Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆంజనేయులు సంస్మరణ సభలో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
విద్యా, వైద్య రంగాల పట్ల సర్కారు నిర్లక్ష్యాన్ని విడనాడి, పేదలందరికీ అందుబాటులోకి వచ్చే విధంగా బలోపేతం చేయాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్లో పౌరస్పందన వేదిక రాష్ట్ర నాయకులు ఆంజనేయులు సంస్మరణ సభ రామకృష్ణ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా నర్సిరెడ్డి మాట్లాడుతూ 75ఏండ్ల స్వాతంత్య్ర భారతంలో నేటికీ అందరికీ విద్యా, వైద్యం అందుబాటులో లేకపోవటం విచారకరమన్నారు. ఈ విషయాన్ని కరోనా కాలంలో ప్రత్యక్షంగా చూశామని తెలిపారు. విద్య, వైద్యం డబ్బున్నొళ్లకే అందుబాటులో ఉందన్నారు.
ఈ నేపథ్యంలో పౌరస్పందన వేదిక ఏర్పడిందని చెప్పారు. ఈ వేదికద్వారా ప్రజలెదుర్కొంటున్న పలు సమస్యలపై స్పందిస్తూ..ప్రభుత్వాన్ని ఆలోచింపజేస్తుందని తెలిపారు. ఈ కర్తవ్య నిర్వహణలో ఆంజనేయులు ప్రముఖ పాత్ర పోషించారని గుర్తుచేశారు. సమస్యలపట్ల స్పందించేగుణం, ప్రజలతో మమేకమయ్యే పద్దతి, చెప్పటమేగాక..ఆచరణవాదిగా ఉండే పద్దతిని చూస్తే..ఆయన అందరికీ ఆదర్శమనే విషయంలో ఎలాంటి శేషబిషలు లేవన్నారు. ఉపాధ్యాయ రంగంలో పనిచేసిన కాలంలోనూ అన్ని సంఘాలతో కలిమిడిగా ఉన్నారని గుర్తుచేశారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పౌరస్పందన వేదిక రాష్ట్ర కార్యదర్శి రాధేశ్యాం, సలహాదారు ఎం ఏ కే దత్తు, వేదిక ఉపాధ్యక్షులు డాక్టర్ శారద, నాయకులు జితిన్, రవీందర్, సింహాచలం, మహ్మద్ సమ్మద్,అంజిరెడ్డి, సురేష్,సుదీర్ తదితరులు మాట్లాడారు.