Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యా కాషాయీకరణను వ్యతిరేకిద్దాం: ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షులు వీపీ సాను
- ఎస్ఎఫ్ఐ సంఘర్షణ జీపు జాత ప్రారంభం
నవతెలంగాణ-సంగారెడ్డి
నూతన విద్యా విధానానికి వ్యతిరేకంగా పోరాడుదామని, విద్య కాషాయీకరణను వ్యతిరేకించాలని ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షులు వీపీ సాను పిలుపునిచ్చారు. విద్యారంగంలోని సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 23 నుంచి 27 వరకు నిర్వహించనున్న 'ఎస్ఎఫ్ఐ సంఘర్షణ జీపుజాత'ను సంగారెడ్డిలో మంగళవారం ఆయన ప్రారంభించారు. సంగారెడ్డి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో నిర్వహించిన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. 5 ప్లస్, 3 ప్లస్, 4 విద్యా విధానంలో లోపాలను దృష్టిలో పెట్టుకోకుండా నూతన విద్యావిధానాన్ని బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిందని విమర్శించారు. రాష్ట్రాల హక్కులను హరిస్తూ విద్యా కేంద్రీకరించే విధంగా అశాస్త్రీయ పద్ధతిలో రూపకల్పన చేయడం సిగ్గుచేటన్నారు. ఉన్నత విద్యలో నాణ్యమైన పరిశోధనా విధానానికి కావాల్సిన పీజీ కోర్సులు తీసేసి 4 ఏండ్ల డిగ్రీ కోర్సులను తీసుకురావడం దుర్మార్గమని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఒకేషనల్ కోర్సుల్లో మార్పు చేస్తూ కుల వృత్తులను విద్యలోకి తీసుకొచ్చి వర్గ విభజన చేయడం, విద్యార్థులను బాల కార్మికులుగా మార్చడమేనని ఆగ్రహం వ్యక్తంచేశారు. విద్యార్థులకు నష్టదాయకంగా ఉన్న నూతన విద్యా విధానానికి వ్యతిరేకంగా విద్యార్థులు పోరాడాలని పిలుపునిచ్చారు.
ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటికొండ రవి మాట్లాడుతూ.. కేజీ టు పీజీ ఉచిత విద్యే తమ ధ్యేయంగా సీఎం కేసీఆర్ ప్రకటించి అధికారంలోకి వచ్చి 8 ఏండ్లయినా నేటికీ అమలు చేయలేదని ఆరోపించారు. సంక్షేమ హాస్టళ్లు సమస్యలతో స్వాగతం పలుకుతున్నాయని, వీటిని పట్టించుకునే వారే కరువయ్యారన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో కనీస సౌకర్యాలు లేవని, అద్దె బిల్డింగ్స్‌లో కొనసాగుతున్నాయని తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో 126 హాస్టల్స్‌కు గాను 51 హాస్టల్స్ అద్దె భవనంలో కొనసాగుతున్నాయని, వాటిల్లో 29 వార్డెన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. వర్కర్స్ పోస్టులు కాంట్రాక్ట్ పద్ధతిలో కొనసాగుతున్నాయని వాటిని ఔట్ సోర్సింగ్‌గా మార్చాలని కోరారు. 40 గురుకులాలు, 22 కేజీబీవీ, కాలేజ్ హాస్టల్ 27, సంక్షేమ హాస్టల్స్ బీసీ 35, ఎస్సీ 47, ఎస్టీ 13 ఉన్నాయని వీటిల్లో 43,972 మంది విద్యార్థులు చదువుతున్నారన్నారు.
మిల్లర్లు దొడ్డు బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి హాస్టల్స్‌కు సరఫరా చేస్తున్నారని తెలిపారు. సంక్షేమ హాస్టల్లో కనీసం మెడికల్ కిట్ కూడా సరఫరా చేయాట్లేదన్నారు. ఇంకా ఎన్నో సమస్యలు విద్యాసంస్థల్లో ఉన్నాయని, వాటన్నింటికీ పరిష్కారం దొరికేవరకు జీపుజాత చేపడతామని స్పష్టంచేశారు. కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు అశోక్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సందీప్, రమేష్, జిల్లా ఉపాధ్యక్షులు మహేష్, గర్ల్స్ కన్వీనర్ రమ్య, ఎస్ఎఫ్ఐ నాయకులు సాక్షి, రవి, రంజిత్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.