Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.48 లక్షలు తీసుకున్నట్టు సీసీఎస్ పోలీసులకు బాధితుడి ఫిర్యాదు
- బీజేపీ నేత కొత్తపల్లి సతీష్ కుమార్ అరెస్ట్
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
మెడికల్ సీటు ఇప్పిస్తానని రూ.48 లక్షలు తీసుకుని మోసం చేసిన బీజేపీ నేత కొత్తపల్లి సతీష్‌కుమార్‌ను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. సీటు ఇప్పించకపోవడంతో తాము మోసపోయామని గ్రహించిన బాధితులు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరిపి కొత్తపల్లి సతీష్‌కుమార్‌ను అరెస్టు చేశారు. సతీష్ కుమార్ గతంలో జనగాం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. విద్యార్థిని తండ్రి ఎం.సదానంద్ తెలిపిన వివరాల ప్రకారం..
తన కుమార్తెకు ఎంబీబీఎస్ మెడికల్ సీటు ఇప్పించాలని సతీష్‌ను బాధితుడు సంప్రదించాడు. గతంలో తాను ఎంతో మందికి మెడికల్ సీట్లు ఇప్పించానని సతీష్ సదానంద్‌ను నమ్మించాడు. వారి నుంచి రూ.48లక్షలు తీసుకున్నాడు. సీటు విషయమై మూడు నెలలు తన చుట్టూ తిప్పించుకుని ఫేక్ మెడికల్ సీటు లెటర్ ఇచ్చాడు. అది తీసుకుని బాధితులు బాచుపల్లిలోని మమత మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోగా.. అది తప్పుడు లెటర్ అని కళాశాల యాజమాన్యం తన కుమార్తెకు మెడికల్ సీటు ఇవ్వడానికి నిరాకరించిందని తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. దాంతో బాధితులు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొత్తపల్లి సతీష్ కుమార్‌పై సెక్షన్ 406, 420, 465, 468, 471 కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఈ కేసులో ఇంకా నలుగురు అనుమానితులు ఈశ్వర్ ప్రసాద్, జయప్రకాశ్ రెడ్డి, ఇంకా ఇద్దరు తప్పించుకు తిరుగుతున్నారని, వారిని కూడా అదుపులోకి తీసుకోవాలని బాధితుడు సీసీఎస్ అధికారులను అభ్యర్థించారు.