Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యార్థి మృతికి సంతాపంగా క్యాండిల్ ర్యాలీ
నవతెలంగాణ- బాసర
నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న రాథోడ్ సురేష్ ఆత్మహత్యకు నిరసనగా బుధవారం విద్యార్థులు రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో తరగతులను బహిష్కరించారు. ఆర్జీయూకేటీ యూనివర్సిటీల్లో సైతం విద్యార్థులు స్వచ్ఛందంగా తరగతులు బహిష్కరించారు. దీంతో యూనివర్సిటీ పరిసరాలు నిర్మానుష్యంగా మారాయి. రాథోడ్ సురేష్ మృతికి సంతాపంగా సాయంత్రం విద్యార్థులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. పలువురు విద్యార్థులు డిచ్పల్లి తండాలో సురేష్ అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఇన్చార్జి వీసీ వెంకట రమణ, డైరెక్టర్ సతీష్‌కుమార్ సైతం సంతాపం వ్యక్తం చేశారు. వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకోవడం కలచివేసిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాథోడ్ సురేష్ ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని కోరుతూ బుధవారం తెలంగాణ జన సమితి నాయకులు సర్దార్ వినోద్ కుమార్ నాయకత్వంలో ట్రిపుల్ ఐటీ ప్రధాన గేటు వద్ద ఆందోళనకు దిగారు. వీరిని పోలీసులు అడ్డుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థి ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించి తక్షణమే ఆ కుటుంబానికి కోటి రూపాయలు అందజేసి, డబుల్ బెడ్‌రూమ్‌తోపాటు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
యూనివర్సిటీలో క్రమశిక్షణ కమిటీ సమావేశం
వరుస సంఘటనల నేపథ్యంలో యూనివర్సిటీ ఇన్చార్జి వైస్ ఛాన్స్లర్ వెంకటరమణ, డైరెక్టర్ సతీష్‌కుమార్ అధ్యక్షతన క్రమశిక్షణ కమిటీని ఏర్పాటు చేసి సమావేశం నిర్వహించారు. క్రమశిక్షణ కమిటీ చైర్మెన్ మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో యూనివర్సిటీ పోలీసులు, అధ్యాపకులు సమావేశంలో పాల్గొన్నారు. అధికారులు పలు సూచనలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని డైరెక్టర్ సతీష్ కుమార్ పేర్కొన్నారు.