Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్వీకే కార్యదర్శి ఎస్.వినయకుమార్
- బొల్లారంలో కుట్టుమిషన్ కేంద్రం ప్రారంభం
నవ తెలంగాణ- వనపర్తి
సమాజంలో ఇతరుల పట్ల మంచితనంతో మెలిగి, అందరినీ ఆప్యాయంగా పలుకరించడం, నలుగురికి అన్నం పెట్టి ఆకలితీర్చిన కావలి లక్ష్మి సేవలు ఆదర్శనీయమని సుందరయ్య విజ్ఞాన కేంద్రం కార్యదర్శి ఎస్.వినయకుమార్ అన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం బొల్లారం గ్రామానికి చెందిన కావలి లక్ష్మీ స్మారక కుట్టుమిషన్ కేంద్రాన్ని ఎస్.వినయకుమార్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉంటూ కొన్నేండ్లు కావలి లక్ష్మి పని చేసిందన్నారు. అందరినీ ఆప్యాయంగా పలుకరించేదన్నారు. తాను చేసే పనిలో ఎంతో నిబద్ధతను కలిగి ఉండేదన్నారు. నలుగురికి ఆదర్శనీయురాలుగా ఉంటూ సేవలు చేశారన్నారు. దురదృష్టవశాత్తు క్యాన్సర్తో ఆమె అకాలమరణం చెందారని చెప్పారు. నీతి నిజాయతీగా ఉండే వారు, నలుగురి కోసం కష్టపడే వారికి ఎప్పుడూ సమాజంలో మంచి గుర్తింపు ఉంటుందన్నారు. ఆమెను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అందుకోసమే ఆమె పేరుతో కుట్టుమిషన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్లో ఒక సెంటర్ను ప్రారంభించి నిరుపేద మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ నేర్పిస్తున్నామన్నారు. అలాగే, ఆమె సొంత గ్రామమైన బొల్లారంలోనూ ఉచితంగా కుట్టుమిషన్ నేర్పించి.. వారు ఆర్థికంగా బలపడేందుకు నాలుగు కుట్టు మిషన్లతో రెండో సెంటర్ను ఇక్కడ ఏర్పాటు చేశామన్నారు.
ఈ కేంద్రాన్ని సుమిత్ర ఆధ్వర్యంలో కొనసాగుతుందన్నారు. ఈ కేంద్రాన్ని గ్రామ, చుట్టుపక్కల గ్రామాల మహిళలు, యువతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మొదటి రోజే ముగ్గురు నేర్పుకోవడానికి రావడం సంతోషాన్ని కలిగించిందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండీ జబ్బార్, మండల కార్యదర్శి బాల్రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు మండ్ల కృష్ణయ్య, బాలాగౌడ్, నాయకులు, మహిళలు పాల్గొన్నారు.