Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
అనారోగ్యంతో ఉండటంతో ఉద్యోగం చేయలేక తన వీఆర్ఏ కొలువును కొడుకుకు ఇవ్వాలని కోరిన పాపానికి ఉన్న ఉద్యోగం పోయింది. వయస్సు ఎక్కువ ఉన్నదని ఉద్యోగాన్నే తీసేసారు. ఇక అప్పటి నుంచి తన ఉద్యోగం కోసం కాళ్లు అరిగెేలా అధికారులు, ప్రభుత్వ పెద్దల చుట్టూ తిరుగుతున్నాడు. అయినా ఫలితం లేకపోయింది. చివరకు తన ఉద్యోగం ఇప్పించాలని జిల్లా కలెక్టర్ ముందే మంత్రి కాళ్లపై పడ్డారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన దళిత బంధు సమీక్షా సమావేశానికి విచ్చేసిన మంత్రి సబితాఇంద్రారెడ్డి బయటకు వస్తున్న సమయంలో అందె జంగయ్య మంత్రి కాళ్లపై పడ్డారు. యేండ్లుగా తిరుగుతున్నా పని జరగడం లేదంటూ మంత్రికి మొరపెట్టుకున్నాడు. ఒక్కసారిగా తన పరిస్థితి చెబుతూ మంత్రి కాళ్లపై పడ్డాడు. మంత్రితో పాటూ అక్కడున్న వారు అతన్ని లేపారు. పెద్దవారు కాళ్లపై పడొద్దని మంత్రి వారించి, పక్కనే ఉన్న జిల్లా కలెక్టర్‌ను ఆ పని చూడాలని అదేశించారు. వీఆర్ఏల సంఘానికి రాష్ట్ర గౌరవ అధ్యక్షునిగా కొనసాగుతున్న అతను.. నాడు అందరి కోసం నిర్వహించిన పోరాటంతో వీఆర్ఏలకు పేస్కేల్ సాధించారు. నేడు తన కోసం తాపత్రయపడుతున్నాడు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం చిన్నతుండ్లకు చెందిన జంగయ్య వీఆర్ఏగా సుమారు 30ఏండ్లకు పైగా విధులు నిర్వహిస్తున్నాడు. 2017లో అనారోగ్యం బారిన పడి ఆపరేషన్ చేయించుకోగా.. తన ఉద్యోగ్యాన్ని తన కొడుకుకు ఇవ్వాలని కోరినా ఇవ్వలేదని తెలిపారు. దాంతో మరల తన ఆరోగ్యం బాగైనప్పటి నుంచి తనకే వీఆర్ఏగా అవకాశమివ్వాలని అధికారులకు విన్నవించుకున్నాడు. అయినా వారు పట్టించుకోలేదు. కాగా, 2011 తర్వాత నియామకం అయిన వీఆర్ఏలకే పదవీ విరమణ వర్తిస్తుందని, తాను 1980లో నియామకం అయినందున పదవీ విరమణ వయసు ఉండదని జంగయ్య తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో ఉన్న డీఆర్వో తనకు వయస్సు అధికంగా ఉన్నందున వీఆర్ఏగా మళ్లీ తీసుకోలేమని ఉత్తర్వులిచ్చారన్నారు. తెలంగాణలోనే మహబూబాబాద్‌లో 87 ఏండ్లున్న వారిని కూడా ఇటీవల తిరిగి విధుల్లో చేర్చుకున్నారని తెలిపారు.