Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీల కోసం 310 గురుకులాలు, స్టడీ సెంటర్లు, హాస్టళ్లు..
- రూ. 2979 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ ఏర్పడేనాటికి గురుకుల పాఠశాలలు నామమాత్రంగా ఉండేవి. ఈ నేపథ్యంలో కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా విద్యాబోధన జరగాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం గురుకుల విద్యకు పెద్దపీట వేసింది. విద్యా పరమైన అభివృద్ధికోసం రాష్ట్ర సర్కారు పలు గురుకులాలను ఏర్పాటు చేసింది. వెనుకబడిన తరగతులకు చెందిన విద్యార్థిని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని మహాత్మా జ్యోతిభాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీని ఏర్పాటు చేసింది. రాష్ట్రం ఏర్పడకముందు బీసీలకు కేవలం 19 రెసిడెన్షియల్ పాఠశాలలు ఉంటే.. నేడు వాటి సంఖ్య 310 కి చేరింది. వీటిలో 142 జూనియర్ కళాశాలలు, 152 హైస్కూళ్లు, 16 డిగ్రీ కళాశాలలున్నాయి. 2023-24 నుండి 119 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలను జూనియర్ కళాశాలలుగా ప్రభుత్వం అప్ గ్రేడ్ చేయాలని నిర్ణయించింది. అత్యున్నత ప్రమాణాలతో ఏర్పాటైన గురుకులాల్లో అందిస్తున్న నాణ్యమైన విద్యతో ఉన్నత చదువుల్లో విద్యార్థులు మెరుగైన ప్రతిభను కనబరుస్తున్నారు. 1,65,410 మంది విద్యార్థులు వాటిలో విద్యనభ్యసిస్తున్నారు. బీసీ గురుకుల విద్యకోసం 2014-15 నుండి ఇప్పటివరకు ప్రభుత్వం రూ.2,979 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం గురుకుల విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నది. ఉచితంగా దుస్తులు, పుస్తకాలు తదితర సౌకర్యాలను కల్పిస్తున్నది. అంతర్జాతీయ విద్యాసంస్థలకు ధీటుగా ఇవి విద్యనందిస్తున్నాయి. ''ఇంగ్లీష్ మీడియం లో విద్యాబోధన తో పాటు కంప్యూటర్ ల్యాబ్లు, డిజిటల్ క్లాస్ రూమ్ల ద్వారా నాణ్యమైన విద్యను ప్రభుత్వం అందిస్తుంది. వాటిల్లో చదివే ప్రతి విద్యార్థి పైన సంవత్సరానికి రూ.1,25,000 ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది. బీసీ గురుకులాలకు సంబంధించిన 2022 ఎస్ఎస్సీలో 97.53శాతం త్తీర్ణత, ఇంటర్లో 93.84 శాతం ఉత్తీర్ణత సాధించారు. దేశ, విదేశాల్లో ప్రామాణిక విద్యా సంస్థల్లో సీట్లు సాధించడం ద్వారా వారు రాష్ట్రానికి గుర్తింపు తెస్తున్నారు. ఐఐటీ, ఐఐఎం వంటి ప్రతిష్టాత్మక సంస్థలలో ప్రవేశాలు సాధిస్తున్నారు. రాష్ట్రంలో 420 ప్రీ మెట్రిక్ హాస్టళ్లు 280 పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లు ఉన్నాయి. 46,457 మంది విద్యార్థులకు వసతి, బోర్డింగ్, సదుపాయాలను సర్కారు కల్పిస్తుంది. దేశవ్యాప్తంగా ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ల వివరాలు సహా యువత చదువుకు తగ్గ ఉద్యోగ ఉపాధి: సమాచారాన్ని, అందించే కేరియర్ గైడెన్స్ కేంద్రాలుగా స్టడీ సర్కిళ్లు రూపొందుతున్నాయి. 16 బీసీ స్టడీ సర్కిళ్లు,100 స్టడీ సెంటర్ల ద్వారా 1,25,000 మంది బీసీ యువతకు ఉద్యోగ ఉపాదిని శిక్షణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.ఈ వివరాలతో కలిగిన ప్రకటనను సమాచార, పౌరసబంధాల శాఖ మంగళవారం విడుదల చేసింది.