Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లోయర్ ట్యాంక్‌బండ్‌లో తీవ్ర ఉద్రిక్తత
- ఒకేసారి పదివేల మందిరాకతో అయోమయం
- పోలీసుల లాఠీచార్జి..పలువురికి గాయాలు
- ఎక్కడికక్కడ అరెస్టు చేసి పీఎస్‌లకు తరలింపు
- పరిస్థితి చేజారుతుండటంతో చర్చలకు ఆహ్వానించిన మంత్రి కేటీఆర్
- 20వ తేదీ వరకు అవకాశమివ్వాలని కోరిన మంత్రి
- సమ్మె విరమించాలని వేడుకోలు.. తిరస్కరించిన వీఆర్ఏలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అసెంబ్లీ ముట్టడికి వీఆర్ఏలు శతవిధాలా ప్రయత్నించారు. ఇందిరాపార్కు నుంచి లోయర్ ట్యాంక్‌బండ్ మీదుగా అసెంబ్లీవైపు పరుగులు తీశారు. పోలీసులు తేరుకునేలోపే వేలాది మంది జమ కావడంతో ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఒక బ్యాచ్ తెలుగుతల్లి ప్లైఓవర్ ఎక్కగా..మరో గుంపు లోయర్ ట్యాంక్ బండ్ వైపు ర్యాలీగా వెళ్లారు. అంబేద్కర్ విగ్రహం సమీపం వరకు నినాదాలు చేసుకుంటూ దూసుకెళ్లారు. అక్కడ పోలీసులు బారీకేడ్లు, ముండ్ల కంచెలు వేసి అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే కొందరు వీఆర్ఏలు 'గొంతొమ్మ కోర్కెలు కాదు..ఇచ్చిన హామీలు నెరవేర్చండి...పేస్కేలు ఇవ్వాలి..ఇవ్వాలి.. ప్రమోషన్లు ఇవ్వాలి..ఇవ్వాలి..వారసత్వ ఉద్యోగాలివ్వాలి..అర్థంలేని ఆందోళన కాదు..న్యాయమైన సమ్మె' అంటూ నినాదాలు చేసుకుంటూ అసెంబ్లీ వైపు వెళ్లేందుకు మళ్లీ ప్రయత్నించారు. దీంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. మహిళా వీఆర్వోలు అని కూడా చూడకుండా లాఠీలు ఝులిపించారు. దీంతో పలువురికి గాయాలయ్యాయి. కొంతమందిని అరెస్టు చేసి పీఎస్‌లకు తరలించారు. అయినా అక్కడ నుంచి కదిలేది లేదని మిగతావారు భీష్మించుకుని నిల్చున్నారు. ఏం జరుగుతుందో అనిగ్రహించేలోపే వీఆర్ఏలు వేలాదిగా పోగు కావడంతో పోలీసులు నిశ్చేష్టులయ్యారు. ట్యాంక్‌బండ్, అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. షాపులన్నీ మూసేయించారు. అయినా, వీఆర్ఏలు అక్కడ నుంచి కదలలేదు. పరిస్థితి చేయిదాటిపోతుందని గ్రహించిన సీపీ ఆనంద్, అదనపు సీపీ చౌహాన్, ఇతర పోలీసు ఉన్నతాధికారులు జేఏసీ నాయకులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. సీఎస్‌తో చర్చలు జరిపిస్తామని నచ్చజెప్పారు. అంతలోనే మంత్రి కేటీఆర్ నుంచి పిలుపు వచ్చింది. దీంతో వీఆర్ఏ జేఏసీ సెక్రెటరీ జనరల్ ఎస్కే దాదేమియా, కో-కన్వీనర్లు వెంకటేశ్ యాదవ్, వంగూరు రాములు, మహ్మద్ రఫి, ఆయా జిల్లాల జేఏసీ చైర్మెన్లతో కూడిన 20 మంది బృందాన్ని పోలీసులు అసెంబ్లీకి తీసుకెళ్లారు. అక్కడ మంత్రి కేటీఆర్ ఛాంబర్లో వీఆర్ఏ జేఏసీ బృందంతో మంత్రి భేటీ అయ్యారు. వీఆర్ఏల డిమాండ్లు న్యాయమైనవేననీ, వారి సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని కేటీఆర్ చెప్పారు. వీఆర్ఏలు కూడా తెలంగాణ బిడ్డలేననీ, వారి చనిపోతుండటం బాధగా ఉందని చెప్పారు. డిమాండ్లపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం కాబట్టి సమ్మెను విరమించాలని కోరారు. వారి ముందే సీఎస్‌తో ఫోన్లో మాట్లాడి వీఆర్ఏల అంశంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. 'వరుసగా స్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవాలు, జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు కార్యక్రమాలు ఉండటంతో కొంత ఆలస్యం అయిన మాట వాస్తవమే. అవి ముగియగానే ఈ నెల 19 లేదా 20 తేదీల్లో వీఆర్ఏ జేఏసీ నేతలను చర్చలకు పిలుస్తాం' అని సీఎస్ ఫోన్ ద్వారా చెప్పారని జేఏసీ నేతలు చెప్పారు. అయితే, సమ్మెను విరమించాలనే మంత్రి సూచనను వారు తిరస్కరించారు.
చర్చలకు పిలవడం పట్ల వీఆర్ఏ జేఏసీ నేతల హర్షం
ప్రభుత్వం తరఫున కేటీఆర్ తమను పిలిచి 45 నిమిషాల పాటు తమ వాదనలు వినడం పట్ల వీఆర్ఏ జేఏసీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. అయితే, తమ సమ్మెను విరమించబోమని మంత్రికి స్పష్టం చేశామన్నారు. అయితే, తమ దీక్షా శిబిరాల్లో యధావిధిగా నిరసనలను కొనసాగిస్తామన్నారు. తామెక్కడ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేదనీ, తమకు అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ఇచ్చిన నాలుగు హామీలను నెరవేర్చాలని కోరుతున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం 20వ తేదీ వరకు గడువు అడిగింది కాబట్టి వేచిచూస్తామన్నారు. అప్పటికీ చర్చలకు పిలిచి సమస్యను పరిష్కరించకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. అనేక ప్రయాసలకోర్చి మూడ్రోజుల ముందుగానే హైదరాబాద్‌కొచ్చి తమ పోరాట ఐక్యతను ప్రదర్శించిన 16 వేల మంది వీఆర్ఏలకు జేఏసీ నేతలు అభినందనలు తెలిపారు. తమ సమస్యలను ప్రభుత్వం వీలైనంత త్వరగా పరిష్కరిస్తుందనే నమ్మకం ఉందని చెప్పారు.
ఇంటలిజెన్స్ కండ్లు గప్పి...
అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో సహజంగా ఆందోళనలకు తావు లేకుండా అధికారులు చూస్తారు. పిలుపులు, పోరాటాలు, ముట్టడిలను ముందుగానే పసిగట్టి పోలీసులకు ఇంటెలిజెన్స్ అధికారులు సమాచారమిస్తారు. కానీ, వీఆర్ఏల విషయంలో మాత్రం పసిగట్టలేకపోయారు. మూడు రోజుల ముందుగానే వీఆర్ఏలంతా తమ బంధువులు, తెలిసిన వారి ఇండ్లకు చేరుకున్నారు. ప్రత్యేకంగా వెహికిల్స్ కట్టుకుని మండలాల వారీగా వస్తే పోలీసులు గుర్తిస్తారనే ఉద్దేశంతో ఎవరికి వారు విడివిడిగా బస్సులు, రైళ్ల ద్వారా హైదరాబాద్‌కు వచ్చారు. కరెక్టుగా ఇందిరాపార్కు వద్దకు మంగళవారం ఉదయం 11 గంటలకు రావాలనే ఇంటర్నల్ పిలుపు తూచా తప్పకుండా పాటించారు. వీఆర్ఏలు ఎవరి సద్దులు వారే కట్టుకుని ఇందిరాపార్కు సిగల్ వద్దకు గల్లీల ఉంచి ఒక్కసారిగా అక్కడకు చేరుకున్నారు. ఒక్కరు..ఇద్దరు..పదులు..ఇలా నిమిషాల వ్యవధిలోనే వందల మంది పోగయ్యారు. పోలీసులు అక్కడకు వచ్చేసరికే వారికి జతగా వేలాది మంది వీఆర్ఏలు జతయ్యారు. దీంతో అక్కడ ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు లోయర్‌ట్యాంక్ రోడ్డు, ప్లఓవర్ను క్లోజ్ చేసేందుకు యత్నించారు. అప్పటికీ వాటిని వీఆర్ఏలు దాటేశారు.