Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూఎస్పీసీ ఆధ్వర్యంలో చలో అసెంబ్లీ
- అసెంబ్లీ ఎదురుగా కొద్దిసేపు ఉద్రిక్తత
- వందలాది మంది స్టీరింగ్ కమిటీ సభ్యులు, టీచర్ల అరెస్ట్
నవతెలంగాణ-సిటీబ్యూరో
బదిలీలు, పదోన్నతులు, పాఠ్యపుస్తకాలు, విద్యావాలంటీర్ల సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయులు కదం తొక్కారు. యూఎస్పీసీ చలో అసెంబ్లీ ఉద్రిక్తంగా మారింది. అసెంబ్లీ పరిసరాల ప్రాంతాల్లో భారీగా పోలీసుల మోహరింపు.. ఎన్ని అడ్డంకులను సృష్టించినా మంగళవారం పోలీసుల వలయాన్ని చేధించుకుని స్టీరింగ్ కమిటీ సభ్యులతో కలిసి వివిధ జిల్లాల నుంచి వచ్చిన వందలాది మంది ఉపాధ్యాయులు చలో అసెంబ్లీ ర్యాలీని విజయవంతంగా కొనసాగించారు. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేయాలనీ, జీవో 317 అమలు కారణంగా నష్టపోయిన ఉపాధ్యాయులు, 13 జిల్లాల స్పౌజ్ టీచర్లకు న్యాయం చేయాలనీ, విద్యావాలంటీర్లు, పారిశుధ్య కార్మికులను వెంటనే నియమించాలని, పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు సరఫరా చేయాలనీ, సీపీఎస్ విధానం రద్దు కోరుతూ యూఎస్పీసీ ఆధ్వర్యంలో చలో అసెంబ్లీ చేపట్టారు.
రాష్ట్రం నలుమూలల నుంచి వందలాది ఉపాధ్యాయులు ఉదయం 11.00కు సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి చేరుకుని అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి నారాయణగూడ, హిమాయత్ నగర్, లిబర్టీ, బషీర్బాగ్ మీదుగా అసెంబ్లీ ఎదురుగా పోలీసు కంట్రోల్ రూమ్ వరకు ప్రదర్శన నిర్వహించారు. మధ్యాహ్నం 12.00 గంటలకు పోలీసు కంట్రోల్ రూమ్ వద్ద బ్యారికేడ్లు పెట్టి ప్రదర్శకులను పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత ఏర్పడింది. ఆందోళనకారులను అరెస్టు చేసి ఆసిఫ్ నగర్, గోషామహల్, నారాయణగూడ, గోల్కొండ తదితర పోలీసు స్టేషన్లకు తరలించారు.
చలో అసెంబ్లీ ర్యాలీకి యూఎస్పీసీ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు కె.జంగయ్య, వై.అశోక్ కుమార్, ఎం.రఘుశంకర్ రెడ్డి, ఎం.రవీందర్, టి.లింగారెడ్డి, బి.కొండయ్య, జాదవ్ వెంకట్రావు, మేడి చరణ్ దాస్, ఎన్.యాదగిరి, సయ్యద్ షౌకత్ అలీ, వై విజయకుమార్, చావ రవి నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యూఎస్పీసీ ఆందోళన కేవలం ఉపాధ్యాయుల కోసం కాదనీ, ప్రభుత్వ పాఠశాలలు, విద్యారంగం సమస్యల పరిష్కారం కోసమనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మన ఊరు - మన బడి, ఇంగ్లీషు మీడియం అమలు చేస్తున్న ప్రభుత్వం, పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత, పారిశుధ్యం నిర్వహణ పట్ల ఉదాశీనంగా వ్యవహరించటం తగదని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం విజ్ఞతతో వ్యవహరించి యూఎస్పీసీ నాయకులతో చర్చించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
అరెస్టులపై తెలంగాణ
విద్యాపరిరక్షణ కమిటీ ఖండన
ఉపాధ్యాయ లోకం సమరశీల పోరాటానికి తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ తన సంపూర్ణ మద్దతు ప్రకటించింది. అసెంబ్లీ సాక్షిగా వాగ్దానం చేసి, ఉపాధ్యాయుల సమస్యలను, విద్యారంగం సమస్యలను పరిష్కరించకుండా.. దానిపై నిరసన తెలిపిన వాళ్లను అరెస్టు చేయడాన్ని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ తీవ్రంగా ఖండించింది. ఇప్పటికైనా నియంతృత్వ ధోరణులను మానుకొని, ప్రజాస్వామ్య విలువలను గుర్తెరిగి, ఉపాధ్యాయ సంఘాల నాయకులను వెంటనే చర్చలకు పిలువాలని సీఎం కేసీఆర్ను కమిటీ డిమాండ్ చేసింది.