Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉద్యమ పంథాకు పార్లమెంటరీ పంథాను సమన్వయం చేయాలి
- రైతు వ్యతిరేకులతోనూ జై కిసాన్ అనిపించాలి
- 26 రాష్ట్రాల రైతు నేతలతో సీఎం కేసీఆర్
- ముగిసిన రైతు నేతల రాష్ట్ర పర్యటన
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఉద్యమ పంథాకు పార్లమెంటరీ పంథాను సమన్వయం చేసి జమిలి పోరాటాలు సాగించడం ద్వారానే భారతదేశ వ్యవసాయ, రైతాంగ సమస్యలకు పరిష్కారం సాధ్యమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తాము ఇలాంటి జమిలి పంథానే అనుసరించామని ఉదహరించారు. ఆనాడు తెలంగాణ వ్యతిరేకులతో 'జై తెలంగాణ' నినాదాన్ని అనిపించినట్టే.. నేడు రైతు వ్యతిరేకులతో 'జై కిసాన్ నినాదాన్ని పలికించాలన్నారు. ఆ దిశగా దేశంలోని రైతు నేతలంతా ఐక్య సంఘటన కట్టాలని పిలుపునిచ్చారు. రైతు బాగుంటేనే వ్యవసాయం బాగుంటుందనీ, తద్వారా సమాజం బాగు పడుతుందన్నారు. దేశంలో రైతు మర్యాదను నిలబెట్టి, ఆత్మ గౌరవం కాపాడేందుకు కలిసి పనిచేద్దామంటూ ఆయన జాతీయ రైతు నేతలకు ప్రతిపాదించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక అసంబద్ద విధానాలను తిప్పికొట్టి వ్యవసాయ రంగాన్ని కాపాడుకుందామన్నారు. ఈ సందర్భంగా దేశ రైతాంగాన్ని గ్రామస్థాయి నుంచీ ఐక్యం చేసేందుకు నాయకత్వం వహించాలని సీఎం కేసీఆర్‌ను సమావేశం ముక్తకంఠంతో కోరుతూ తీర్మానించినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎమ్ఓ) తెలిపింది. జాతీయ స్థాయిలో రైతుల ఐక్య వేదిక ఏర్పాటు చేయాలనే శనివారం నాటి తీర్మానాన్ని అనుసరిస్తూ ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అధ్యక్షతన ఆదివారం చర్చ కొనసాగినట్టు సీఎమ్ఓ తెలిపింది. త్వరలో మరో సమావేశం ఏర్పాటు చేసి, దానికి సంబంధించిన విధి విధానాలను రూపొందించాలని సమావేశం తీర్మానించినట్టు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవసాయ, రైతు వ్యతిరేక విధానాల వల్ల భవిష్యత్ దేశీయ వ్యవసాయ రంగం కునారిల్లిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలు రాష్ట్రాలకు చెందిన జాతీయ రైతు సంఘాల నేతలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. నేటి పరిస్థితులకు అవలంబించాల్సిన ఉద్యమ కార్యాచరణ విధి విధానాలు, పోరాట రూపాల బ్లూ ప్రింట్‌ను తయారు చేసి దేశ రైతాంగాన్ని సంఘటితం చేసే దిశగా చర్యలు ప్రారంభించాలనీ, దానికి అనుసరించాల్సిన వ్యూహాన్ని సిద్దం చేయాలని రైతు సంఘాల నేతలు సీఎం కేసీఆర్ ను కోరుతూ అభిప్రాయాలు వ్యక్తం చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మరోసారి జోక్యం చేసుకొని జట్టుకట్టి, పట్టు పడితే, సాధించలేనిది ఏమీ లేదన్నారు. వ్యవసాయం దేశ ప్రజల జీవన విధానమనీ, దాని నుంచి రైతుల్ని ఎవరూ వేరు చేయలేరన్నారు. ఈ సందర్భంగా రైతు నేతలకు తెలంగాణ ఉద్యమ నేపథ్యాన్ని వివరించారు. శాంతియుత పంథాలో పార్లమెంటరీ పోరాటం చేద్దామన్నారు.ఉద్యమాలు, ఆందోళనల పేరుతో చట్టసభలకు దూరంగా జరిగే పోరాటాలు సఫలీకతం కాలేవన్నారు. రాజకీయాలు చేయడాన్ని నామోషీగా భావించొద్దన్నారు. దేశానికి అన్నంపెట్టే రైతులు చట్టసభల్లోకి ఎందుకు వెళ్లకూడదని ప్రశ్నించారు. రాజకీయాల్లో రైతు నేతలు భాగస్వాములు కావాలని కోరారు. జాతీయస్థాయిలో ఐక్య సంఘటనను నిర్మిద్దామన్నారు. అయితే పలువురు రైతు సంఘాల నేతలు ఆ బాధ్యతల్ని సీఎం కేసీఆర్ తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అమలవుతున్నా రైతు బంధు, రైతు బీమా,దళితబంధు తదితర పథకాలు వివరించారు.