Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- రాజేంద్రనగర్
గంజాయి సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన మంగళవారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. రాజేంద్రనగర్ ఎంపీపీ కార్యాలయంలో శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి విలేకర్ల సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఒరిస్సాకు చెందిన చందు, యూపీకి చెందిన అక్షరు కొంత కాలంగా గంజాయి సరఫరా చేస్తున్నారు. విశాఖపట్నం నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ నెల 11న విశాఖపట్నం నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలించేందుకు ఖాళీ డ్రమ్ముల్లో పెట్టి లారీలో లోడ్ చేశారు. ఈ క్రమంలో విశ్వసనీయ సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు హిమాయత్‌సాగర్ ఔటర్ రింగు రోడ్డుపై ప్రయాణిస్తున్న లారీని పట్టుకున్నారు. లారీలో ఉన్న ప్లాస్టిక్ డ్రమ్ములను పరిశీలించగా గంజాయి బస్తాలు లభ్యమయ్యాయి. రూ.50 లక్షల విలువ చేసే 236 కిలోల గంజాయిని పట్టుకున్నారు. నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రధాన నిందితులు పరారీలో ఉన్నారు. వారికోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితుల నుంచి గంజాయితోపాటు వాహనం, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న పోలీసులకు ఈ సందర్భంగా అవార్డులను అందజేశారు. ఈ సమావేశంలో ఏసీపీ గంగాధర్, సీఐ నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.