Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 21, 22తేదీల్లో కలెక్టరేట్ల ముట్టడి
- 18న సర్వేలు, క్యాంపెయిన్ నిర్వహణ
- పోస్టర్ ఆవిష్కరణలో ప్రజాసంఘాల పోరాట వేదిక రాష్ట్ర కన్వీనర్ ఎస్ వీరయ్య
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఇండ్లు, ఇండ్ల స్థలాలు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సాధన కోసం ఈనెల 21, 22 తేదీల్లో చేపట్టనున్న కలెక్టర్ కార్యాలయాల ముట్టడిని జయప్రదం చేయాలని తెలంగాణ ప్రజాసంఘాల పోరాట వేదిక రాష్ట్ర కన్వీనర్ ఎస్.వీరయ్య పిలుపునిచ్చారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మంగళవారం ప్రజాసంఘాల నేతలతో కలిసి పోస్టర్ ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. 9 జిల్లాల్లో పేదలు ప్రభుత్వ, మిగులు భూముల్లో గుడిసెలు వేసుకుని ఉంటున్నారని, వారికి ప్రభుత్వం పట్టాలివ్వకపోగా దాడులు చేయిస్తోందని, అరెస్టులు, లాఠీచార్జీలు చేయిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 3లక్షల ఇండ్లు నిర్మించామని ప్రభుత్వం చెబుతుందని, కానీ అర్హులైన పేదలకు కేటాయించినవి తక్కువేనని అన్నారు. అర్హులైన పేదలకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని, సొంత స్థలాలు ఉన్నవారికి ఇంటి నిర్మాణం కోసం రూ.5లక్షలు కేటాయించాలని, స్థలమే లేని పేదలకు 120 గజాల స్థలం కేటాయించడంతోపాటు ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేదలు ఇండ్లు, ఇండ్ల స్థలాల కోసం దరఖాస్తులు పెట్టుకున్నారని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం కూడా వేలాది మంది దరఖాస్తులు పెట్టుకున్నారని, సొంత ఇల్లు లేకపోవడం వల్ల చేసిన కష్టాన్ని అద్దెలకే చెల్లించుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఈ డిమాండ్ల పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. సెప్టెంబర్ 18వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా సర్వేలు నిర్వహించి సభలు, సమావేశాలు, కరపత్రాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని పిలుపునిచ్చారు.
ఇల్లు లేకపోవడం మహిళలకు ఆత్మగౌర సమస్య అని ఐద్వా రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు అరుణజ్యోతి, మల్లు లక్ష్మి అన్నారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ.. కార్మికులు, అసంఘటిరంగ కార్మికులకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు కేటాయించాలన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.పద్మ మాట్లాడుతూ.. వ్యవసాయ కార్మికులు రెక్కలుముక్కలు చేసుకుని పొద్దంతా పనిచేసుకున్నా ఉండటానికి ఇల్లు లేక కుమిలిపోతున్నారని తెలిపారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్, పట్నం రాష్ట్ర కార్యదర్శి డిజి.నర్సింహారావు మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు జీఓ నెం.58 ప్రభుత్వ స్థలాలను రెగ్యులర్ చేయలేదని, 2014లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ అబ్బాస్ మాట్లాడుతూ.. సుధీర్‌కుమార్, రాజేందర్ సచార్ కమిటీ మైనార్టీలకు ఇండ్లు లేవని గుర్తిచిందని, ప్రభుత్వం వెంటనే ఇండ్లు, ఇండ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు.
కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్‌బాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో 18లక్షల మంది దళితులుంటే 7లక్షల మందికే ఇండ్లు ఉన్నాయని సమగ్ర కుటుంబ సర్వేలో వెల్లడించిందని గుర్తుచేశారు. దళితులకు మూడెకరాల భూమి పంపకం 2శాతం మాత్రమే పూర్తిచేశారని, 98శాతం పెండింగ్‌లో ఉందన్నారు.
కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎంవీ రమణ, రజక సంఘం రాష్ట్ర కార్యదర్శి పైళ్ల ఆశయ్య మాట్లాడుతూ.. ఇండ్లులేని వృత్తిదారులకు ఇండ్లు కేటాయించాలని, సంచార జాతులు తలదాచుకోవడానికి గూడు లేదన్నారు. డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్ మాట్లాడుతూ.. కొత్తగా పెండ్లి చేసుకున్న యువ జంటలకు ప్రభుత్వం ఇండ్లు కేటాయించాలన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం.ధర్మానాయక్, ఆర్.శ్రీరామ్‌నాయక్, రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్‌శోభన్, ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టా నర్సింహ్మ, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.