Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ ప్రభుత్వం, డిస్కంలకు కేంద్రం ఆదేశం
- అసలు రూ.3,441.78 కోట్లు...
- సర్‌చార్జి రూ.3,315.14 కోట్లు.. మొత్తం రూ.6,756.92 కోట్లు చెల్లించాలని ఆదేశాలు
- ఏపీనే రూ.12,532 కోట్లు ఇవ్వాలి:తెలంగాణ విద్యుత్ సంస్థలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ ప్రభుత్వం వినియోగిం చుకున్న విద్యుత్‌కు సంబంధించిన బకాయిలును 30 రోజల్లో చెల్లించాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ డిప్యూటీ కార్యదర్శి అనూప్ సింగ్ బిష్ పేరుతో సోమవారం ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014 ప్రకారం ఈ బకాయిలను తెలంగాణ విద్యుత్ సంస్థలు లేదా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిందేనని స్పష్టంచేశారు. 2014 జూన్ 2వ తేదీ నుంచి 2017 జూన్ 10వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థల నుంచి కరెంటును వాడుకున్నదని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. అసలు రూ,3,441.78 కోట్లు, ఆలస్య రుసుం సర్‌చార్జి రూ.3,315.14 కోట్లు...మొత్తం కలిపి రూ.6,756.92 కోట్లను నెలరోజుల్లో చెల్లించాలని ఆ ఆదేశాల్లో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలతో కొనుగోలు ఒప్పందాలను కూడా తెలంగాణ విద్యుత్ సంస్థలు, ప్రభుత్వం ఉల్లంఘించాయని ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే దీనిపై టీఎస్ జెన్కో, ట్రాన్స్‌కో సీఎమ్‌డీ దేవులపల్లి ప్రభాకరరావు గతంలోనే స్పందించారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలు, అక్కడి ప్రభుత్వం తెలంగాణకు విద్యుత్ సరఫరా విషయంలో అనేక ఇబ్బందులు పెట్టాయనీ, వాటివల్లే తాము బహిరంగ మార్కెట్లో అధిక ధరకు కరెంటును కొనుగోలు చేయాల్సి వచ్చిందని తెలిపారు. ఈ విషయాన్ని తాము కేంద్రప్రభుత్వం దృష్టికికూడా తీసుకెళ్లినట్టు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని విద్యుత్ సంస్థల్లో తెలంగాణ రాష్ట్ర వాటాలు ఉన్నాయనీ తెలిపారు. దీనిపై ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలు న్యాయస్థానంలో కేసు దాఖలు చేశాయనీ, దాన్ని ఉపసంహరించుకుంటే బకాయిలు సర్దుబాటుకు తాము సిద్ధంగా ఉన్నట్టు గతంలోనే ఆ రాష్ట్ర విద్యుత్ సంస్థల ఉన్నతాధికారులకు తెలిపామన్నారు. గతంలో ఇరు రాష్ట్రాల విద్యుత్ సంస్థల అధికారుల ఉమ్మడి సమావేశాల్లో ఏపీ నుంచి తెలంగాణ విద్యుత్ సంస్థలకు రూ.15,974 కోట్లు రావల్సి ఉన్నట్టు లెక్క తేల్చామన్నారు. దీనిలో ఏపీకి ఇవ్వాల్సిన రూ.3,442 కోట్లను మినహాయించుకొని, మిగిలిన రూ.12,532 కోట్లను చెల్లించాలని ఏపీ విద్యుత్ సంస్థలను కోరినట్టు ప్రభాకరరావు చెప్పారు. న్యాయస్థానంలో ఉన్న ఈ విషయంపై ఇప్పుడు కేంద్రప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. అయితే ఈనెల 22న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీని కలిసి, తెలంగాణ విద్యుత్ సంస్థల నుంచి తమకు రూ.6,756 కోట్లు రావల్సి ఉన్నదనీ, ఆ సొమ్ము ఇప్పిస్తే, తమ విద్యుత్ సంస్థలు ఉత్పత్తిదారులకు బకాయిలు చెల్లిస్తాయని రాతపూర్వకంగా అభ్యర్థించి వచ్చారు. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ ఈ ఆదేశాలు ఇవ్వడం గమనార్హం.