Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
నల్లగొండ జిల్లా దామరచర్లలో 4వేల మెగావాట్ల ఉత్పత్తి సామర్ధ్యంతో నిర్మితమవుతున్న యాదాద్రి విద్యుత్కేంద్రానికి రూ.920.25 కోట్ల రుణం సొమ్ము విడుదల అయ్యింది. గ్రామీణ విద్యుదీకరణ సంస్థ (ఆర్ఈసీ) ఈ రుణాన్ని గురువారం విడుదల చేస్తున్నట్టు టీఎస్ జెన్కోకు తెలిపింది. ఈ ఏడాది మార్చి నుంచి ఈ ప్రాజెక్ట్‌కు రుణం సొమ్ము విడుదలను ఆర్ఈసీ నిలిపివేసిన విషయం తెలిసిందే. కేంద్రప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం త్రైపాక్షిక ఒప్పందం చేసుకుంటేనే మిగిలిన రుణాన్ని మంజూరు చేస్తామని షరతు విధించింది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తూ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే మంజూరైన రుణాలకు రాష్ట్ర ప్రభుత్వం త్రైపాక్షిక ఒప్పందం ఎందుకు చేసుకోవాలని ఆయన ప్రశ్నించారు. అయితే యాదాద్రి విద్యుత్కేంద్ర నిర్మాణానికి నిధులను నిలిపివేయడం వల్ల నిర్మాణ వ్యయం పెరుగుతుందనీ, నిర్మాణ సంస్థ బీహెచ్ఈఎల్ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నదని స్వయంగా కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్‌కు ఈనెల 5వ తేదీ లేఖ రాసారు. ఈ నేపథ్యంలో కేంద్రంలోని రెండు ప్రభుత్వ శాఖల మధ్య ఉన్న డొల్లతనం వెల్లడి అయ్యింది. ఇదే అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు ఆర్ఈసీ నుంచి నిధులు విడుదల అవడంతో నిర్మాణ పనులను మరింత వేగవంతం చేస్తామని టీఎస్ జెన్కో సీఎమ్‌డీ దేవులపల్లి ప్రభాకరరావు 'నవతెలంగాణ'కు తెలిపారు.