Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్పీకర్‌పై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణకు సభ్యుల పట్టు
- ససేమిరా అన్న రాజేందర్
- బయటకెళ్లి రచ్చచేసేందుకే ఇదంతా
- క్షమాపణ చెప్పి చర్చల్లో పాల్గొనాలన్నా వినిపించుకోలేదు : మంత్రి ప్రశాంత్‌రెడ్డి
- ఈటలను ఇంటిదగ్గర వదిలేసిన పోలీసులు
- పోలీసుల తీరుపై ఈటల ఆగ్రహం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను శాసనసభ నుంచి స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సస్పెండ్ చేశారు. ప్రస్తుత వర్షాకాల సమావేశాలు ముగిసేవరకూ ఇది కొనసాగుతుందని ప్రకటించారు. సభ నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. దీంతో శాసన సభ నుంచి ఈటల నిష్క్రమించారు. శాసన సభ సమావేశం ప్రారంభమైన వెంటనే స్పీకర్‌పై 'మరమనిషి'అంటూ వ్యాఖ్యలు చేసిన ఈటల రాజేందర్‌ను సస్పెండ్ చేయాలని చీఫ్‌విప్ దాస్యం వినయభాస్కర్ డిమాండ్ చేశారు. ఆయన క్షమాపణ చెప్పి చర్చల్లో పాల్గొనాలని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వి.ప్రశాంత్‌రెడ్డి కోరారు. ఈటల మాట్లాడుతూ..'నాకు మాట్లాడే అవకాశం లేదా? రైట్స్ లేవా?' అన్నారు. ప్రశాంత్‌రెడ్డి జోక్యం చేసుకుని..'స్పీకర్‌ను అవమానిస్తూ మాట్లాడటం సబబు కాదు..' అన్నారు. వెంటనే ఈటల..'బెదిరిస్తున్నరా సార్? ఏం బెదిరింపులు? ఏం నన్నేం చేస్తారు?' అంటూ ఘాటుగా మాట్లాడారు. ప్రశాంత్‌రెడ్డి స్పందిస్తూ 'సభామర్యాదలను కాపాడాలని కోరుతున్నాం. చేతులెత్తి వేడుకుంటున్నా. క్షమాపణ అడిగి నిరభ్యంతరంగా చర్చల్లో పాల్గొనండి' అని కోరారు. ఈటల మాట్లాడుతూ..ఇన్నేండ్లుగా ప్రాతినిధ్యం వహిస్తునప్పటికీ ఏనాడూ ఎవర్నీ అగౌరవపర్చలేదన్నారు. చైర్నిగానీ, స్పీకర్‌గానీ అవమానించే ప్రయత్నం చేయలేదు. ఈ సభలో ఉంచాలనుకుంటున్నారా? వెళ్లగొట్టాలనుకుంటున్నారా? మా హక్కుల్ని కాపాడుకుంటాం' అని వ్యాఖ్యానించారు. 'స్పీకర్‌గారూ..నేను నాలుగు సార్లు చెప్పా. రిక్వెస్ట్ చేసినా వినట్లేదు. ఇక్కడ సస్పెండ్ చేయించుకుని బయటకెళ్లి రచ్చచేయాలని వాళ్లు అనుకుంటున్నారు. మేం అలా చేయం. స్పీకర్‌కు క్షమాపణ అడుగుతున్నాం' అని ప్రశాంత్‌రెడ్డి అన్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో స్పీకర్ జోక్యం చేసుకుని 'సభను అర్ధం చేసుకుని గౌరవ సభ్యులు నడుచుకోవాలని సూచిస్తున్నా. ఈటలను కొడుకుగా భావించి చెబుతున్నా. సీనియర్ సభ్యులుగా ఉన్న మీరు స్పందించి సభకు సహకరించండి' అని కోరారు. వెంటనే బాల్కసుమన్ మాట్లాడుతూ..సభ మీద గౌరవం లేదు. సభామర్యాదలు పాటించనోళ్లను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో అధికార పార్టీ సభ్యుల్లో కొందరు లేచి నిలబడి ఈటలను సస్పెండ్ చేయాలని పట్టుబట్టారు. స్పీకర్‌కు క్షమాపణ చెప్పాలని ఈటలను ఆరుసార్లు అడిగినా స్పందించలేదని ప్రశాంత్‌రెడ్డి అన్నారు. గత బడ్జెట్ సమావేశాల్లో ఇలాగే వ్యవహరించి సభ నుంచి సస్పెండ్ చేయించుకున్నారని ఎద్దేవా చేశారు. స్పీకర్‌ని మరమనిషి అనడాన్ని తప్పుబడుతూ సభ నుంచి ఈటల రాజేందర్‌ను సస్పెండ్ చేయాలని కోరుతూ ప్రశాంత్‌రెడ్డి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో ప్రస్తుత సమావేశాలు ముగిసేవరకూ ఈటల రాజేందర్‌ను సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. వెంటనే ఈటల లేచి బయటకు వెళ్లిపోయారు. అయితే అసెంబ్లీ ఆవరణలో ఈటల బైటాయిస్తారనే ప్రచారం జరగటంతో పోలీసులు అప్రమత్తమయ్యాయి. ఈటలను ఓ వాహనంలో తీసుకెళ్లి ఆయన ఇంటి దగ్గర వదిలిపెట్టారు. 'బానిసల్లా వ్యవహరించవద్దు. మీ నాశనానికి ఇదంతా చేస్తున్నారు. ఏడాదిగా కుట్ర చేస్తున్నారు. గెలిచిన దగ్గర నుంచి అసెంబ్లీకి రాకుండా చేస్తున్నరు. గొంతు నొక్కుతున్నారు. గద్దె దించేదాకా విశ్రమించను. మీ తాటాకు చప్పుళ్లకు భయపడను' అంటూ పోలీసుల తీరుపై ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం సభలోకి అడుగుపెట్టే ముందు కూడా ఈటల రాజేందర్ చీఫ్ మార్షల్ దగ్గరకెళ్లి 'నేను సభలోకి వెళ్లొచ్చా' అంటూ అడిగి మరీ వెళ్లారు.