Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐకేపీ వీఓఏలూ మీ బిడ్డలే.. మోడీ.. కేసీఆర్ జర చూడండి
- కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వండి
- సమస్యలు పరిష్కరించకుంటే రెండు పార్టీలకూ బుద్ధి చెబుతారు
- ఐక్యంగా ముందుకెళ్లండి..పోరాటం వృథాకాదు:
- ఐకేపీ ధర్నాలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
- వేలాదిగా తరలివచ్చిన వీఓఏలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
'మోడీ గారూ..కేసీఆర్‌గారూ ఐకేపీ వీఓఏలూ మీ బిడ్డలే. ఇచ్చేది రూ.3,900 జీతం. పెరిగిన గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యావసరాల ధరలతో ఎలా బతకాలో మీరే చెప్పండి. ఒకసారి కండ్లు తెరిచి చూడండి. వారి సమస్యలు పరిష్కరించండి. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వండి' అని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. లేదంటే రానున్న ఎన్నికల్లో వీఓఏలంతా బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలకు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు. డిమాండ్లు పరిష్కారమయ్యే దాకా కలిసికట్టుగా పోరాటం చేయాలని వీఓఏలకు పిలుపునిచ్చారు. పోరాటం వృథా కాదనీ, విజయం తప్పనిసరిగా వరిస్తుందని పలు ఉద్యమాల ఫలితాలను విడమర్చి చెప్పారు.
తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గురువారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద తెలంగాణ ఐకేపీ వీఓఏ ఉద్యోగుల సంఘం(సీఐటీయూ) ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అక్కడకు వేలాది మంది వీఓఏలు తరలివచ్చారు. ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం.నగేశ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జూలకంటి మాట్లాడుతూ..గ్రామాల్లో పేద నిర్మూలన కోసం 18 ఏండ్ల నుంచి నుంచి 17,600 మంది ఐకేపీ వీఓఏలు పనిచేస్తున్నారని చెప్పారు. ఒక ఎమ్మెల్యే అసెంబ్లీకి హాజరైతే ఒక పూటకు తీసుకునే వేతనంతో వీఓఏలు నెలంతా ఎలా బతుకుతారు? అని పాలకులను ప్రశ్నించారు. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఐకేపీ వీఓఏలకు రూ.10 వేలకుపైగా వేతనాలు ఇస్తున్నారనీ, మన రాష్ట్రంలో అది ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించారు. 60 అధికారాలు కేంద్రం వద్ద, 40 శాతం అధికారాలు రాష్ట్రం వద్ద ఉన్నాయనీ, ప్రజలపై రెండు ప్రభుత్వాలూ పన్నులు వేస్తున్నాయని వివరించారు. అందువల్ల వీఓఏలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం చొప్పున కనీస వేతనం రూ.26 వేల జీతం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రధాని, సీఎంలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు లక్షల రూపాయల వేతనాలు పెంచుకునేటప్పుడు కష్టపడి పనిచేసే సామాన్యులు, కార్మికులకు కూడా జీతాలు పెంచాలనే కనీస ఆలోచన ఎందుకు రావట్లేదని నిలదీశారు. మీరు గద్దెనెక్కడానికి వారు సహకరించడం లేదా? వారు భారత పౌరులు కాదా? ఎందుకు జీతాలు పెంచడం లేదని ప్రశ్నించారు.
తెలంగాణ ఐకేపీ వీఓఏ ఉద్యోగుల సంఘం (సీఐటీయూ) గౌరవాధ్యక్షులు ఎస్వీ. రమ మాట్లాడుతూ..18 ఏండ్లుగా పనిచేస్తున్న వీఓఏలకు కనీస గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారిని సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలనీ, ప్రతి ఒక్కరికీ ఐడీ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారికిచ్చే రూ.3,900 అరకొర జీతంలో సెల్‌ఫోన్, ఇంటర్నెట్ రీచార్జిలకే నెలకు వెయ్యి రూపాయలు ఖర్చవుతున్నదని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రతి వీఓఏకు ఉచితంగా ల్యాప్‌ట్యాప్ ఇచ్చి ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పదిలక్షల సాధారణ బీమా, ఆరోగ్య బీమా సౌకర్యాలు కల్పించాలని కోరారు. వీఓఏలకు సీసీలుగా ఉద్యోగోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. వీఓఏలలో ఎక్కువగా మహిళలే ఉన్నారనీ, వారికి ప్రసూతి సెలవులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్ మాట్లాడుతూ..రాష్ట్ర అభివృద్ధిలో ఐకేపీ వీఓఏల పాత్ర కీలకమని చెప్పారు. కరోనా సమయంలో కూడా కష్టపడి పనిచేసిన విషయాన్ని ప్రస్తావించారు. వారి మద్దతు లేకపోతే ప్రభుత్వం అన్ని కార్యక్రమాలను సజావుగా నిర్వహించగలిగేదా? అని ప్రశ్నించారు. వారి న్యాయ పరమైన డిమాండ్లను పాలకులు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విద్వేషాలతో రెచ్చగొట్టేవారికి, మాయమాటలతో నమ్మించే వారికి కాకుండా ప్రజా సమస్యలపై పోరాడే వారికి చట్టసభలకు పంపేలా ఆలోచించి ఓటేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో తెలంగాణ ఐకేపీ వీఓఏ ఉద్యోగుల సంఘం(సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.సుధాకర్, కోశాధికారి సుమలత, సునిత, రాజ్‌కుమార్, రమేశ్, వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్కేవీ, వీఓఏల స్వతంత్ర సంఘాల నుంచి వీఓఏలు పెద్దఎత్తున సీఐటీయూలో చేరారు. వారిలో తాజుద్దీన్, మాన్సింగ్, శివరాం, విక్రమ్, సరిత, గోపాల్‌రెడ్డి, శివరామ్, లలిత, లక్ష్మి, జంగయ్య, మంజూల, చాంద్‌బీ, లలితతో వందమందికిపైగా చేరారు.