Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఏడు బిల్లులను, రెండు తీర్మానాలను ప్రవేశపెట్టింది. అవన్నీ ఆమోదం పొందాయి. జీఎస్టీ చట్ట సవరణ బిల్లు, అజమాబాద్ పారిశ్రామిక చట్ట సవరణ బిల్లు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి సవరణ బిల్లు, మోటార్ వెహికల్ పన్నుల చట్ట సవరణ బిల్లు, విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బోర్డు బిల్లు, ప్రయివేటు విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లు, జీహెచ్ఎంసీ, పురపాలక చట్ట సవరణ బిల్లులను మంత్రులు సభలో ప్రవేశపెట్టారు. జీఎస్టీ చట్టసవరణ బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రజలపై జీఎస్టీ భారం మరింత పెరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల మీద భారాలు మోపే విషయంలో తామెప్పుడూ జీఎస్టీని సమర్ధించలేదని చెప్పారు. యజమానులకు ఉన్న మినహాయింపును కూడా కేంద్రం తొలగించిందని ఆయన తెలిపారు. ఆస్పత్రుల్లో రూమ్ కిరాయి ఐదు వేల రూపాయలు దాటితే జీఏస్టీ వేయడం దారుణమన్నారు. దీనిపై కాంగ్రెస్ సభ్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడారు.అనంతరం ఆ బిల్లుపై ఓటింగ్ జరిగింది. ఆమోదం పొందింది.
స్వపక్షం, విపక్షం లేదు..
అభివృద్ధిలో సమన్యాయం : మంత్రి కేటీఆర్
రాష్ట్రంలో స్వపక్షం, విపక్షం అనే తేడా లేదనీ, అభివృద్ధిపనుల్లో సమన్యాయం చేస్తున్నామని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు నొక్కి చెప్పారు. జీహెచ్ఎంసీ, పురపాలకసంఘాల చట్ట సవరణ బిల్లును ఆయన సభలో ప్రవేశపెట్టారు. అది ఆమోదం పొందింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌గా ఉన్నప్పుడు.. మహానగరానికి సంబంధించి 100 వార్డులు ఉన్న సమయంలో అప్పటి జనాభా, అప్పటి వార్డుల సంఖ్య ప్రతిపాదికనగా కో ఆప్షన్ సభ్యుల సంఖ్యను ఐదుగా నిర్ణయించారన్నారు. ప్రస్తుతం ఆ సంఖ్యను 15కి పెంచుతున్నట్టు తెలిపారు.
సమీప గ్రామాల విలీనం, పెరుగుతున్న జనాభా దృష్ట్యా కార్పొరేషన్లో కూడా కో-ఆప్షన్ సభ్యులను అదనంగా పెంచాలని సవరణలు ప్రతిపాదించినట్టు తెలిపారు. రాజ్యసభ సభ్యులు, శాసన సభ సభ్యులకు ఎక్స్ అఫిషియో సభ్యుల విషయంలో ఉన్న టైపో ఎర్రర్‌ను సవరించామన్నారు. మున్సిపాల్టీల్లో నాలుగేండ్ల వరకు పాలకమండలిపై అవిశ్వాసం ప్రవేశపెట్టకూడదనే సవరణ చేశామన్నారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ బ్యాలెట్ బాక్సులను భద్రపరిచేందుకు ప్రయివేటు వ్యక్తుల భవనాలు అద్దెకు తీసుకునేందుకు సవరణ చేస్తున్నామన్నారు. చెన్నూరు నియోజకవర్గంలోని క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ పేరును రామకృష్ణాపూర్‌గా మారుస్తున్నామని తెలిపారు. జిల్లాకేంద్రంగా ఉన్న ములుగు గ్రామపంచాయతీగా ఉండటం సబబు కాదనే ఉద్దేశ్యంతో దాని పంచాయతీ కాలపరిమితి ముగియగానే అది మున్సిపాలిటీగా మారేలా నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ములుగు గ్రామ పంచాయతీని మున్సిపాల్టీగా మార్చినందుకు సీఎం కేసీఆర్, పురపాలక మంత్రి కేటీఆర్, జిల్లా మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావుకు స్థానిక ఎమ్మెల్యే సీతక్క ధన్యవాదాలు తెలిపారు. మున్సిపల్ పరిధిలో సౌకర్యాలు కల్పించాలని, కలెక్టరేట్ నిర్మాణం వేగంగా జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ పేరును రామకృష్ణాపూర్‌గా మార్చినందుకు ఎమ్మెల్యే బాల్కసుమన్ మంత్రి ధన్యవాదాలు తెలిపారు.
పరిశ్రమలకిచ్చిన భూముల్లో ఎక్కడా అవినీతి జరలేదు : కేటీఆర్
రాష్ట్రంలో పరిశ్రమలకిచ్చిన భూముల్లో ఎక్కడా అవినీతి జరగలేదనీ, భూములిచ్చినా పరిశ్రమలు పెట్టని యాజమాన్యాల నుంచి తిరిగి 1,234 ఎకరాలను స్వాధీనం చేసుకున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు. అజామాబాద్ ఇండిస్టీయల్ ఏరియా లీజుల క్రమబద్దీకరణ యాక్ట్-1992కి సవరణ బిల్లును ఆయన సభలో ప్రతిపాదించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ..ఈ బిల్లుపై కొన్ని సందేహాలను వ్యక్తపరిచారు. లీజు హోల్డర్లకు పర్మినెంట్‌గా రిజిస్ట్రేషన్ చేసే ప్రయత్నం జరుగుతున్నదని చెప్పారు. రెగ్యులరైజేషన్ పోనూ మిగతా భూమిని ఏం చేస్తారు? ఇండ్ల నిర్మాణం కోసం వాడుతారా? యాక్షన్ ప్లాన్‌కు పెడతారా? హౌజింగ్ సొసైటీకి ఇచ్చి ఇండ్లు కట్టిస్తారా? తదితరాలపై క్లారిటీ ఇవ్వాలని కోరారు. ఆయా సందేహాలకు మంత్రి కేటీఆర్ సమాధానమిస్తూ..అజామాబాద్ ఇండిస్టీయల్ ఏరియాలో 136.4 ఎకరాల భూముందని చెప్పారు. అందులో కొన్ని యూనిట్లు నడుస్తున్నాయనీ, మరికొన్ని మూతపడ్డాయనీ, కొన్ని లీజ్ పరిమితి దాటిపోయిందని తెలిపారు. రాంనగర్ చేపల మార్కెట్‌పై తీవ్ర ఒత్తిడి ఉందనీ, ఆర్టీసీకి చెందిన స్థలంలో దానిని పెట్టి, ఇండిస్టీయల్ ఏరియాలో ఆ సంస్థకు భూమి ఇస్తామని చెప్పారు. అదే సమయంలో కమ్యూనిటీభవనం కోసం స్థలం కావాలంటూ స్థానిక ఎమ్మెల్యే అడుగుతున్నారనీ, దానికోసం భూమి ఇచ్చే విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటామన్నారు.
వైద్య విద్యలో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల వయస్సు 65 ఏండ్లకు పెంపు : హరీశ్‌రావు
వైద్య విద్య బోధించే ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల వయస్సును 61 ఏండ్ల నుంచి 65 ఏండ్లకు పెంచనున్నట్టు వైద్య మంత్రి హరీశ్‌రావు తెలిపారు. డీఎమ్ఈ, డిప్యూటీ డీఎమ్ఈలు కూడా 65 ఏండ్ల వరకు కొనసాగే అవకాశం ఉంటుందన్నారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల చట్టం సవరణ బిల్లును మంత్రి ప్రతిపాదించారు. సభలో ఆమోదం పొందింది. దీనిపై కాంగ్రెస్ సభ్యులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, బీజేపీ సభ్యులు రఘునందన్‌రావు మాట్లాడుతూ పలు సూచనలు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ..రాష్ట్రంలో గతంలో సీనియర్ రెసిడెన్షియల్ డాక్టర్లు హైదరాబాద్‌లోనే ఉండేవారనీ, ప్రస్తుతం జిల్లాల్లోనూ 800 మంది ఎస్‌ఆర్‌లను నియమించామని తెలిపారు. రాష్ట్రమేర్పడే నాటికి మూడు డయాలసిస్ కేంద్రాలుంటే ప్రస్తుతం వాటి సంఖ్య 103కి పెరిగిందన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక డయాలసిస్ కేంద్రం ఉందన్నారు. వైద్యసిబ్బంది నియామకాలు, డాక్టర్ల నియామకాలను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు.