Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెబినార్‌లో ఎన్ఐఎన్ శాస్త్రవేత్త డాక్టర్ లక్ష్మయ్య
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
భారతదేశ మహిళల్లో ఎక్కువగా సూక్ష్మ పోషకాలు, బి12, ఐరన్, ఫోలిక్‌యాసిడ్ లోపాలున్నట్టు గుర్తించినట్టు జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) శాస్త్రవేత్త లక్ష్మయ్య తెలిపారు. సెప్టెంబరు నెలలో పోషణ మాసోత్సవాలను పురస్కరించుకుని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ విభాగం పత్రికా సమాచార కార్యాలయం మంగళవారం 'కేంద్ర, రాష్ట్ర స్థాయి అనుబంధ పోషకాహార కార్యక్రమాలు-పథకాలు' అనే అంశంపై నిర్వహించిన వెబినార్‌లో ఆయన ముఖ్యవక్తగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు పోషక లోపాల నుంచి బయటపడేందుకు విభిన్న ఆహార పదార్థాలను తగినంత మోతాదులో ప్రతి రోజూ తీసుకోవాలని సూచించారు. యుక్త వయసులో ఆడపిల్లలు తీసుకున్న ఆహారంపైనే భవిష్యత్తులో వారికి పుట్టబోయే పిల్లల ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని తెలిపారు. పోషకాహార లోపాన్ని అధిగమించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ పోషకాహార ప్రోత్సాహక కార్యక్రమం కింద పిండ దశ నుంచి మొదలు శిశువులు, గర్భిణులు, బాలింతలు, కిషోర బాలికల కోసం వివిధ పథకాలను అమలు చేస్తున్నట్టు చెప్పారు. పిండ దశ మొదలు వృద్ధాప్యం వరకు సమతుల్యాహారం తీసుకోవడం ఎంతో అవసమన్నారు. పత్రికా సమాచార కార్యాలయం ఉప సంచాలకులు డాక్టర్ మానస్ కృష్ణ కాంత్, రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ అధికారులు, సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.