Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అక్టోబర్ 10న బడులు పున:ప్రారంభం
- అకడమిక్ క్యాలెండర్లో మార్పులేదు
- పాఠశాల విద్యాశాఖ స్పష్టీకరణ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాలకు చెందిన ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు ఈనెల 26 నుంచే దసరా సెలవులుంటాయని పాఠశాల విద్యాశాఖ స్పష్టతనిచ్చింది. ఈ మేరకు విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం 2022-23 విద్యాసంవత్సరంలో ఈనెల 25న ఆదివారంతో కలిపి ఈనెల 26 నుంచి వచ్చేనెల తొమ్మిదో తేదీ వరకు దసరా సెలవులుంటాయని తెలిపారు. ఈ సెలవుల్లో ఎలాంటి మార్పు లేదనీ, అకడమిక్ క్యాలెండర్లో దసరా సెలవులను గతంలోనే ప్రకటించామని గుర్తు చేశారు. అయితే రాష్ట్రంలో దసరా సెలవులు ఐదురోజులపాటు తగ్గే అవకాశముందంటూ పెద్దఎత్తున చర్చజరిగిన విషయం తెలిసిందే. అకడమిక్ క్యాలెండర్ మార్పు చేయాలంటూ, దసరా సెలవులను తగ్గించాలంటూ మంగళవారం విద్యాశాఖకు రాష్ట్ర విద్యా, పరిశోధన శిక్షణా మండలి (ఎస్సీఈఆర్టీ) డైరెక్టర్ ఎం రాధారెడ్డి ప్రతిపాదనలు పంపించిన సంగతి విదితమే. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాల్లోనూ అయోమయం నెలకొంది. అయితే ఆ ప్రతిపాదనల గురించి పాఠశాల విద్యాశాఖ ప్రకటనలో ప్రస్తావన చేయకపోవడం గమనార్హం. భారీ వర్షాలు, వరదల కారణంగా పాఠశాలలకు జులై 11 నుంచి 16 వరకు అంటే ఆరు రోజులు, ఈనెల 17న తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా ఒకరోజు కలిపి ఏడురోజులపాటు ప్రభుత్వం సెలవులను ప్రకటించిన విషయం తెలిసిందే. వాటిని సర్దుబాటు చేయాలంటే దసరా సెలవులను తగ్గించాలనీ, లేదంటే నవంబర్, డిసెంబర్, ఫిబ్రవరి, మార్చిలో రెండో శనివారం పనిదినం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అయితే ఎస్సీఈఆర్టీ ప్రతిపాదనలను పాఠశాల విద్యాశాఖ పరిగణనలోకి తీసుకోలేదని తెలుస్తున్నది. ఈ క్రమంలో వచ్చేనెల పదో తేదీన రాష్ట్రంలో బడులు పున:ప్రారంభమవుతాయి. అంటే ముందు ప్రకటించిన విధంగా 15 రోజులపాటు పాఠశాలలకు దసరా సెలవులుంటాయి.