Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రయివేటు కాలేజీల్లో సీట్ల సర్దుబాటు
- సివిల్, మెకానికల్ నుంచి సీఎస్ఈకి మార్చుకుంటున్న వైనం
- ఉత్తర్వులు విడుదల
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రయివేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో ఆదరణలేని పలు ఇంజినీరింగ్ కోర్సులు రద్దయ్యాయి. అయితే సీట్లు మాత్రం రద్దు కాలేదు. వాటిని ఆయా కాలేజీలు మాత్రం సర్దుబాటు చేసుకుంటున్నాయి. ఆదరణ లేని సివిల్, మెకానికల్ కోర్సుల్లో ఉన్న సీట్లను తగ్గించుకుని డిమాండ్ ఉన్న కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ (సీఎస్ఈ) కోర్సుకు మార్చుకుంటున్నాయి. ఈ మేరకు జేఎన్టీయూ హైదరాబాద్, ఉస్మానియా విశ్వవిద్యాలయాల పరిధిలో కోర్సులను రద్దు చేసుకుని సీట్ల సర్దుబాటుకు అనుమతిలిస్తూ విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ మంగళవారం ఉత్తర్వులు (జీవోనెంబర్ 170) జారీ చేశారు. రాష్ట్రంలో 178 ఇంజినీరింగ్ కాలేజీలున్నాయి. వాటిలో మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, మైనింగ్ వంటి కోర్సుల్లో విద్యార్థులు చేరేందుకు ఆసక్తి చూపడం లేదు. సీఎస్ఈకి భారీగా డిమాండ్ ఉన్నది. ఆ కోర్సులోనే ఎక్కువ మంది విద్యార్థులు చేరేందుకు ఇష్టపడుతున్నారు. ఇంకోవైపు సీఎస్ఈకి అనుబంధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ (ఏఐఎంఎల్), డేటాసైన్స్, రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సులకు ఆదరణ విపరీతంగా ఉన్నది. దీంతో ప్రయివేటు ఇంజినీరింగ్ కాలేజీ యాజమాన్యాలు దీన్ని 'క్యాష్' చేసుకోవాలని భావిస్తున్నాయి. అందులో భాగంగానే మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, మైనింగ్ వంటి కోర్సుల్లో ఉన్న సీట్లను తగ్గించుకుని, లేదంటే రద్దు చేసుకుని ఆ సీట్లను సీఎస్ఈ కోర్సులో సీట్లను సర్దుబాటు చేసుకుంటున్నాయి. అయితే రద్దు చేసుకున్న లేదంటే సీట్లు తగ్గించుకున్న ఆ కోర్సుల్లో ద్వితీయ, తృతీయ, నాలుగో సంవత్సరంలో చదివే విద్యార్థుల కోసం ఆ కాలేజీలు అధ్యాపకులను కొనసాగించాలంటూ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఆ కోర్సు పూర్తయ్యే వరకూ వసతులు కల్పించాలనీ, అధ్యాపకులను కొనసాగించాలని యాజమాన్యాలను ఆదేశించారు.