ను విమర్శిస్తున్న అమిత్ షా మరి గుజరాత్ ప్రభుత్వం అదే పథకాన్ని ఎందుకు తిరస్కరించిందో, ఆ పథకం నుంచి ఎందుకు వైదొలిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. సొంత రాష్ట్రం గుజరాత్‌లోని రైతంగానికి ఎలాంటి ప్రయోజనం కలిగించని ఈ పథకం తెలంగాణకు ఏ విధంగా లబ్ధి చేకూరుస్తుందో చెప్పాలని కోరారు. ఇప్పటికైనా అర్థరహితమైన హిపోక్రసీని అమిత్ షా వదిలిపెట్టాలని సూచించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి కిలో దొడ్డు బియ్యాన్ని కొంటామంటున్న కేంద్ర హోంమంత్రి .. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీయే అనే విషయాన్ని మర్చిపోయారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రాజకీయ ప్రయోజనం లేదనే ఒకే ఒక్క కారణంతో కావాలనే తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనకుండా ఇక్కడి రైతాంగాన్ని పట్టించుకోవడం లేదన్నారు. మోటర్లకు మీటర్లు పెట్టి ఉచిత కరెంట్‌ను కబళించే కుట్రలు చేస్తున్నది బీజేపీ కాదా? అని ప్రశ్నించారు. కృష్ణా జలాల్లో వాటాలు తేల్చకుండా నికృష్ట రాజకీయం చేస్తున్నది ఎవరని అడిగారు. నీళ్లిచ్చే ప్రాజెక్టులను నిలిపివేయడానికి బోర్డులు బెట్టి బోడిపెత్తనం చేస్తున్నది కేంద్రం కాదా? అని కేటీఆర్ ప్రశ్నించారు.