Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పది రోజుల్లో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో రిపోర్టు చేయాలి
- ఇంటర్ విద్యాశాఖ కమిషనర్ జలీల్ ఉత్తర్వులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ప్రయివేటు ఎయిడెడ్ కాలేజీల్లో పనిచేస్తున్న అధ్యాపకులను ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో సర్దుబాటు చేయాలని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు ఇంటర్ విద్యాశాఖ కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రయివేటు ఎయిడెడ్ కాలేజీల్లో పనిభారం లేకుండా పనిచేస్తున్న 63 మంది అధ్యాపకులను ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో సర్దుబాటు చేస్తున్నట్టు తెలిపారు.
వెంటనే వారు ప్రస్తుతం పనిచేస్తున్న కాలేజీ నుంచి రిలీవ్ కావాలని ఆదేశించారు. సంబంధించిన కాలేజీల ప్రిన్సిపాళ్లు, కరస్పాండెంట్లు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. వారికి కేటాయించిన ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాళ్లకు పది రోజుల్లో నివేదించాలని కోరారు. 63 మంది జూనియర్ లెక్చరర్లతోపాటు లైబ్రరియన్ డి మధుసూదన్, సీనియర్ అసిస్టెంట్ డి శ్రీనివాసమూర్తిని సైతం ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో సర్దుబాటు చేస్తున్నట్టు ప్రకటించారు.
11 ఎయిడెడ్ కాలేజీలు మూత
రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉన్న 11 ప్రయివేటు ఎయిడెడ్ కాలేజీలు ప్రస్తుతం మూతపడ్డాయని జలీల్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇందులో హైదరాబాద్లో నాలుగు, సికింద్రాబాద్, రంగారెడ్డి, సూర్యాపేట, నల్లగొండ, ఖమ్మం, మహబూబాబాద్, నిజామాబాద్లో ఒక్కోటి చొప్పున ఉన్నాయని తెలిపారు. ఆడిట్ ఆమోదం అయ్యేంత వరకూ ఆ కాలేజీలు పనిచేయబోవని స్పష్టం చేశారు. పూర్తిస్థాయి రికార్డులను సమర్పించాలంటూ ఆ కాలేజీల కరస్పాండెంట్లు, యాజమాన్యాలను ఆదేశించారు. ఏడాది వారీగా ఆడిట్ నివేదికలు, గ్రాంట్ ఇన్ ఎయిడ్, రికవరీలు, ఫిక్స్డ్ డిపాజిట్లు, ఆస్తులు, డీఐఈవోలను సంప్రదించక ముందు, ఆ తర్వాత ఉన్న బాధ్యతలు వంటి వివరాలు ఇవ్వాలని కోరారు.