Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీసులను నిలదీసిన సింగరేణి కార్మికులు... ప్రభుత్వంపై ఆగ్రహం
- సింగరేణి కాంట్రాక్టు కార్మికులచలోఅసెంబ్లీ ఉద్రిక్తం
- మద్దతు ప్రకటించిన వామపక్ష రాజకీయ పార్టీలు
- న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి : వక్తలు
నవతెలంగాణ- సిటీబ్యూరో
'మమ్ముల్నెందుకు అరెస్టు చేస్తున్నారు. మాకు వేతనాలు పెంచాలనడం తప్పా.. సింగరేణి లాభాల్లో మా భాగస్వామ్యం లేదా?. మీరు మా సమస్యలు పరిష్కారిస్తారా? ప్రభుత్వానికి చెప్పుకోవడానికి పోతుంటే ఎందుకు అరెస్టు చేస్తున్నారు?' అంటూ సింగరేణి మహిళా కార్మికులు పోలీసులను నిలదీశారు. కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినదించారు. సింగరేణి కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంచాలని, మరో 18 డిమాండ్లతో మంగళవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి తలపెట్టిన 'చలో అసెంబ్లీ' కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. కార్మిక సంఘాల జేఏసీ నాయకులు, కార్మికులను పోలీసులు అరెస్టు చేసి అఫ్జల్‌గంజ్, గోషామహల్, గోపాలపురం, అంబర్పేట్, మలక్‌పేట్ స్టేషన్లకు తరలించారు. ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్న కార్మికులను గోపాలపురం పోలీసులు అరెస్టు చేసి ఫోన్లను లాక్కున్నారు. అరెస్టు చేసిన వారిని ఇంతవరకు విడుదల చేయకపోవడంతో కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతకుముందు సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ) ప్రధాన కార్యదర్శి గుత్తుల సత్యనారాయణ అధ్యక్షతన సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్య మాట్లాడారు. సింగరేణి లాభాల్లో కాంట్రాక్టు కార్మికుల శ్రమ దాగి ఉందని చెప్పారు. కార్మికుల డిమాండ్లు గొంతెమ్మ కోర్కెలు కాదని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను అడుగుతున్నారని గుర్తుచేశారు. సింగరేణి ప్రమాదంలో ఉందని, అంబానీ, అదానీలకు కట్టబెట్టేందుకు మోడీ సర్కార్ కుట్రలు చేస్తుంటే కార్మికులతో కలిసి అడ్డుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందన్నారు. అసెంబ్లీలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని చెప్పిన సీఎం కేసీఆర్.. సింగరేణి కార్మికుల సమస్యలను ఎందుకు విస్మరిస్తున్నారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. సింగరేణి లాభాల్లో ఉండాలన్నా, సంస్థను పరిరక్షించుకోవాలన్నా కాంట్రాక్టు కార్మికుల పాత్ర లేకుంటే సాధ్యమా? ఆలోచించాలన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కార్మిక సంఘాల జేఏసీ నేతలతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికులు చేసే ప్రతి పోరాటానికి సీపీఐ(ఎం) మద్దతు ఉంటుందని ప్రకటించారు. సీపీఐ రాష్ట్ర మాజీ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. పోరాటాలు, ఉద్యమాలను పోలీసులతో అణచివేయడం కేసీఆర్ ప్రభుత్వం మానుకోవాలని, ఉద్యమాలు లేకపోతే తెలంగాణ వచ్చేదా? అని ప్రశ్నించారు. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కార్మికులు డిమాండ్ చేయడం తప్పా? అని అడిగారు. కాంట్రాక్టు కార్మికులు రెక్కలు ముక్కలు చేసుకుని శ్రమిస్తేనే సింగరేణికి లాభాలొస్తున్నాయని, వారు వేతనాలు పెంచాలనడం న్యాయమైన డిమాండ్ అని అన్నారు. ఖాళీగా ఉన్న క్వార్టర్లను కేటాయించాలని, బోనస్ ఇవ్వాలన్న డిమాండ్లను పరిష్కరించాలన్నారు. సింగరేణి కార్మికులకు కేసీఆర్ ఇచ్చిన మాట తప్పకుండా అమలు చేయాలని, మాట తప్పితే ప్రజలు క్షమించరని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ.. ప్రజలకు రక్షణ ఉండాల్సిన పోలీసులు పాలకులకు తాబేదార్లుగా ఉన్నారని, కార్మికుల పోరాటాన్ని అణచివేయడానికి ప్రయత్నించడం మానుకోవాలని అన్నారు. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ గురించి కేసీఆర్ అసెంబ్లీలో ప్రసంగించారని, ఇక్కడ ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ ఉంటే ఇంత మంది పోలీసులు అవసరం లేదన్నారు. సింగరేణి కార్మికులను ఎక్కడికక్కడ అరెస్టు చేశారని, అరెస్టులకు భయపడేదిలేదని హెచ్చరించారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అజీజ్‌పాషా, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సాదినేణి వెంకటేశ్వర్లు, నాయకులు జేబీ చలపతి మాట్లాడుతూ.. సింగరేణి కాంట్రాక్టు కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలన్నారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ.. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులపై అభండాలు వేయడం మానుకోవాలని హితవు పలికారు. సమ్మె, చలో అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొన్న కార్మికులను తొలగిస్తామని కాంట్రాక్టర్లు, సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం బెదిరింపులకు గురి చేస్తోందని, కార్మికులను ముట్టుకుంటే డొక్కచీల్చి డోలు కడ తామని హెచ్చరించారు. ఏఐటీయూసీ నాయకులు చంద్రయ్య, ఐఎఫ్టీయూ నాయకులు శ్రీనివాస్, కె.సూర్యం, జి.అనురాధ, బీఎంఎస్ నాయకులు మహేష్, హెచ్ఎంఎస్ నాయకులు రమేష్, జేఏసీ నాయకులు సత్యనారాయణ, బి.మధు, ఎరగాని కృష్ణయ్య, దేవరకొండ శంకర్, యాకూబ్ షా వలీ, వై.ఆంజనేయులు, సతీష్, నాగేశ్వర్రావు, కె.విశ్వనాథ్, కె.సురేందర్, కుమారి, సైదమ్మ, కళావతి, అరుణ, శిరీష పాల్గొన్నారు.