Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సమస్యలను పరిష్కరించాలంటూ చలో అసెంబ్లీ కార్యక్రమానికి వచ్చిన ఉపాధ్యాయులు, విద్యార్థులు, కార్మికులు, వీఆర్ఏలపై అణచివేత ధోరణిని అవలంభించడం అప్రజాస్వామికమని నిర్బంధ వ్యతిరేక వేదిక విమర్శించింది. వారిని అరెస్టు చేయడం, కొందరిపై లాఠీచార్జీ చేయడాన్ని తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు వేదిక రాష్ట్ర కన్వీనర్ జి హరగోపాల్, కో కన్వీనర్లు జి లక్ష్మణ్, ఎం రాఘవాచారి, కె రవిచందర్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లోనూ వారు చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించారని తెలిపారు. వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని పేర్కొన్నారు. ఈ స్థితిలో సింగరేణి కార్మికులు, మత్స్యకారులు సైతం చలో అసెంబ్లీ కార్యక్రమానికి పూనుకోవాల్సి వచ్చిందని వివరించారు. న్యాయబద్ధమైన పదోన్నతులు, బదిలీలు, 317 జీవో నిలిపివేత కోసం వివిధ రూపాల్లో ఉపాధ్యాయ సంఘాల పోరాట సమితి (యూఎస్పీసీ) నిరసన వ్యక్తం చేసిందని గుర్తు చేశారు. ఆయా శాఖల అధికారులు, మంత్రులు, ముఖ్యమంత్రి చొరవ తీసుకొని చర్యలు ప్రారంభించి సమస్యలు పరిష్కరించాలని కోరారు.