Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రామీణ రోడ్లకు అనుమతులపై ఢిల్లీకెళ్లి వైల్డ్ లైఫ్ బోర్డుతో చర్చిస్తాం :
- అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం, అటవీ సంపద సంరక్షణ కోసం తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో చేపట్టిన రోడ్ల పనులకు జాతీయ వన్యప్రాణుల బోర్డు అనుమతులివ్వట్లేదనీ, అవసరమైతే ఢిల్లీ వెళ్ళి త్వరితగతిన అటవీ అనుమతులు వచ్చేలా సంబంధిత అధికారులతో చర్చిస్తామని తెలిపారు. భవిష్యత్తులో అటవీ సంపద అన్యాక్రాంతం కాకుండా చేపట్టే సంరక్షణ చర్యలపైనా, రోడ్లకు అనుమతులపై బుధవారం అరణ్యభవన్‌లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి కోఆర్డినేషన్ కమిటీ చైర్మెన్‌గా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. జిల్లా, మండలం, గ్రామపంచాయతీ స్థాయిలో కమిటీల ఏర్పాటు, బాధ్యత, క్షేత్రస్థాయిలో పోడు భూముల పరిశీలన, అడవులను సంరక్షణ చర్యల గురించి అందులో చర్చించారు. పోడు సాగులో ఉన్న భూములపై దాఖలైన క్లెయిమ్‌లను బేరీజు వేయడం, పోడు కోసం ఆక్రమణకు గురైన అటవీ భూమిని అంచనా వేయడం, పోడు సమస్య జిల్లా స్థాయిలో పరిష్కారానికి అందుబాటులో ఉన్న అవకాశాలు, వనరులను ఉపయోగించుకోవడం, తదితర అంశాల గురించి మంత్రి వివరించారు. రాజకీయాల కతీతంగా, పారదర్శకంగా అర్హులైన లబ్దిదారులను గుర్తించాలని ఎమ్మెల్యేలకు సూచించారు. పర్యావరణ పరిరక్షణకు నిర్ధేశించిన అటవీ చట్టాలకు విఘాతం కలగకుండా గిరిజన గ్రామాల రోడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అటవీ ప్రాంతంలో రోడ్లకు సంబంధించి ఇంజినీరింగ్ శాఖ అధికారులు చేసే ప్రతిపాదనల దశలోనే అటవీ శాఖ అధికారులతో సంప్రదించాలని స్పష్టం చేశారు.
మారుమాలూ గ్రామాలకు రహదారి సౌకర్యం లేకపోవడంతో వైద్య పరంగా గిరిజనులు ముఖ్యంగా గర్భిణులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనీ, అటవీ అనుమతుల్లో జాప్యం లేకుండా చూడాలని మంత్రిని ఎమ్మెల్యేలు కోరారు. ఈ సమావేశంలో అటవీ శాఖ స్పెషల్ సీఎస్ శాంతికుమారి, పీసీసీఎఫ్ ఆర్ఎం.డొబ్రియల్, ఎమ్మెల్యేలు జోగు రామన్న, కోనేరు కోనప్ప, విఠల్ రెడ్డి, రేఖా శ్యాంనాయక్, దివాకర్ రావు, ఆత్రం సక్కు, రాథోడ్ బాపురావు, దుర్గం చిన్నయ్య, ఎమ్మెల్సీ దండే విఠల్, పీసీసీఎఫ్ (ప్రొడక్షన్) ఎంసీ.పర్గెయిన్, తదితరులు పాల్గొన్నారు.