Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముస్లిం రాజుకు వ్యతిరేక పోరాటంగా చిత్రీకరణ
- తప్పు చేస్తే ఒప్పుకునే ధైర్యం ఎర్రజెండాది
- ఓ వ్యక్తి, ఓ కేసు కోసమో సీపీఐ(ఎం) విధానాలుండవు
- తెల్దారుపల్లి ఘటనకు మునుగోడు ఎన్నికతో ముడి పెట్టడం సరికాదు:
తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవ సభలో సీపీఐ(ఎం)
రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రను బీజేపీ వక్రీకరిస్తోందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ముస్లిం రాజుకు వ్యతిరేకంగా హిందువులు సాగించిన పోరాటంగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తోందన్నారు. కమ్యూనిస్టుల గడ్డ మునుగోడులో కాషాయ జెండా ఎగురవేయాలనే కుట్రకు బీజేపీ పూనుకుందని, దానిని నిలువరించడానికే టీఆర్ఎస్కు మద్దతు ఇస్తున్నట్టు స్పష్టం చేశారు.
ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లిలో మంగళవారం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వార్షికోత్సవ సభలో తమ్మినేని మాట్లాడారు. ఎర్రజెండా అండతోనే ఐలమ్మ, దొడ్డి కొమరయ్య పోరాటాలు నిర్వహించారని తెలిపారు. సాయుధ పోరాటాన్ని వక్రీకరించి హిందూ ముస్లింల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. నరేంద్రమోడీ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీి నెరవేర్చకపోయినా అధికారంలోకి రావడానికి కారణం విద్వేషాలను రెచ్చగొట్టడమేనని చెప్పారు. తెలంగాణలో రాజ్యాధికారం కోసం బీజేపీ కుట్ర చేస్తోందని, దానిలో భాగంగానే కాంగ్రెస్ ఎమ్మెల్యే చేత రాజీనామా చేయించి మునుగోడు ఉప ఎన్నికకు తెరదీసిందన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు ఎక్కడైనా ఓ మంచిమాట, ప్రజల సమస్యలపై మాట్లాడుతున్నాడా? అని ప్రశ్నించారు. ఉద్వేగాలను రెచ్చగొట్టే కాషాయ రాజకీయాన్ని తెలంగాణలోకి రానీయకూడదనే సీపీఐ(ఎం), సీపీఐ చర్చించుకుని కమ్యూనిస్టు గడ్డ మునుగోడులో టీఆర్ఎస్కు మద్దతు ఇస్తున్నాం తప్పితే.. ఓ వ్యక్తి కోసమో.. ఓ ఊరి కోసమో.. కమ్యూనిస్టు పార్టీలు తమ విధానం మార్చుకోవని చెప్పారు. పోడుభూములు, ఇతర ప్రజా సమస్యలపౖౖె ప్రభుత్వంతో పోరాడుతున్నామని తెలిపారు. మునుగోడు ఎన్నికకు తెల్దారుపల్లి ఘటనకు ముడిపెట్టడం సరికాదన్నారు. ఓ రాజకీయపార్టీ, విలువైన సిద్ధాంతం ఉన్న సీపీఐ(ఎం) ఓ కేసు కోసమో.. ఓ ఊరు కోసమో.. మొత్తం విధానాలే మార్చుకుంటుందా? చరిత్రలో అలాంటిది ఉందా? అని ప్రశ్నించారు. రాజకీయ మూర్ఖులు మాత్రమే ఇటువంటి ఆలోచనలు చేస్తారని విమర్శించారు. సాయుధ పోరాట అమరవీరులున్న ప్రతి గ్రామంలో సభలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సాయుధ పోరాటంలో తెల్దారుపల్లి ఓ ముఖ్యమైన గ్రామం, తమ్మినేని సుబ్బయ్య నాయకత్వంలో జమీందారుకు వ్యతిరేకంగా పోరాడామని చెప్పారు.
కమ్యూనిస్టుల పోరాట ఫలితమే ఉపాధిహామీ చట్టం
కమ్యూనిస్టుల పోరాట ఫలితంగానే ఉపాధిహామీ చట్టం, సమాచార హక్కు చట్టం వంటివి వచ్చాయన్నారు. అటవీహక్కు పత్రాల విషయంలోనూ కేసీఆర్తో చర్చిస్తున్నామన్నారు. పరిమితికి మించి ఉన్న మిగులు భూములను లాగి పేదలకు పంచాలని సూచించినట్టు చెప్పారు. సమస్యల పరిష్కారంపై అడిగి.. కోట్లాడి.. నిరకరంగా నిలబడి పోరాటాలు చేసేది ఎర్రజెండా మాత్రమే అన్నారు.
- తమ్మినేనికి ఘనస్వాగతం
తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవ సభలో పాల్గొనేందుకు వచ్చిన తమ్మినేనికి తెల్దారుపల్లి స్టేజీ వద్ద గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. వందలాదిగా తరలివచ్చి మహిళలు హారతులిచ్చి.. సీపీఐ(ఎం) నేతలను గ్రామానికి ర్యాలీగా తీసుకెళ్లారు. గ్రామానికి చెందిన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు తమ్మినేని సుబ్బయ్య స్థూపానికి, గ్రామ కూడలిలోని ఐలమ్మ చిత్రపటానికి తమ్మినేని, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్రావు తదితరులు పూలమాల వేసి నివాళి అర్పించారు. సభా అనంతరం తెలంగాణ సాయుధ పోరాటంపై ప్రజానాట్య మండలి కళాకారులు ప్రదర్శించిన వీధి నాటకం ఆకట్టుకుంది. పార్టీ మండల కార్యదర్శి నండ్ర ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో పోతినేని సుదర్శన్రావు, నాయకులు పి.సోమయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు మాచర్ల భారతి, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, పాలేరు డివిజన్ కార్యదర్శి బండి రమేష్, గ్రామ నాయకులు తమ్మినేని విజయలక్ష్మి ప్రసంగించారు. పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు యర్రా శ్రీకాంత్, చింతలచెర్వు కోటేశ్వరరావు, బంతు రాంబాబు, భూక్యా వీరభద్రం, గ్రామ సర్పంచ్ సిద్ధినేని కోటయ్య, నాయకులు తమ్మినేని వెంకట్రావు, మండల కార్యదర్శివర్గ సభ్యులు డాక్టర్ బి.వెంకటేశ్వరరావు, పొన్నెకంటి సంగయ్య, తోట పెద్దవెంకటరెడ్డి, యామిని ఉపేందర్, పెండ్యాల సుమతి తదితరులు పాల్గొన్నారు.