Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇదే బీజేపీ సిద్ధాంతం
- బలమైన కేంద్రం...బలహీన రాష్ట్రాలతో జీడీపీ పెరగదు
- మత మంటల సంస్కృతి బీజేపీది...పాడి పంటల నైజం టీఆర్ఎస్ది
- ఎఫ్ఆర్బీఎం చట్టం అమలుపై చర్చలో మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఎనిమిదేండ్ల బీజేపీ ప్రభుత్వ పాలన సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని రాష్ట్ర ఆర్థిక, వైద్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. 'విఫలం...విషం...విద్వేషం' అనే సిద్ధాంతంతో బీజేపీ ముందుకుపోతున్నదని విమర్శించారు. దేశంలో అది బలమైన కేంద్రాన్ని నిర్మించి, రాష్ట్రాలను బలహీనపరుస్తున్నదని విమర్శించారు. దీంతో దేశ స్థూలజాతీయోత్పత్తి పెరగడం లేదని చెప్పారు. ఫిస్కల్ రెస్సాన్సిబిలిటీ అండ్ బడ్జెటరీ మేనేజ్మెంట్ (ఎఫ్ఆర్బీఎం) చట్టాన్ని వివిధ రాష్ట్రాల పట్ల కేంద్రం పక్షపాతంగా అమలు చేస్తున్నదని చెప్పారు. మంగళవారం శాసనసభ, శాసనమండలిలో 'ఎఫ్ఆర్బీఎం చట్టం అమలులో కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ వైఖరి- రాష్ట్ర ప్రగతిపై ప్రభావం' అనే అంశంపై స్వల్పకాలిక చర్చలో ఆయన మాట్లాడారు. దేశంలో బీజేపీ మత మంటలు పెడతుంటే, రాష్ట్రంలో వాటిలో పచ్చని పంటలు పండిస్తున్నదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంపై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. రాష్ట్రాల అప్పులకు రికవరీతో ముడి పెట్టడం అనేది కేంద్రానికో నీతి, రాష్ట్రాలకో నీతా? అని ప్రశ్నించారు. బోరుబావులకు కరెంట్ మీటర్లు పెట్టకపోతే, నాలుగుశాతం ఎఫ్ఆర్బీఎంలో అరశాతం వదులుకోవాలనే కేంద్ర నిబంధన సరైందికాదన్నారు. సీఎం కేసీఆర్ గొంతులో ప్రాణమున్నంతవరకు మీటర్లు పెట్టబోమని చెప్పారనీ, ఎఫ్ఆర్బీఎంలో అరశాతం వదులుకోవడం వల్ల రాష్ట్రానికి రూ 6,104 కోట్ల నష్టం జరిగిందన్నారు. డబ్బుల కన్న 60 లక్షల మంది తెలంగాణ రైతులే తమకు ముఖ్యమని తెలిపారు. 15వ ఆర్థిక సంఘం నిపుణుల కమిటీ వేయకుండానే రాష్ట్రాల అప్పుల్లో కోత పెట్టిందని విమర్శించారు. గతంలో ఆర్థిక సంఘాల సిఫార్సులను తూ.చ తప్పకుండా కేంద్ర ప్రభుత్వం అమలు చేసేందని గుర్తు చేశారు. 14వ ఆర్థిక సంఘం సూచనమేరకు తెలంగాణకు ప్రత్యేక గ్రాంట్, పౌష్టికాహారం కోసం రూ 171 కోట్లతో కలిపి మొత్తం రూ 6268 కోట్లు ఇవ్వాలన్నారు.వాటిలో మిషన్ భగీరథ, మిషన్‌కాకతీయ నిధులు ఇస్తామని కూడా బీజేపీ ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు. ఈ విధంగా రాష్ట్రానికి ఎన్నో రకాలుగా కేంద్రం అన్యాయం చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం ఇవ్వాల్సిన సీసీఎస్ నిధులను పొరపాటుగా ఆంధ్రప్రదేశ్ ఖాతాలో జమ చేసిందనీ, వాటిని తిరిగి ఇప్పించాలని ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడ లేదని విమర్శించారు. రాష్ట్రాల నుంచి కేంద్రం వసూలు చేసి, సెస్ రూపంలో దొడ్డిదారిన ఆదాయాన్ని సమకుర్చుకుంటున్నదని చెప్పారు. మనకు చెల్లించాల్సిన నిధుల్లో కోతలు పెడుతున్నదన్నారు. ఏ ప్రాజెక్టు ప్రారంభించినా మొదట్లో అంచనా తక్కువగానే ఉంటుందనీ, ఆ తర్వాత క్రమంలో పెరుగుతుందంటూ నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, జూరాల, పులిచింతల, సింగూరు ప్రాజెక్టులను ఉదాహరించారు. నిర్ధేశించిన లక్ష్యానికి ముందే కాళేశ్వరం పూర్తి చేయడం వల్ల రూ. లక్ష కోట్లు విగిలాయని చెప్పారు. సిమెంట్, డీజిల్, స్టీల్ ధరలు పెరగడం, భూసేకరణ కోసం అధిక నిధులు చెల్లించాల్సిన రావడం...తదితర కారణాలతో కూడా ప్రాజెక్టు వ్యయం పెరుగుతుందన్నారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి కేంద్రానికి పన్నుల రూపంలో చెల్లించిన సొమ్ము రూ 3,65,797 కోట్లు అయితే... కేంద్రం రాష్ట్రానికి ఇచ్చింది మాత్రం రూ 1,96,442 కోట్లేనన్నారు. కేంద్రం నిష్పక్షపాతంగా నిధులిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని అప్పులు చేసి ఉండేది కాదని వివరించారు. అక్కడి నుంచి రావాల్సింది రాష్ట్రం హక్కు అని తెలిపారు. దేశంలో నిధులను వికేంద్రికరించడం ద్వారానే అభివృద్ధి జరుగుతుందన్నారు. మూడు రైతు వ్యతిరేక చట్టాలు, విద్యుత్ సంస్కరణలు, రాష్ట్రాల అనుమతి లేకుండా ఐఏఎస్‌లను తీసుకపోవడం, ఎఫ్ఆర్బీఎంను నియంత్రణ చేయడం తదితర ప్రజావ్యతిరేక చర్యలను తిప్పికొట్టాలని కోరారు. 'రూపాయి విలువపడిపోయింది. ద్రవ్యోల్బణానికి అడ్డూఅదుపులేకుండాపోయింది. అందుకే జీడీపీ తగ్గుతుంది' అని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వ సంస్థలను అమ్మేయటం బీజేపీ మార్క్ దేశభక్తి అని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. పాలిచ్చే ఆవును కోతకు అమ్మినట్టు బీజేపీ ప్రభుత్వం ఎల్ఐసీని సైతం అమ్ముతుందన్నారు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆ పార్టీ మత ఘర్షణలతో రక్తం పారిస్తున్నదని విమర్శించారు.