Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అప్పటి వరకు జీవో 111 అమలు
- హైకోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హైదరాబాద్ నగర శివార్లలోని రెండు రిజర్వాయర్ల రక్షణకు 1996లో వెలువడిన జీవో నెం.111 అమల్లోనే ఉంటుందని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. హుస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రిజర్వాయర్ల రక్షణకు ఇచ్చిన ఆ జీవోను పూర్తి స్థాయిలో అమలు చేసేలా ఉత్తర్వులివ్వాలనే ప్రజాప్రయోజన వ్యాజ్యంలో ప్రభుత్వం తరఫున పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్ కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. రిజర్వాయర్ల పరిధిలో 10 కిలోమీటర్ల మేర పలు గ్రామాల్లోని భూములకు సంబంధించి ప్రభుత్వం మినహాయింపునిస్తూ జీవోనెం.69 జారీ చేసిందంటూ పిటిషనర్ చెప్పడాన్ని ఆయన తప్పుపట్టారు. ఆ జీవో ప్రకారం రిజర్వాయర్ల రక్షణకు, అక్కడి భూముల్లో లే ఔట్లు, నిర్మాణాలు చేపట్టేందుకోసం అనుసరించాల్సిన విధివిధానాలను తేల్చేందుకు వీలుగా అత్యున్నత స్థాయి అధికారుల కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. సీఎస్ ఆధ్యర్యంలోని ఆ కమిటీలో పురపాలక, పట్టణాభివృద్ధి, ఆర్థిక, సాగునీటి పారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శులతోపాటు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లరు అండ్ సివరేజ్ బోర్డు ఎమ్డీ, స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్య కార్యదర్శి, హెచ్ఎండీఏ డైరెక్టర్లు సభ్యులుగా ఉన్నారంటూ కోర్టుకు వివరించారు. రిజర్వాయర్లలోని నీరు కలుషితం కాకుండా ఉండేందుకు, పరీవాహక ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టకుండా చూసేందుకు, లేఔట్లు, నిర్మాణాలకు ఇవ్వాల్సిన అనుమతులు, మురుగు నీరు రిజర్వాయర్లల్లో చేరకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలు, విడిగా డ్రైనేజీ వ్యవస్థ వంటి అంశాలపై కమిటీ రిపోర్టు ఇస్తుందని తెలిపారు. ఆ రిపోర్టుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకూ జీవోనెం.111 అమల్లోనే ఉంటుందని కోర్టుకు తెలిపారు.