Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో రేవంత్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తెలంగాణ సాయుధ పోరాటం స్ఫూర్తితో నేటి నిరంకుశ పాలకులకు వ్యతిరేకంగా కొట్లాడాల్సిన అవసరముందని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి చెప్పారు. బీజేపీ, టీఆర్ఎస్ కుట్రలను తెలంగాణ సమాజం తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 17 సందర్భంగా హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో తెలంగాణ స్వాతంత్య్ర వజ్రోత్సవాలను ఆయన ప్రారంభించారు. జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అమరుల పోరాట ఫలితంగానే తెలంగాణ స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటుందని తెలిపారు. తెలంగాణకు స్వేచ్ఛను ప్రసాదించింది కాంగ్రేసేనని చెప్పారు. భూమి కోసం, భుక్తి కోసం ఆనాడు వందలాది గ్రామాల్లో రైతులు దండు కట్టారని గుర్తు చేశారు. ఇప్పుడు కొంతమంది చరిత్రను వక్రీకరించి.. కుల మతాల చిచ్చు పెట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారని విమర్శించారు. తెలంగాణకు స్వాతంత్య్రం సిద్ధించడంలో కాంగ్రెస్ పాత్ర లేదని చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. మత కల్లోలం సృష్టించి బీజేపీ తెలంగాణను ఆక్రమించుకోవాలని చూస్తున్నదనీ, అప్రమత్తంగా ఉండి తెలంగాణను రక్షించుకోవాలని కోరారు. హైదరాబాద్‌తోపాటు గుజరాత్‌లోని జూనాఘడ్కు కూడా ఒకేసారి స్వాతంత్య్రం వచ్చిందనీ, అక్కడెందుకు బీజేపీ వజ్రోత్సవాలు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే బీజేపీ చిల్లర వేషాలు వేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 17ను ఇందుకు ఆయుధంగా ఉపయోగించుకోవాలని చూస్తున్నదని చెప్పారు. మొదట గుజరాత్లో ఉత్సవాలు జరిపిన తర్వాతనే హైదరాబాద్‌లో ఉత్సవాలు జరపాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సవాల్ విసిరారు. పెట్టుబడులను గుజరాత్‌కు తరలించుకుపోయేందుకే గుజరాతీ మంత్రులు, పెట్టుబడిదారులు కుట్ర కోణంలో హైదరాబాద్‌లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని విమర్శించారు. ప్రశాంతమైన హైదరాబాద్‌లో మత కల్లోలం సృష్టించాలనే కుట్రలు జరుగుతున్నాయని చెప్పారు. రెచ్చగొట్టే కార్యక్రమాలు కాకుండా.. తెలంగాణ అభివృద్ధిపై బీజేపీ ప్రణాళిక ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు.
సర్దార్ కాంగ్రెస్ కుటుంబ సభ్యుడు
సర్దార్ వల్లభారు పటేల్ తమ వాడనీ, ఆయనది కాంగ్రెస్ కుటుంబమని రేవంత్ గుర్తు చేశారు. ఆర్ఎస్ఎస్ మతతత్వ సంస్థ అని గుర్తించి, ఆనాడే దానిని వల్లభారు పటేల్ నిషేధించారని గుర్తు చేశారు. అసలు గాంధీ భవన్‌కు పునాదులు వేసిందే పటేల్ అని చెప్పారు. కాంగ్రెస్ చరిత్రను దొంగిలించి బీజేపీ తమ చరిత్రగా చెప్పుకునే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. ఆనాటి ప్రధాని నెహ్రూ ఆదేశానుసారమే వల్లభారు పటేల్ హైదరాబాద్‌లో ఆపరేషన్ పోలో నిర్వహించారని చెప్పారు. ఇప్పుడు ప్రధాని మోడీ ఆదేశించనిదే హోంమంత్రి అమిత్‌షా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో మతం పేరుతో బీజేపీ చిచ్చు పెట్టాలని చూస్తోందని ఈ పరిస్థితికి కేసీఆరే కారణమని రేవంత్ విమర్శించారు. కార్యక్రమంలో గీతారెడ్డి, మహేష్‌కుమార్‌గౌడ్, శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ, కుసుమకుమార్, మల్లు రవి, ప్రీతం తదితరులు పాల్గొన్నారు.
సబ్బండ వర్గాల తెలంగాణ తల్లి ఆవిష్కరణ
సబ్బండ వర్గాలు ప్రతిబింబించే తెలంగాణ తల్లి విగ్రహాన్ని గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ ఆవిష్కరించారు. ఇక నుంచి ఈ నమూనానే తెలంగాణ తల్లిగా ఊరూరా ప్రతిష్టించుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ తల్లి అందరికీ అమ్మలా ఉంటుందనీ, దొరలు, రాచరిక వ్యవస్థకు ప్రతిబింబంగా ఉండదని తెలిపారు. విగ్రహంలో మూడు రంగుల వస్త్రం భారత జాతీయ భావానికి ప్రతీక అని తెలిపారు. త్వరలోనే ప్రత్యేక తెలంగాణ జెండాను రూపొందిస్తామనీ, ఇందుకు ఎవరైనా సూచనలు చేయవచ్చన్నారు. గాంధీభవన్‌లో ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో 'ప్రజాస్వామ్య పరిరక్షణకై పాదాభివందనం' పోస్టర్‌ను రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు.