Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ, కాంగ్రెస్ దొందూ దొందే
- రాష్ట్రంపై కేంద్రం వివక్ష..కక్ష
- అసెంబ్లీలో హరీశ్‌రావు ఫైర్
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
కాంగ్రెస్, బీజేపీ పార్టీలు దొందూ దొందేనని ప్రజలకు అర్థమైందని రాష్ట్ర ఆర్థికమంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. 'విభజన చట్టం హామీల అమలులో కేంద్ర ప్రభుత్వ వైఫల్యంపై' సభలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు ఏపీ విభజన చట్టంపై మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. 'త్యాగాలు, పోరాటాలతో తెలంగాణను సాధించుకున్నాం. మిలియన్ మార్చ్‌లో పాల్గొనకుండా అరెస్టులు చేస్తే.. తప్పించుకొని పోయి బోటు ద్వారా ట్యాంక్‌బండ్ ఎక్కి విజయవంతం చేశాం. సాగరహారంలో ఎవరు ఉన్నరు? ఎవరు పని చేశారు? ఇవాళ మాట్లాడుతున్న పార్టీలు ఆ రోజు ఎక్కడున్నయో ప్రజలు మరిచిపోలేదు. కేసీఆర్ పోరాటం వల్లనే రాష్ట్రం వచ్చింది. దాన్ని ఎవరూ కాదనలేరు. రాష్ట్రం ఏర్పడ్డా.. ప్రభుత్వం ఏర్పడక ముందే ఏ రకంగా, లోయర్ సీలేరు ప్రాజెక్టు గుంజుకున్నరో సోమవారం అసెంబ్లీలోనే సీఎం చెప్పారు. ఇవాళ ఏడు మండలాల ప్రజలు చాలా ఇబ్బందిపడుతున్నరు. మమ్మల్ని తెలంగాణలో కలపాలని అనేక సందర్భాల్లో ధర్నాలు, దీక్షలు చేస్తున్న పరిస్థితి. అక్కడనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. బీజేపీతో పొత్తులో ఉంటే మరి.. తమ రాజకీయాల కోసం తెలంగాణ ప్రజల గొంతు కోసేలా ఏడు మండలాలతోపాటు లోయర్ సీలేరును ఆంధ్రాలో కలిపారు' అని అగ్రహం వ్యక్తం చేశారు. అప్పులిచ్చి కేంద్రం గొప్పలు చెప్పుకుంటున్నదనీ, వడ్డీతో సహా కేంద్ర సంస్థలకు చెల్లిస్తున్నామని గుర్తుచేశారు. గ్రాంట్ ఇస్తే మేమే అభినందిస్తామని వ్యాఖ్యానించారు.
లోయర్ సీలేరు కోల్పోవడంతో ఏటా వెయ్యికోట్ల నష్టం..
'లోయర్ సీలేరు ప్రాజెక్టును కోల్పోవడం వల్ల.. సంవత్సరానికి రూ.1000 కోట్లు తెలంగాణ కోల్పోతున్నది. హైడల్ ప్రాజెక్టుల్లో కెల్లా అత్యుత్తమమైన ప్రాజెక్టు లోయర్ సీలేరు. సంవత్సరానికి మూడు వందల రోజులు అక్కడ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. 10, 20 పైసలకే యూనిట్ కరెంటు తయారవుతున్నది. ఇవాళ ఓపెన్ మార్కెట్లో 12 రూపాయలకు కరెంటును కొంటున్నం. కేంద్ర ప్రభుత్వ తెలంగాణ వ్యతిరేక, నిరంకుశ వైఖరితో రాష్ట్రం ఏటా వెయ్యి కోట్లు కోల్పోతున్నది. ఏడు మండలాలను కోల్పోయాం. ప్రధానమంత్రి తల్లిని చంపి.. బిడ్డను బతికించారని పార్లమెంట్లో, బయట బహిరంగసభల్లో పదేపదే మాట్లాడడం తెలంగాణ ప్రజలను తీవ్రంగా అవమానిం చడమేనని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే అవమానపరచడం. రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియపై ప్రధానే కాదు. అనేక మంది కేంద్రమంత్రులు పదేపదే తప్పుబడుతూ మాట్లాడుతున్నరు. గతంలో మూడు రాష్ట్రాల ఏర్పాటు సమయంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. తప్పుడు ప్రక్రియ జరిగిందనీ, తొందరపాటులో జరిగిందనే అర్థంవచ్చేలా స్వయంగా ప్రధాని, కేంద్రమంత్రులు మాట్లాడడం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను తప్పుబట్టడం.. తెలంగాణతోపాటు ఉద్యమ కారులను అవమానించడమే. కాంగ్రెస్ తప్పిదాలను బీజేపీ చెప్పే ప్రయత్నం చేసింది. బీజేపీ తప్పిదాలను కాంగ్రెస్ పార్టీ ఎత్తిచూపే ప్రయత్నం చేసింది. మొత్తం రెండు పార్టీలు దొందూ దొందే అనే విషయం ఈ చర్చల ద్వారా రాష్ట్ర ప్రజలకు అర్థమైంది' అన్నారు.
ప్రాణహితకు జాతీయ హౌదా ఎందుకివ్వలే..?
'పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హౌదా ఇవ్వాలని ఆనాడు చట్టంలో పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అంబేద్కర్ ప్రాణహిత- చేవెళ్లకు జాతీయ హౌదా పెట్టి ఉంటే.. జాతీయ ప్రాజెక్టు వచ్చి ఉండేది. ఆ చట్టంలో పెట్టకపోతే మీకు జాతీయ హౌదా ఇచ్చేందుకు మీకేమైనా అడ్డం ఉందా? అని బీజేపీని అడుగుతున్నా. ఇస్తా అంటే ఎవరైనా వద్దన్నారా? కర్నాటకలోని అప్పర్ భద్ర ప్రాజెక్టు, ఉత్తరాఖండ్‌లోని బుందేల్‌ఖండ్ గెన్బెత్వ ప్రాజెక్టుకు జాతీయ హౌదా ఇస్తరు? మరి కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హౌదా ఇవ్వడానికి ఏం అడ్డం వచ్చింది అని బీజేపీ నాయకులను ప్రశ్నిస్తున్నా. నీళ్ల కోసం జరిగిన తెలంగాణ ఉద్యమంలో అత్యంత ముఖ్యమైంది కష్ణా నదీజలాల పంపకం. ఈ విషయంలో బీజేపీ ప్రభుత్వం చాలా దారుణంగా తెలంగాణ ప్రజలకు నష్టం కలిగిస్తున్నది. తీవ్రమైన జాప్యం చేస్తున్నదని విమర్శించారు. సీఎం కేసీఆర్ తీవ్రమైన ప్రయత్నాలు చేశారు. రాష్ట్రం ఏర్పడ్డది జూన్ 2, 2014 ప్రభుత్వం ఆవిర్భవించింది. 14 జూలై, 2014న కష్ణా నదీజలాల్లో మా వాటా తేల్చాలని కేంద్రం వద్ద తెలంగాణ రాష్ట్రంగా పిటిషన్ పెట్టాం. అంతర్రాష్ట్ర నదీజలాల వివాదాల చట్టం సెక్షన్ 3 ప్రకారం ఏదైనా రాష్ట్రం నదీ జలాల్లో అన్యాయం జరిగిందంటే.. సంవత్సరంలోగా సమస్యను పరిష్కరించాలి? లేదంటే ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలి. అప్పటి కేంద్రమంత్రి ఉమాభారతితో కష్ణా నదీజలాల్లో మా పరీవాహక ప్రాంతం ఎక్కువ.. మా వాటా మాకు కావాలంటూ ముఖ్యమంత్రి స్వయంగా అక్కడికి వెళ్లి చెప్పారు. దురదష్టమేంటంటే.. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిర్ణయం తీసుకోలేదు. లేఖలు రాసినా కేంద్రం పట్టించుకోకపోతే.. 10 ఆగస్టు 2015న సుప్రీంకోర్టులో కేసు వేశాం. అయినా కేంద్రం నిర్ణయం తీసుకోవడం లేదు.. ట్రిబ్యునల్ వేయడం లేదని కేసు వేశాం. సుప్రీంకోర్టులో కేంద్రం కౌంటర్ వేయకుండా.. నిర్ణయం చెప్పకుండా పదేపదే వాయిదాలు అడుగుతూ తాత్సారం చేసింది' అన్నారు.
కృష్ణా జలాల్లో వాటా ఇంకా తేల్చలే..
'ఈ మధ్యకాలంలో షెఖావత్ కేంద్రమంత్రిగా వచ్చిన సమయంలో అపెక్స్కమిటీ సమావేశానికి వెళ్లిన సమయంలో.. సీఎం కేసీఆర్ ఆయనకు అన్యాయమైంది? సుప్రీంకోర్టులో కేసు వేశాం? కౌంటర్లు వేయడం లేదని అడిగితే.. కేసు విత్‌డ్రా చేసుకొని మళ్లీ పిటిషన్ వేయండి కచ్చితంగా నిర్ణయం తీసుకుంటామని అన్నారు. బాధ్యతాయుతమైన కేంద్రమంత్రి మాటలు విని పిటిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకున్నది. ఆ తర్వాత కేంద్రమంత్రి వద్ద సెక్షన్-3 కింద కష్ణా నదీజలాల్లో మా వాటా తేల్చండి అని పిటిషన్ వేశాం. 2021 అక్టోబరు ఏడున పిటిషన్ వేస్తే.. ఇవాళ్టికి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఆ తర్వాత మూడుసార్లు లేఖలు రాశాం.. సీఎం స్వయంగా కలిసి గుర్తు చేశారు. ఇప్పటికీ కష్ణా నదీ జలాల్లో ఇంకా తెలంగాణ వాటా తేల్చడం లేదు. ఇంత దుర్మార్గమా? సంవత్సరంలో వివాదం పరిష్కరించాలని, లేకపోతే ట్రిబ్యునల్ వేయాలని చట్టం చెబుతుంటే.. తేల్చరు ? ట్రిబ్యునల్ వేయరు ? కోర్టుకు వెళితే పిటిషన్ విత్‌డ్రా చేయమంటరు.. నమ్మి విత్‌డ్రా చేసుకుంటే, 11 నెలలనైనా నిర్ణయం తీసుకోకపోవడం తెలంగాణపై వివక్ష చూపడం కాదా? ప్రజలను చిన్నచూపు చూడడం కాదా? రోజుకో కేంద్రమంత్రి నోటికి వచ్చినట్టు మాట్లడుతున్నరు. దీనిపై తేల్చి మాట్లాడండి. బీజేపీ రాష్ట్ర, కేంద్ర నాయకత్వం పూటకో మాట చెప్పడం కాదు. న్యాయబద్ధంగా వాటా తేల్చాలి. కనీసం ఎంత లేదన్నా 550 టీఎంసీలు వచ్చే అవకాశం ఉంది' అన్నారు.
గోదావరి - కావేరి అనుసంధానం పెద్ద జోక్
'గోదావరిపై మిగులు జలాలు ఉన్నాయి. వాటికి కూడా కేటాయింపులు ఇస్త లేరు. క్లియరెన్స్ గురించి పట్టింపులేదు. గోదావరిలో నీరు ఎక్కువగా ఉంది కాబట్టి కావేరికి కలుపుతం.. కర్నాటక, తమిళనాడుకు తీసుకుపోతం అంటరు.. నీళ్లు ఎక్కువ ఉంటే.. బేసిన్లో ఉన్న తెలంగాణ ప్రాజెక్టులకు క్లియరెన్స్‌లు ఇవ్వాలి కదా? ఇవి పెండింగ్‌లో పెడతారు. బడ్జెట్ సమావేశంలో గోదావరి - కావేరీ అనుసంధానం చేస్తామని చెప్పడం పెద్ద జోక్. నీళ్లు ఎక్కువ ఉంటే.. బేసిన్లో ఉండే ప్రజల అవసరాలను తీర్చిన తర్వాత పక్క రాష్ట్రాలకు తీసుకుపోవాలి. తెలంగాణ ప్రాజెక్టులకు ఇవ్వరటా.. గోదావరిని తీసుకుపోయి కావేరికి కలుపుతరట? ఇదెక్కడి న్యాయం. తొమ్మిది, పదో షెడ్యూల్లోని సమస్యలు పరిష్కరించడం లేదు. ఆంధ్రప్రదేశ్ సర్కారు సుప్రీంకోర్టుకు పోతే.. కోర్టు స్పష్టంగా చెప్పింది. హెడ్‌క్వార్టర్స్ ఎక్కడ ఉంటే.. అక్కడే ఉంటది.. దాన్ని బేస్ చేసుకొని విభజన చేయమని సూచించింది. సుప్రీంకోర్టు తీర్పును తెలంగాణ ఆమోదించింది.. కేంద్రం హౌంశాఖ కూడా.. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే చేయాలని చెప్పినా.. ఇప్పటి వరకు ఆపని జరగలేదు' అంటూ హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంపై కక్ష సాధింపులు
రాష్ట్రానికి ఏం ఇవ్వకుండా కేంద్రం కక్ష సాధిస్తున్నది. ఐఐటీ, ఎన్ఐటీ, నవోదయ విద్యాలయం ఒక్కటీ ఇవ్వలేదు. ఐటీఐఆర్‌ను కేంద్రం ఎందుకు రద్దు చేసింది ? పారిశ్రామిక కారిడార్‌లో కేంద్రం మొండి చేయి చూపింది. రాష్ట్ర ప్రభుత్వం కషితో రూ.20వేల కోట్ల కొత్త ఐటీ పరిశ్రమలు వచ్చాయి. కేంద్రం తెచ్చిన అమత్ సరోవర్కు మన మిషన్ కాకతీయ ప్రేరణ. మన మిషన్ భగీరథ కేంద్రం తెచ్చిన హర్ ఘర్ కో జల్‌కు స్ఫూర్తి. మన రైతుబంధు.. పీఎం కిసాన్ యోజనకు ఆదర్శం. వైద్య కళాశాలలు ఇవ్వాలని అనేకసార్లు లేఖలు రాశాం. ఒక్క పైసా ఇవ్వకున్నా అనేక ప్రాజెక్టులు పూర్తి చేశాం. రాష్ట్రం కోరుతున్న ప్రతి అంశాన్ని పెండింగ్‌లో పెడుతున్నరు' అంటూ హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందు ఈ అంశంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క, ఎమ్మెల్యేలు పెద్దిరెడ్ది సుదర్శన్‌రెడ్డి, పోదెం వీరయ్య, సండ్ర వెంకట వీరయ్య, రఘునందన్‌రావు తదితరులు మాట్లాడారు. పొలవరం ముంపుపై ప్రత్యేక అధ్యయనం జరగాలనీ, లేకపోతే భద్రాద్రి రాముడు సైతం ముంపుకు గురవుతాడని చెప్పారు. రాముడి పేర రాజకీయాలు చేసే కేంద్రం రాముడిని రక్షించదా ? మీ రాముడు, మా రాముడు వేర్వేరు కాదుకదా ? అని సండ్ర వెంకట వీరయ్య, పొదెం వీరయ్య , భట్టి విక్రమార్క తెలిపారు. ఏపీలో కలిపిన ఐదు గ్రామాలను రాష్ట్రంలో కలపడానికి కేంద్రం చొరవ చేయాలని విజ్ఞప్తి చేశారు. సభ్యులు లేవనెత్తిన పలు సందేహాలకు మధ్యలో రోడ్లు,భవనాల శాఖ వేముల ప్రశాంత్‌రెడ్డి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరుకుమార్ సైతం స్పందించారు. కేంద్రం విధానాలపై విమర్శలు గుప్పించారు.