Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేరళలో భూస్వాముల్లేరు
- 96 శాతం కుటుంబాల చేతిలో మొత్తం భూమి
- సాయుధ పోరాటం స్ఫూర్తితో సమరశీల ఉద్యమాలు
- ఆర్ఎస్ఎస్ ప్రయోజనాలే కేంద్రానికి ప్రధానం
- బీజేపీని ఓడిస్తేనే ప్రజలకు విముక్తి : సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు విజయరాఘవన్
- హైదరాబాద్‌లో భారీ ప్రదర్శన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేరళలోని వామపక్ష ప్రభుత్వం దేశానికే ప్రత్యామ్నాయమని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు ఎ విజయరాఘవన్ అన్నారు. 96 శాతం కుటుంబాల చేతిలో మొత్తం భూమి ఉందని చెప్పారు. ఆ రాష్ట్రంలో భూస్వాముల్లేరనీ, ఎర్రజెండా అధికారంలో ఉండడం వల్లే ఇది సాధ్యమైందని అన్నారు. వీరతెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని శనివారం సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా లోయర్‌ట్యాంక్‌బండ్‌లో ఉన్న వీరనారి ఐలమ్మ విగ్రహానికి విజయరాఘవన్‌తోపాటు ఇతర నాయకులు పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ట్యాంక్‌బండ్‌పైన ఉన్న మఖ్దూం మొహియుద్దీన్ విగ్రహం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఎర్రజెండాలతో ట్యాంక్‌బండ్ ప్రాంగణమంతా రెపరెపలాడింది. మఖ్దూం విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభనుద్దేశించి విజయరాఘవన్ మాట్లాడుతూ కేరళలో బీజేపీకి ఒక ఎమ్మెల్యే ఉండేవారని గుర్తు చేశారు. అక్కడి సీఎం పినరయి విజయన్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో కేరళ అసెంబ్లీలో బీజేపీ లేకుండా చేయాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారని చెప్పారు. దీంతో ఆ పార్టీ ఆ ఒక్క సీటునూ గెలవలేదన్నారు. సర్కారు బడుల్లో పేద విద్యార్థులకు డిజిటల్ విద్య అందుతున్నదని వివరించారు. కోవిడ్ సమయంలో ప్రజలకు ఇబ్బందుల్లేకుండా వామపక్ష ప్రభుత్వం చర్యలు తీసుకుందనీ, మెరుగైన వైద్య సేవలు అందించిందని గుర్తు చేశారు. ఏటా లక్ష మందికి రూ.పది లక్షల వరకు ఖర్చు చేసి ఇండ్లు నిర్మించి ఇస్తున్నామని చెప్పారు. అక్కడ ఆకలి చావుల్లేవనీ, ప్రజలకు అన్నిరకాలుగా అండగా ఉంటుందన్నారు. ప్రజా సంక్షేమం కోసమే వామపక్ష ప్రభుత్వం పనిచేస్తున్నదని వివరించారు. అయినా కేరళ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు మోడీ సర్కారు కుట్ర చేస్తున్నదని విమర్శించారు. విద్యావైద్యం, మౌలిక వసతుల కల్పన, మానవాభివృద్ధిలో కేరళ తరహాలో దేశమంతా మార్పు రావాలని ఆకాంక్షించారు. అది నెరవేరాలంటే దేశంలో ఎర్రజెండా ప్రభుత్వం రావాలన్నారు.
గోమాత అంటూనే పాలు, పెరుగుపై జీఎస్టీ
గోమాత అంటూనే మోడీ ప్రభుత్వం పాలు, పెరుగు, బియ్యం, గోధుమలతోపాటు ఆహారపదార్థాలపై జీఎస్టీ వేసిందని విజయరాఘవన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆంగ్లేయులు ఉప్పుపై పన్ను వేస్తే దానికి వ్యతిరేకంగా గాంధీ నేతృత్వంలో ఉప్పుసత్యాగ్రహం సాగిందని గుర్తు చేశారు. డబుల్ ఇంజిన్ సర్కారంటే మోడీ-షా, అదానీ-అంబానీ, ఆర్ఎస్ఎస్-బీజేపీ అని ఎద్దేవా చేశారు. ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ పేదలకు వ్యతిరేకమనీ, కార్పొరేట్ శక్తులకు అనుకూలమనీ, అంబానీ-అదానీ కోసమే పనిచేస్తున్నదని చెప్పారు. కార్పొరేట్లకు రూ.నాలుగు లక్షల కోట్ల పన్నురాయితీలు కల్పించారని అన్నారు. ప్రభుత్వరంగాన్ని మోడీ ప్రభుత్వం ప్రయివేటుపరం చేస్తున్నదని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నదని చెప్పారు. ప్రజల కోసం మాట్లాడే ఎంపీలను పార్లమెంటు నుంచి సస్పెండ్ చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. నెహ్రూ లౌకికవాదిగా పనిచేశారని అన్నారు. కానీ మోడీ ఆర్ఎస్ఎస్ ప్రయోజనాలను నెరవేర్చడం కోసమే పనిచేస్తున్నారని విమర్శించారు. మతం ఆధారంగా పాలన సాగించడం, ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడమే బీజేపీ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఇంకోవైపు విపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే పనిలో ఈడీ, సీబీఐ నిమగమై ఉన్యాని అన్నారు. మహారాష్ట్ర, కర్నాటక, మధ్యప్రదేశ్‌లో ఓడిపోయినా విమపక్ష ఎమ్మెల్యేల కొనుగోళ్లతో అధికారంలోకి వచ్చిందన్నారు.
చరిత్రను వక్రీకరిస్తున్న బీజేపీ
బీజేపీ చరిత్రను వక్రీకరిస్తున్నదని విజయరాఘవన్ విమర్శించారు. హైదరాబాద్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వచ్చారని చెప్పారు. మతం ఆధారంగా ప్రజలను విభజించడమే వారి లక్ష్యమని అన్నారు. సెప్టెంబర్-17పై వాస్తవాలను చెప్పకుండా అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. నిజాంకు వ్యతిరేకంగా హిందూ-ముస్లింల మధ్య పోరాటం సాగిందంటూ చరిత్రను వక్రీకరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రధానమంత్రి ప్రధాన మాంత్రికుడిగా మారాడని ఎద్దేవా చేశారు. ప్రజలు, రైతులు, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం స్ఫూర్తితో సమరశీల ఉద్యమాలు నిర్మించాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యం, లౌకికత్వం, రాష్ట్రాల హక్కులు, రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు ఐక్యంగా పోరాడాలన్నారు. ప్రత్యామ్నాయ రాజకీయాలను ముందుకుతీసుకెళ్లాలని కోరారు.
బీజేపీని తరిమికొట్టాలి : జ్యోతి, సారంపల్లి, నంద్యాల
ముస్లిం నిజాం నవాబుకు వ్యతిరేకంగా హిందువులు సాగించిన పోరాటంగా చరిత్రను వక్రీకరించడానికి బీజేపీకి సిగ్గుండాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు టి జ్యోతి, సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి, నంద్యాల నర్సింహ్మారెడ్డి విమర్శించారు. చరిత్ర తెలుసుకోవాలనీ, వక్రీకరిస్తే ఖబడ్దార్ అంటూ బీజేపీని హెచ్చరించారు. ఆ పార్టీని రాష్ట్రం నుంచి తరిమికొట్టాలనీ, ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని వారు పిలుపునిచ్చారు. మనిషి రక్తం ఎర్రంగా ఎన్నంతకాలం కమ్యూనిస్టులుంటారని ఉద్ఘాటించారు. సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ కార్యదర్శి ఎం శ్రీనివాస్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎంవి రమణ, పి ప్రభాకర్, జె బాబురావు, సిటీ కమిటీ కార్యదర్శివర్గ సభ్యులు ఎం మహేందర్, ఎం దశరథ్, నాగలక్ష్మి, ఈశ్వర్రావు, ఎం శ్రీనివాసరావు, రాజన్న, ఎం వెంకటేశ్, సీనియర్ నాయకులు పీఎస్ఎన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.