Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉమ్మడి నియామక బోర్డును స్వాగతిస్తున్నాం : శాసనమండలిలో ఎమ్మెల్సీ ఏ నర్సిరెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలో ప్రయివేటు యూనివర్సిటీల ఏర్పాటును పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్టు ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి స్పష్టంచేశారు. రాష్ట్రంలో మరో ఐదు ప్రయివేటు యూనివర్సిటీలకు అనుమతి ఇస్తూ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం శాసనమండలిలో బిల్లు ప్రవేశపెట్టారు. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్టు ఎమ్మెల్సీ నర్సిరెడ్డి చెప్పారు. యూనివర్సిటీలు ప్రభుత్వరంగంలోనే ఉండాలనీ, వాటిలో సౌకర్యాలు మెరుగుపర్చాలని కోరారు. గతంలోని ప్రయివేటు ఇంజినీరింగ్ కాలేజీలే ఇప్పుడు యూనివర్సిటీలుగా మారుతున్నాయనీ, వాటిలో కనీస సౌకర్యాలు లేకపోగా, విద్యను పూర్తిగా వ్యాపారీకరణ చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో గత అసెంబ్లీ సమావేశాల్లో ఐదు ప్రయివేటు యూనివర్సిటీలకు అనుమతులు ఇచ్చారనీ, ఇప్పుడు మరో ఐదు యూనివర్సిటీలకు అనుమతులు ఇస్తున్నారనీ, ఇది సరైన విధానం కాదని చెప్పారు. విద్యపేరుతో ఫీజులు వసూలు చేసుకోవడానికే ప్రయివేటు యూనివర్సిటీలు ప్రాధాన్యత ఇస్తాయన్నారు. దీనిపై కాంగ్రెస్ సభ్యుడు జీవన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రయివేటు యూనివర్సిటీల్లో స్థానికులకు ఎలాంటి ప్రాధాన్యత లేదనీ, ఇది తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి పూర్తి విరుద్ధమని అన్నారు. రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ తదితర యూనివర్సిటీల్లో నాణ్యమైన విద్యాబోధన అందించాలని కోరారు. దీనిపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రయివేటు యూనివర్సిటీల్లో 25 శాతం సీట్లు స్థానికులకే ఉంటాయన్నారు. విద్యార్ధులు ఉన్నత చదువుల కోసం విదేశాలు, ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారనీ, వారికి స్వరాష్ట్రంలోనే అవకాశాలు కల్పించేందుకే ప్రయివేటు యూనివర్సిటీలకు అనుమతి ఇస్తున్నట్టు తెలిపారు. ఏఏ రాష్ట్రాల్లో ఎన్నెన్ని ప్రయివేటు యూనివర్సిటీలు ఉన్నాయనే జాబితాను మంత్రి సభలో చదివి వినిపించారు. ఆ రాష్ట్రాలతో పోల్చితే మన దగ్గర తక్కువే ఉన్నాయని విశ్లేషించారు. అంతకుముందు మంత్రి రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో బోధన, బోధనేతర ఉద్యోగాల నియామకాల కోసం ఉమ్మడి నియామక బోర్డును ఏర్పాటు చేసే బిల్లును మండలిలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లును స్వాగతిస్తున్నట్టు ఎమ్మెల్సీ నర్సిరెడ్డి చెప్పారు. ఇప్పటికే యూనివర్సిటీల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్న వారి సర్వీసుల్ని క్రమబద్ధీకరించాలని కోరారు. విధివిధానాల ఖరారు సమయంలో కాంట్రాక్ట్ ఉద్యోగులను సర్దుబాటు చేస్తామని మంత్రి చెప్పారు. ఇవే బిల్లుల్ని శాసనసభలో కూడా మంత్రి ప్రవేశపెట్టారు. ఉభయసభలు బిల్లును ఆమోదించాయి.
ఇవీ కొత్త యూనివర్సిటీలు..
1. మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా షామీర్‌పేటలో ఎన్ఐసీఎమ్ఏఆర్ యూనివర్సిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ స్టడీస్ 2. ఎమ్ఎన్ఆర్ యూనివర్సిటీ (కూకట్పల్లి), 3. గురునానక్ యూనివర్సిటీ (ఇబ్రహీంపట్నం), 4. శ్రీనిధి యూనివర్సిటీ (ఘట్కేసర్), 5. కావేరీ యూనివర్సిటీ (సిద్దిపేట జిల్లా గౌరారం)