Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నెల 16,17,18 తేదీల్లో మూడు రోజుల పాటు నిర్వహించే తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను జయప్రదం చేయాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. మంగళవారం అసెంబ్లీలోని కాన్ఫరెన్స్ హాలులో ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులతో మంత్రి వజ్రోత్సవాల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ప్రతీ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని కలెక్టర్లను ఆదేశించారు.ఈ నెల 16న ఉత్సవాలు లాంఛనంగా ప్రారంభం అవుతాయనీ, నియోజకవర్గాల వారీగా 15 వేల మందితో ర్యాలీలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ప్రదర్శనలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, మహిళా సమాఖ్య ఉద్యోగులు, అంగన్వాడీ కార్యకర్తలు జాతీయ జెండాలతో పాల్గొనేలా చూడాలని సూచించారు. దీనికోసం 10 వేల చిన్న, 50 వేల పెద్ద జెండాలు ప్రభుత్వం పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. వారికి భోజనం వసతి ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 17న జిల్లా కేంద్రాల్లో జాతీయ జెండావిష్కరణ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. హైదరాబాద్‌లో బంజారా భవన్, సేవాలాల్ భవన్లను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారనీ, అనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో బహిరంగసభ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమాలకు అన్ని నియోజక వర్గాల నుండి ప్రజలు తరలి వచ్చేందుకు రవాణా, తదితర ఏర్పాట్లు చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు.