Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శాసనసభలో తీర్మానం..ఏకగ్రీవంగా ఆమోదం
- బీజేపీ సభ్యులకు ఇష్టంలేకే వెళ్లిపోయినట్టున్నారు : కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఢిల్లీలో కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి రాజ్యాంగ నిర్మాత, దార్శనికుడు, గొప్ప మేధావి అయిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు మంగళవారం శాసనసభలో కేటీఆర్ తీర్మానాన్ని ప్రతిపాదించారు. సభ తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. అయితే, తీర్మానం ప్రవేశపెట్టే సమయంలో బీజేపీ సభ్యులు రఘునందన్‌రావు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. కేటీఆర్ మాట్లాడుతూ..అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే తెలంగాణ వచ్చిందన్నారు. తాము అంబేద్కర్ చూపిన బాటలోనే నడుస్తున్నామన్నారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం కోరిన వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రతీక పార్లమెంట్అనీ, టెంపుల్ ఆఫ్ డెమాక్రసీగా పేరుందని తెలిపారు. మహిళలకు సమానత్వ అవకాశాలు, రిజర్వేషన్ల కోసం తన పదవినే త్యాగం చేసిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. పార్లమెంట్‌కు అంబేద్కర్ పేరు పెట్టాలని తీర్మానంలో కోరారు. సీఎల్పీ నేత భట్టి మాట్లాడుతూ..దేశంలో నేడు స్వేచ్ఛ లేదనీ, ఎవరైనా మాట్లాడితే ఐటీ దాడులతో భయపెడుతున్నారని ఆరోపించారు. ఈ దేశ సంపద కొందరికే అందుతున్నదని విమర్శించారు. అన్ని వర్గాలు కలిసిమెలిసి ఉండాలనే సోదరభావం కనిపించట్లేదనీ, మనుషుల మధ్య విద్వేష పరిస్థితుల్ని సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని సభలో తీర్మానం చేయాలని కోరగానే ప్రవేశపెట్టినందుకు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. తీర్మానానికి కాంగ్రెస్ సభ్యులంతా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు తెలిపారు. పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేలా చూడాలని కోరారు. తీర్మానానికి తాము కూడా మద్దతు తెలుపుతున్నట్టు ఎంఐఎం సభ్యులు బలాల తెలిపారు. కేటీఆర్ మాట్లాడుతూ...'బీజేపీ సభ్యులు కూడా మద్దతు తెలిపి ఉంటే బాగుండేది. వారు వెళ్లిపోవడం బాధాకరం. అంబేద్కర్ అంటే బహుషా వారికి ఇష్టం లేదనే అనుకోవాలి' అంటూ వ్యాఖ్యానించారు. గతంలో పంజాగుట్టలో విగ్రహాలు పెట్టిన విషయాన్ని కాదనట్లేదనీ, సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ప్రకారమే నడుచుకుంటున్నామని తెలిపారు. ట్యాంక్‌బండ్ సమీపంలోనే ఐమ్యాక్స్ పక్కన మంత్రి కొప్పుల ఈశ్వర్ పర్యవేక్షణలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామనీ, ఆ విగ్రహాన్ని జనవరిలో ఆవిష్కరిస్తామని చెప్పారు.