Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యతిరేకంగా జరిగే పోరులో నేనూ ఉంటా.. : ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణపై కేంద్రం వివక్షను ప్రదర్శిస్తున్నదని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి విమర్శించారు. ఆ వివక్షకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం చేసే పోరాటంలో తానూ వెంట ఉంటానని ప్రకటించారు. మంగళవారం 'శాసనమండలిలో ఏపీ పునర్విభజన చట్టం హామీల'పై నిర్వహించిన లఘు చర్చలో ఆయన మాట్లాడారు. విభజన చట్టంలోని గిరిజన యూనివర్సిటీ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం తదితర హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. బొగ్గు, నీటి వసతి, ముడి ఖనిజం విడదీసే బైరటీస్ నిల్వలు బయ్యారం సమీపంలో ఉన్నాయని తెలిపారు. దీంతో ఈ ప్రాంతం ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేసేందుకు అనుకూలంగా ఉందని పేర్కొన్నారు. దక్షిణ మధ్య రైల్వేకు మధ్యలో కాజీపేట ప్రాంతం ఉందనీ, అక్కడ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం సముచితంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధి నిధులు మూడు విడతలకుగాను రూ.1,350 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. భద్రాద్రి - కొత్తగూడెం జిల్లాకు చెందిన ఐదు ఏటిపాక, పురుషోత్తంపురం తదితర ఐదు మండలాలను ఏపీలో విలీనం చేశారనీ, వాటిని తిరిగి తెలంగాణలో కలపాలని డిమాండ్ చేశారు.అలాచేయకపోతే భద్రాచలం మునిగిపోయే ప్రమాదముందని హెచ్చరించారు.
షెడ్యూల్ 9, 10 లో సంస్థల విభజనకు చొరవ తీసుకోవాలని నర్సిరెడ్డి ఈ సందర్భంగా కేంద్రాన్ని కోరారు. ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మన ఊరు- మన బడి కార్యక్రమం అమలవుతున్నా ...ఇంకా కొన్ని సమస్యలున్నాయనీ, వాటిని పరిష్కరించాలన్నారు. ఉపాధ్యాయులను అరెస్టు చేయడం సరికాదనీ, చర్చించి పరిష్కరించాలని సూచించారు. రాష్ట్రపతి ఉత్తర్వులు - 2018తో కొన్ని సమస్యలు ఉత్పన్నమయ్యాయనీ, వాటిని పరిశీలించి అవకాశమున్న మేరకు పరిష్కరించాలని నర్సిరెడ్డి కోరారు.
బీజేపీని నిలువరించే చర్యలు తీసుకోండి : జీవన్ రెడ్డి
తలుపులు మూసి తెలంగాణ ఇచ్చామంటూ ప్రధానమంత్రి హౌదాలో ఉండి మాట్లాడుతున్న బీజేపీని రాష్ట్రంలో నిలువరించాలని కాంగ్రెస్ సభ్యుడు జీవన్ రెడ్డి సూచించారు. ఆ పార్టీకి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని విమర్శించారు. విభజన హామీల సాధన కోసం అఖిలపక్షం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వాటి అమల్లో కేంద్రం వివక్ష ఎంత నిజమో, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కూడా అంతే ఉందని స్పష్టం చేశారు. మూడేండ్ల క్రితం వరకు బీజేపీకి, టీఆర్ఎస్ మిత్రపక్షంగా ఉండి మద్దతిచ్చి ఏం సాధించిందని ప్రశ్నించారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ భాను ప్రసాద్ మాట్లాడుతూ, తామెప్పుడు మిత్రపక్షంగా లేమనీ, కేవలం అంశాల వారీగా మద్ధతిచ్చామని స్పష్టం చేశారు. ఇందుకు బదులుగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ మద్దతిచ్చినా హక్కుల విషయంలో మౌనం వహించారని విమర్శించారు. తెలంగాణ ఏర్పడ్డాక గిరిజనులు అత్యధికంగా నష్టపోయారనీ, వారి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
టీఆర్ఎస్ సభ్యుడు కడియం శ్రీహరి మాట్లాడుతూ బీజేపీ అనుసరిస్తున్న విధానాలతో పలు అభివృద్ధి సూచికల్లో భారతదేశం మిగిలిన దేశాల కన్నా వెనుకబడిందని విమర్శించారు. ఆ పార్టీ ఎంపీలు అరిస్తే లాభం లేదనీ, కేంద్రం నుంచి విభజన హామీలను రాబట్టాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి టీఆర్ఎస్పై విమర్శలు మాని అక్కడి నుంచి రావాల్సిన వాటిపై దష్టి పెట్టాలని హితవు పలికారు. కులాల మధ్య చిచ్చు, మతాల మధ్య మంటలు పెట్టి రాజకీయ చలి కాచుకుంటామంటే తెలంగాణ ప్రజలు సహించబోరని హెచ్చరించారు. ఎంఐఎం ఎమ్మెల్సీ జాఫ్రీ మాట్లాడుతూ విభజన హామీలు అమలు చేయకుండా కేంద్రంలోని బీజేపీ సర్కారు ఏపి ప్రభుత్వాన్ని తెలంగాణ సర్కారుపై ఎగదోస్తున్నదని విమర్శించారు.
నాడు ఎన్డీఏ ఉంటే తెలంగాణ వచ్చేదే కాదేమో...
గతంలో ఇప్పుడున్న ఎన్డీఏ ఉంటే తెలంగాణ రాకపోయేదేమో అని శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ సాధనలో ఎంపీగా తాను పాత్ర పోషించానని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంపై సవతి తల్లిలా వివక్ష చూపిస్తున్నదని విమర్శిచారు. విభజన చట్టంలో లేని ఏడు మండలాలను తెలంగాణ నుంచి లాక్కున్నారని తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన చట్టబద్ధ హక్కుల సాధనకు అందరూ సమిష్టిగా పోరాడి కేసీఆర్ నాయకత్వంలో సాధించుకోవాలని సూచించారు.