Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దున్నేవాడికి భూమి కోసం పోరాటం చేసిందీ కమ్యూనిస్టులే..
- నేడు నైజాంను మించిపోయిన బీజేపీ అరాచకాలు
- తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల్లో సీపీఐ(ఎం) నేతలు
నవతెలంగాణ- విలేకరులు
''తెలంగాణ గడ్డపై భూమి కోసం.. భుక్తి కోసం.. వెట్టిచాకిరీ నుంచి విముక్తి కోసం పోరాడింది కమ్యూనిస్టులే.. 3000 గ్రామాల్లో 10 లక్షల ఎకరాల సాగు భూమిని పేదలకు పంచింది ఎర్రజెండానే.. కమ్యూనిస్టుల నేతృత్వంలోనే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం సాగింది'' అని సీపీఐ(ఎం) నేతలు పునరుద్ఘాటించారు. రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా శనివారం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల ముగింపు కార్యక్రమాలు నిర్వహించారు.
తెలంగాణ సాయుధ రైతంగ పోరాటానికి వారసులు కమ్యూనిస్టులేనని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ చెరువుపల్లి సీతారాములు అన్నారు. యాదాద్రిభువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలం పిల్లాయిపల్లి గ్రామంలో అమరవీరుల స్థూపం వద్ద పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సభలో చెరుపల్లి మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ రైెతాంగ పోరాటం మూలంగా వెట్టి చాకిరీ నుంచి ప్రజలకు విముక్తి కలిగించిందన్నారు. ఈ పోరాటంలో వేలాదిమంది కమ్యూనిస్టు యోధులు మరణించారన్నారు. తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధం లేని బీజేపీ.. ఇప్పుడు వక్రీకరించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు.
వనపర్తి జిల్లా కేంద్రంలోని దాచ లక్ష్మయ్య మీటింగ్ హాల్లో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి జబ్బార్ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో కేంద్ర కమిటీ సభ్యులు బి.వెంకట్ ప్రసంగించారు. నైజాం పాలనతోపాటు జాగీర్దారీ వ్యవస్థను కూకటి వేళ్లతో పెకిలించింది కమ్యూనిస్టులేనన్న విషయం మరిచిపోరాదన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంతో ఏ సంబంధం లేని బీజేపీ శ్రేణులు ఈ ఉద్యమానికి మతం రంగు పులిమేందుకు చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నైజాం నవాబు కింద ఉండి అనేక దారుణాలు జరిపింది.. సంస్థానాల్లో క్రియాశీలకంగా ఉన్నది హిందువులేనన్న విషయం మర్చిపోరాదన్నారు. 560 సంస్థానాల్లో 25 వాటిల్లో మాత్రమే ముస్లిములుండేవారని తెలిపారు. చారిత్రక తప్పిదానికి ఒడిగడుతున్న మత శక్తులను ఓడించడమే కమ్యూనిస్టుల ముందున్న కర్తవ్యమన్నారు.
ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో వీర తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవ ముగింపు వేడుకలు నిర్వహించారు. తెలంగాణ సాయుధ పోరాట వీరులను సన్మానించారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో త్రీటౌన్ ప్రాంతంలోని గ్రెయిన్ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన సభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు హాజరై మాట్లాడారు. నైజాంను మించి నేడు ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని బీజేపీ అరాచకాలకు పాల్పడుతోందని విమర్శించారు. రజాకార్లను మించి బీజేపీ దోపిడీ పాలన సాగుతోందన్నారు. నిజాం దొరలకు దోచిపెడితే... మోడీ కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్, ఎం.సుబ్బారావు పాల్గొన్నారు. మధిరలో బైక్ ర్యాలీ నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో జరిగిన ముగింపు వారోత్సవాల్లో సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు మిడియం బాబూరావు ప్రసంగించారు. నిజాం రజాకార్లును తరిమికొట్టింది కమ్యూనిస్టులేనని గుర్తుచేశారు. రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ సాయుధ పోరాట యోధులు భీమ్ రెడ్డి నరసింహారెడ్డి, బొమ్మగాని ధర్మబిక్షం విగ్రహాలకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మల్లు లక్ష్మి పూలమాలవేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని పేద ప్రజలను దోపిడీ పీడన నుంచి విముక్తి చేసిన యోధుల వారసత్వాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. దేశాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం లూటీ చేస్తోందని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్.వెంకట్రాములు ఆగ్రహం వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తా నుంచి పార్టీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.