Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొనుగోళ్ల పర్వంలో బీజేపీ
- ఆ స్థానాన్ని దక్కించుకునేందుకు టీఆర్ఎస్ ఎత్తుగడ
- కాంగ్రెస్ పునాది చెదరగొట్టేందుకు బీజేపీ, టీఆర్ఎస్ మాస్టర్ ప్లాన్
- బీసీలకు టికెట్ కోసం ఆయా పార్టీల్లో నేతల పట్టు
- కుంపట్ల కాంగ్రెస్‌కు 'కోమటిరెడ్డి' ఆజ్యం
మునుగోడు నియోజకవర్గం నుంచి నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
మునుగోడు బరిలో ఎవరెవరుంటారు? టీఆర్ఎస్ అధిష్టానం పాతకాపుకే సీటుస్తుందా? డిమాండ్ మేరకు బీసీకి కేటాయిస్తుందా? సంక్షేమపథకాలకు తోడు వామపక్షాల బలం జతవ్వడంతో ఆ పార్టీ గెలుపు నల్లేరుమీద నడకేనా? ఇంకా కష్టపడాల్సిందేనా? కాంగ్రెస్ క్యాడరంతా తనవెంటే వస్తుందని ఆశించి భంగపడ్డ బీజేపీ నేత రాజగోపాల్‌రెడ్డి డబ్బుల బలంతో నెట్టుకొచ్చేందుకు చేస్తున్న ప్రయత్నం ఎంతమేరకు సఫలమవుతుంది? క్షేత్రస్థాయిలో పట్టున్నా నేతల మధ్య రగులుతున్న నిప్పుల కుంపటి కాంగ్రెస్‌కు మైనస్ కానున్నదా? అంతా ఒక్కటైతే టీఆర్ఎస్, బీజేపీలతో ఢ అంటే ఢ స్థితికి హస్తం పార్టీ వచ్చే అవకాశం ఉందా? 'పంచుడు..గుంజుడు' సిద్ధాంతంతో స్థానిక ప్రజాప్రతినిధులను అంగట్లో సరుకుగా కొంటున్న పార్టీలకు కలుసొస్తుందా? వారివెనుక ప్రజలున్నారా? సెమీఫైనల్లో ప్రజలెటువైపు? ఇప్పుడు ఇవన్నీ సగటు మనిషి మెదడును తొలుస్తున్న ప్రశ్నలు. ఎక్కడ సభ పెట్టినా...ఎవరు పిలిచినా అక్కడే వాలిపోతున్న నియోజకవర్గ ప్రజానీకం తీరుతో అంతా అయోమయ పరిస్థితి నెలకొంది. మునుగోడు నియోజకవర్గంపై క్షేత్రస్థాయి నుంచి నవతెలంగాణ ప్రత్యేక కథనం.
మునుగోడు ఉప ఎన్నిక.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్ అని అన్ని పార్టీలూ భావిస్తున్నాయి. అందుకే టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే కొనుగోళ్ల పర్వం మొదలెట్టి పైచేయి సాధించేందుకు బీజేపీ, టీఆర్ఎస్ క్షేత్రస్థాయి బలోపేతంపై దృష్టిపెట్టాయి. స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఆ గట్టూ నాదే..ఈ గట్టూ నాదే...పక్క గట్టూ నాదే...అన్నట్టుగా వ్యవహరిస్తూ మూడు పార్టీలతోనూ బేరసారాలు ఆడుతున్నారు. ఒకటెండ్రు రోజుల వ్యవధిలోనే పార్టీలు మారిపోతున్నారు. మరికొందరు మూడు పార్టీల నుంచీ తాయిలాలు పుచ్చుకుంటున్న పరిస్థితి కండ్లకు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. 'ఎన్ని పెట్టినా తినేవి తింటనే ఉంటరు..చేసేవి చేస్తనే ఉంటరు.. ఓటరు వేసేటోళ్లకే ఏస్తడు. నాయకులు పోయినా వారి వెంట ప్రజలు పోతలేరు' అంటూ మర్రిగూడ మండలానికి చెందిన వి.నర్సింహారావు అక్కడ జరుగుతున్న పరిస్థితిని వివరించారు.
నేతలే కాదు ఓటర్లూ తెలివి మీరారు. 'ఎన్కటి లెక్క సేవ చేసేటోడు రాజకీయాల్లోకి ఎవ్వడొస్తున్నడు. కమ్యూనిస్టోళ్లు ఐదుసార్లు గెలిచారు. డబ్బుల ముందు వారు నిలబడలేకపోతున్నారు. వ్యాపారం చేసుకునేటోళ్లకు పార్టీలు టికెట్లు ఇస్తున్నయి. వారి గురించి ఎందుకు ఆలోచించాలి. ఈడిచ్చింది తీసుకుంటం..ఆడిచ్చిందీ తీసుకుంటం..ఓటు నచ్చినోళ్లకు వేస్తం.. నేనూ, నా భార్య, కొడుకు, బిడ్డ టీఆర్ఎస్ సభకు పోతే రెండువేలు ఇచ్చారు. తెల్లారి బీజేపోళ్ల సభ పెడితే కూడా పోయినం. వాళ్లూ రెండువేలిచ్చారు. రెండు రోజుల్లో నాలుగువేలు వచ్చాయి. మళ్ల నా తాళ్లు నేను గీసుకున్న. మా ఇంట్లో పత్తిచేన్ల కలుపుతీసారు' అంటూ నారాయణపురం మండల కేంద్రానికి చెందిన నర్సింహ అనే గీతకార్మికుడు ఆ రెండు రోజులు నియోజకవర్గంలో జరుగుతున్న తీరు దృశ్యరూపంలో వర్ణించారు. ఇప్పటికైతే వృద్ధులు, మధ్యవయస్కులు, రైతులు టీఆర్ఎస్ వైపే ఎక్కువగా ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తున్నది. యువతకు బీజేపీ గాలం వేస్తున్నది. 'నేను తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నా. నార్కట్‌పల్లిలో రోడ్డురోకోలో గాయమై ఆస్పత్రిపాలైన. రాష్ట్రమొచ్చినాక స్థానిక నేతలెవ్వరూ నన్ను పట్టించుకోలేదు. నా బతుకు నేను బతుకుతున్నా. బీజేపీ వాళ్లు దక్కరకొచ్చి పార్టీలోకి రమ్మని అడిగారు. ఆ పార్టీలో చేరా. టీఆర్ఎస్ సభకూ వెళ్లాను. బీజేపీ సభకూ పోయిన. ఇంకెవ్వరు పిలిచినా వెళ్తాను. గెలిచినంక ఎవ్వడూ ముఖం చూడడు. ఓటేసే నాడు నచ్చినోళ్లకు వేస్తా అంటూనే అప్పట్లో ఉన్న కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలే మంచివి' అని చంద్రకళ అనే ఓటరు అనటం కొసమెరుపు. ముఖ్యంగా ఆ నియోజకవర్గంలో బేస్‌లేని బీజేపీ స్థిరపడేందుకు అనేక అడ్డదారులు తొక్కుతున్నది అనటానికి ఇదొక నిదర్శనం. ప్రలోభాలకు గురి తమ వైపు తిప్పుకునేందుకు నీచమైన ఎత్తుగడలు వేస్తున్నది. 'డబ్బు పంచుడు...స్థానిక నాయకులను గుంజుడు' అనే సిద్ధాంతాన్ని అమలు చేస్తున్నది. ఎవరెటువంటి కష్టాల్లో ఉన్నా...దాన్ని ఆసరా చేసుకుని వారిని బీజేపీ నేతలు లోబర్చుకుంటున్నారు. ఇలాంటి కుతంత్రాలు చేయడంలో అందెవేసిన బీజేపీ... మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని పావుగా వాడుకుంటున్నది. ఆయన రాజీనామాపై కూడా ఓటర్లకు అవగాహన ఉన్నది. తమ స్వార్థం కోసం, కాంట్రాక్టుల కోసం పదవికి రాజీనామా చేసినట్టు మునుగోడులోని స్థానికులు చెబుతున్నారు. 'ఆయన్ను ఎవరు రాజీనామా చేయమన్నరు. అభివృద్ధి కోసమైతే సొంత పార్టీ నుంచి చేయాలిగా? మధ్యలో బీజేపీలోకి పోవడమేంటి?' అని ఓటర్లు నిలదీస్తున్నారు.
ఉప ఎన్నికను బీజేపీ అధిష్టానం సీరియస్‌గా తీసుకున్న నేపథ్యంలో అందుకు టీఆర్ఎస్ కూడా ఎత్తులు వేస్తున్నది. దుబ్బాక, హుజురాబాద్ ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాలను కోల్పోయి కమలనాథులకు ఆయుధాన్ని ఇచ్చిన కారు...ఈసారి దాన్ని ఎత్తులను చిత్తు చేసేందుకు పావులు కదుపుతున్నది. 2018 ఎన్నికల్లో కోల్పోయిన స్థానాన్ని పదిలపర్చుకునేందుకు గులాబీదళం కూడా ప్రచార హోరును ప్రారంభించింది. రైతుబంధు, ఫించన్లు పొందుతున్న వారిని నిలబెట్టుకోవడంతో పాటు సామాజిక తరగతుల వారీగా ఓట్లు పొందేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని స్థానికులు స్వాగతిస్తున్నా... ఆ పార్టీలోని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, మరికొందరు నేతలు బీసీలకు టికెట్ ఇవ్వాలనే వాదాన్ని తెరపైకి తెచ్చారు. ఇది ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. కాంగ్రెస్‌లోనూ ఇదే పరిస్థితి. వారికి డిమాండ్‌కు అంత ప్రాధాన్యత ఉండకపోయినా సగటు ఓటరు ఆలోచించే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. అయితే ఉప ఎన్నికల్లో ఇవేవీ పని చేయబోవనీ, వరదలా పారే డబ్బే సంజీవనిగా పని చేస్తున్నదని రాంరెడ్డి గూడెనానికి చెందిన వెన్నమనేని నర్సింహ్మరావు అభిప్రాయపడ్డారు.
కాంగ్రెస్ పార్టీని ఎవరూ చంపేయాల్సిన పని లేదు. దానికదే చచ్చిపోతుందని కొంత మంది పెద్దలు అంటున్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ ఒకరు కాంగ్రెస్‌లో...మరొకరు బీజేపీలోకి పోవడంపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొంత గందరగోళంలో ఉన్నారు. క్యాడర్‌ను కాపాడుకునేందుకు నాయకులు బాధ్యత తీసుకోవడం లేదు. టికెటు ఆశిస్తున్న వారు కూడా టికెటు వస్తుందో, రాదో తెలియకుండా ఏం చేయలేమని చెబుతున్నారు. 'మంచితనంగించితనం పనికిరాదు..టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులకు ధీటుగా ఖర్చు పెట్టేవారైతేనే కాంగ్రెస్‌ను కొంతలో కొంతైనా ఇగ్గుకు రాగలరు' అని నారాయణపురం మండలానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త బాలయ్య అభిప్రాయపడ్డారు. చాలా మంది కాంగ్రెస్ కార్యకర్తలు అభ్యర్థి ప్రకటన కోసం వేచి చూసే ధోరణిలో ఉన్నారు. రాజగోపాల్‌రెడ్డి కూడా కాంగ్రెస్ పరిణామాలను గుంటకాడి నక్కలా కాచుకుని కూర్చొని తమ వైపు తిప్పుకునేందుకు యత్నిస్తున్నాడని స్థానిక కాంగ్రెస్ నేత మలిగిరెడ్డి నర్సిరెడ్డి చెప్పారు. ఆ నియోజకవర్గంలో కొన్ని దశాబ్ధాలుగా 'రావు...రెడ్డి' సామాజిక తరగతికి చెందిన వారే ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారనే అసంతృప్తి అక్కడక్కడా వినిపిస్తున్నది. ఈనేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు బహుజనులకు టికెట్లు ఇవ్వాలని కొంత మంది స్థానికలు అభిప్రాయపడ్డారు.