Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వివక్షతను ప్రదర్శిస్తున్నదని శాసనమండలిలో టీఆర్ఎస్ సభ్యుడు పల్లా రాజేశ్వర్రెడ్డి విమర్శించారు. మంగళవారం సభలో 'ఎఫ్ఆర్బీఏం చట్టం అమలులో కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ వైఖరి-రాష్ట్ర ప్రగతిపై ప్రభావం'అనే అంశంపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ ఫెడరల్ స్ఫూర్తిని కేంద్రం దెబ్బతిస్తున్నదని విమర్శించారు. నిధుల కేటాయింపులో బీజేపీ పాలిత రాష్ట్రాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నదనీ, ఇతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను పట్టించుకోవడం లేదని చెప్పారు. ఎఫ్ఆర్బీఏం ప్రకారం జీఎస్డీపీలో నాలుగు శాతం రుణాలు తెచ్చుకునేందుకు అవకాశముందన్నారు. విద్యుత్ సంస్కరణలను అమలు చేయనందుకు 0.5 శాతం రుణాలు తెచ్చుకోకుండా ఎఫ్ఆర్బీఎం పరిమితిని 3.5 శాతానికి తగ్గించిందని అన్నారు. దీనివల్ల రూ.6,104 కోట్లు నష్టపోయామని వివరించారు.
మతం మత్తులో బీజేపీ పాలన
కేంద్రంలోని బీజేపీ మతం మత్తులో పాలన సాగిస్తున్నదని టీఆర్ఎస్ సభ్యుడు వెంకట్రామ్రెడ్డి విమర్శించారు. అభివృద్ధి జరిగితే మతం మత్తు ఉండబోదని అన్నారు. అందుకే బీజేపీ మత విద్వేషాలను రెచ్చగొడుతున్నదని చెప్పారు. ఆర్థిక మూలాలను భ్రష్టుపట్టిస్తున్నదని విమర్శించారు. రాష్ట్రాభివృద్ధిని ఆపేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నదని అన్నారు. ఎఫ్ఆర్బీఎం పరిమితిని తగ్గించడం సరైంది కాదని కేంద్రం తీరును ఎంఐఎం సభ్యుడు అఫెండీ తప్పుపట్టారు.