Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణం
- సబ్ కమిటీ కన్వీనర్ చెరుపల్లి,
ఎడిటర్ సుధాభాస్కర్, సీజీఎం ప్రభాకర్ సహా పలువురి నివాళి
- 'హైదరాబాద్ జిందాబాద్' సంతాపం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నవతెలంగాణ దినపత్రిక ఎడిటోరియల్ బోర్డు సభ్యులు టీఎన్వీ రమణ (59) మంగళవారం హైదరాబాద్‌లో కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం స్థానిక సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఒక మీటింగులో పాల్గొని అకస్మాత్తుగా కుప్పకూలి పోయారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆయన్ను చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆయనకు మెదడులో విపరీతమైన హెమరేజ్ (రక్తస్రావం) జరిగిందనీ, సిటీ స్కాన్‌లో అదే నిర్దారణ అయిందని వివరించారు. అప్పటి నుంచి వెంటీలేటర్పైనే ఉన్న రమణ మంగళ వారం ఉదయం 11.30 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. రెండు రోజుల క్రితం సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్ర కమిటీ సభ్యులు బి.వెంకట్, రజకవృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.ఆశయ్య, నవతెలంగాణ సంపాదకులు ఆర్.సుధాభాస్కర్, సీజీఎం పి.ప్రభాకర్ తదితరులు ఆస్పత్రికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.
రమణ మరణం పట్ల నవతెలంగాణ సబ్ కమిటీ కన్వీనర్ చెరుపల్లి సీతారాములుతోపాటు సుధాభాస్కర్, ప్రభాకర్ తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. ఆయన భౌతిక కాయాన్ని బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు బాగ్‌లింగంపల్లిలోని నవతెలంగాణ ప్రధాన కార్యాలయం (ఎమ్హెచ్ భవన్)కు తీసుకు వస్తారు. అక్కడ నివాళులర్పించిన అనంతరం... మధ్యాహ్నం ఒంటి గంటకు అంబర్‌పేట లోని శ్మశాన వాటికలో అంత్యక్రియలను నిర్వహి స్తామని సుధాభాస్కర్, ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. రమణ మరణం పట్ల నవతెలంగాణ ఎడిటోరియల్ బోర్డు సభ్యులు, ఉద్యోగులు, సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 'హైదరాబాద్ జిందాబాద్' సంస్థకు గతంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన రమణ... బీపీ, షుగర్ వైద్య శిబిరాలతోపాటు మెగా మెడికల్ క్యాంపుల నిర్వహణలో కీలక పాత్ర పోషించారని ఆ సంస్థ ప్రస్తుత ప్రధాన కార్యదర్శి కె.వీరయ్య తెలిపారు. తమ సంస్థను ప్రజలకు ఉపయోగపడేలా తీర్చిదిద్దటంలో ఆయన కీలక పోషించారని పేర్కొన్నారు. కరోనా కాలంలో కూడా దాతల నుంచి విరాళాలు, నిత్యావసర వస్తువులు సేకరించి, వాటిని తమ సంస్థ ద్వారా పేదలకు పంచిన ఆయన సేవలను మరవలేమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల పట్ల రమణ చిత్తశుద్ధి, ఆయన అధ్యయనం అందరికీ స్ఫూర్తి దాయకమని పేర్కొన్నారు. ఆయన నెలకొల్పిన, ప్రారంభించిన సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతామని తెలిపారు. రమణ మరణం పట్ల వీరయ్య తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. ఆయన మరణం పట్ల ప్రజాశక్తి ఎడిటోరియల్ బోర్డు కూడా తీవ్ర సంతాపాన్ని ప్రకటించింది.
పట్నం రాష్ట్ర కేంద్రం సమావేశం మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. రమణ మృతికి పట్నం ప్రధాన కార్యదర్శి డిజి నర్సింహరావు, సభ్యులు తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు.