Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులు
- మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఏఎస్‌రావునగర్‌లో బహిరంగ సభ
నవతెలంగాణ-కాప్రా
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ద్వారా భూస్వాములను గడడలాడించి తరిమికొట్టింది.. పేదలకు వేలాది ఎకరాల భూములను పంచిపెట్టింది కమ్యూనిస్టులేనని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులు చెప్పారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల్లో భాగంగా మంగళవారం సీపీఐ(ఎం) మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏఎస్‌రావునగర్‌లో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ.. నైజాం సంస్థాన పాలకులలో చివరివాడు మీర్ ఉస్మాన్ అలీఖాన్ పాలనలో ప్రజల ఇబ్బందులు తారాస్థాయికి చేరాయన్నారు. భూములన్నీ జమీందారుల చేతిలో ఉన్నాయని, రైతుల చేతిలో 3 కోట్ల ఎకరాలు ఉండగా.. జాగిర్దారుల చేతిలో 1.5 కోట్ల ఎకరాలు, నైజాం సొంత ఆస్తిగా సర్పేఖాస్ 55 వేల ఎకరాలు ఉన్నాయని తెలిపారు. నాడు రైతులు నైజాం సర్కారు భూములను, జమీందారుల భూములను సాగు చేసి పెట్టాకే తమ భూములను సాగు చేసుకోవాల్సి వచ్చేదన్నారు. ఆ విధంగా రైతుల సొంత సాగు ఆలస్యం అయి పంటలు పండకపోవడంతో శిస్తులు చెల్లించలేక అవస్థలు పడేవారన్నారు. శిస్తు కోసం వేధింపులు, ఇబ్బందులు తాళలేక గ్రామాలను వదిలిపెట్టి పారిపోయేవారన్నారు. నాడు అత్యంత క్రూరంగా శిస్తు వసూళ్లు చేసేవారని చెప్పారు. కట్టకపోతే ఎండలో రాళ్లపై పడుకోబెట్టడం, రాళ్లు వీపుపై ఎత్తటం, పచ్చి చింత బరిగెలతో కొట్టడం చేసేవారని గుర్తు చేశారు. గ్రామస్తులంతా జమీందారులకు వెట్టి చేయాల్సి ఉండేదన్నారు. పెండ్లిగాని యువతులను జమీందారుల కోసం దాసీలుగా పంపాల్సి వచ్చేదని, సాకలి, మంగలి కుమ్మరి, దళితులు గ్రామానికి కాపలా కాయాల్సి ఉండేదని వివరించారు. అన్ని కులాలు వారు జమీందారులకు వంతుల వారీగా వెట్టి చేయాల్సి వచ్చేదన్నారు. ఆ కాలంలో విద్య, వైద్యం సౌకర్యాలు లేకపోవడమేగాక ఒంటినిండా బట్ట కూడా ఉండేది కాదని చెప్పారు. భూస్వాములు ఎదురు పడితే చెప్పులు, రుమాలు, అంగి తీసేసి నిలబడాల్సి వచ్చేదని, మంగలి క్షవరం చేస్తే బట్టలు తీసి గొంగళి కప్పుకోవాల్సి వచ్చేదని చెప్పారు. దీనిని బట్టి ఎంత నిర్బంధం, వెట్టి చాకిరీ ఉండేదో అర్థం చేసుకోవచ్చన్నారు. అలాంటి బానిసత్వం నుంచి ప్రజలను విముక్తి చేసిన మహత్తర పోరాటమే కమ్యూనిస్టుల నాయకత్వంలో జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డిజి.నర్సింహారావు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కార్యదర్శి పి.సత్యం, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జె.చంద్రశేఖర్, కోమటిరవి, వినోద, అశోక్, సిహెచ్.యాదయ్య, జిల్లా కమిటీ సభ్యులు రాథోడ్ సంతోష్, శ్రీనివాస్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.