Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉద్యమంలో లేని పార్టీ ఉత్సవాలు జరపటం విడ్డూరం : ఎంవీ రమణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కల్లుగీత వృత్తిని నిషేధించినవారు ఇక్కడకొచ్చి నీతులు చెబుతున్నారని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం (టీజీకేఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవీ రమణ శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఎలాంటి పాత్ర లేని ఆ పార్టీ ఉత్సవాలు నిర్వహించటం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. భూమి,భుక్తి, వెట్టిచాకిరి నుంచి విముక్తికోసం సాగిన ఆ పోరాటంలో వేలాది మంది అమరులయ్యారని తెలిపారు. సామాన్యప్రజలు సైతం వీరోచితంగా పోరాడారని పేర్కొన్నారు. దున్నేవానికి భూమి, ఎక్కే వానికి చెట్టు నినాదంతో కల్లుగీత కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమంలో పాల్గొన్నారని తెలిపారు. కమ్యూనిస్టుల నాయకత్వంలో 10 లక్షల ఎకరాల భూపంపిణీ జరిగిందని గుర్తుచేశారు. ఈ మహత్తర పోరాట చరిత్రను మసిపూసి మారేడుకాయ చేసేందుకు మతోన్మాదులు చూస్తున్నారని తెలిపారు. ఈ పోరాటాన్ని హిందూ ముస్లింలకు మధ్య జరిగిన కొట్లాటగా చిత్రీకరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఉద్యమంతో ఎలాంటి సంబంధం లేని బీజేపీ ఉత్సవాలు జరపటమేంటని ప్రశ్నించారు.ఆ పార్టీ పాలిత రాష్ట్రమైన కర్ణాటకలోని రాయచూర్, దేవదుర్గ్, సిద్ధాపూర్, సించోలి, సేలం తదితర జిల్లాల్లో లక్షలాదిమంది వృత్తిని కోల్పోయారనీ, వారంతా రోడ్ల పాలయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో వేలం పాటల విధానం కొనసాగుతున్నదని తెలిపారు. గుజరాత్ తదితర రాష్ట్రాల్లో కల్లుని నిషేధించారని పేర్కొన్నారు. తెలంగాణలో మాత్రం వారు నీతులు వల్లిస్తున్నారని విమర్శించారు.