Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కనీసం 20 రోజులు నిర్వహించాలి: మీడియా పాయింట్లో సీఎల్పీ నేత భట్టివిక్రమార్క
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఆరునెలల తర్వాత నిర్వహిస్తున్న శాసనసభ సమావేశాలు కేవలం రెండు రోజులకు పరిమితం చేశారని, కనీసం 20 రోజులైనా నిర్వహించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతో కలిసి ఆయన మాట్లాడారు. గోదావరి వరదల్లో నష్టపోయిన వారికి నష్ట పరిహారం అందలేదన్నారు. పోడు భూములకు సంబంధించిన సమస్యలు అలాగే ఉన్నాయని, తొలగించిన 250 మంది హోంగార్డులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు డిగ్రీ వరకు ఉచిత బస్సు పాసులు ఇవ్వాలన్నారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. శాసనసభ సమావేశాల్లో జీరో అవర్ లేదన్నారు. ప్రజాసమస్యలపై చర్చించాల్సిన అవసరం ఉందని, సమావేశాలను పొడిగించాలని కోరారు. ఎమ్మెల్యే శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను పరిష్కరించకుండా ముఖ్యమంత్రి ఎందుకు పారిపోతున్నారని, సమస్యలు పరిష్కరించే ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ప్రజా సమస్యలను పక్క దారి పట్టిస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. ఎన్ని రోజులైనా శాసనసభ సమావేశం నిర్వహిస్తామని చెప్పి కొన్ని రోజులకే పరిమితం చేస్తున్నారని విమర్శించారు. సమావేశాలు నిర్వహించడానికి ప్రభుత్వం ఎందుకు జంకుతున్నదని ప్రశ్నించారు. గోదావరి పరివాహక ప్రాంతంలో వరదల వల్ల నష్టపోయిన వారికి పరిహారం లేదన్నారు. కాంగ్రెస్ శాసనసభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని చెప్పారు. ఎమ్మెల్యే పొదెం వీరయ్య మాట్లాడుతూ.. శాసనసభ అంటే ముఖ్యమంత్రి భయపడుతున్నారని అన్నారు. పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై చర్చ లేదన్నారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ.. సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే పట్టించుకోవడం లేదన్నారు. మిషన్ భగీరథలో పనిచేస్తున్న వారికి జీతాలు లేవు.. వారికి జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.