Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కనిష్టం రూ.35 వేల నుంచి రూ.45 వేలకు పెంపు
- 25 కాలేజీల్లో రూ.లక్షపైన ఫీజు
- సీబీఐటీకి భారీ షాక్
- రూ.1.73 లక్షల నుంచి రూ.1.12 లక్షలకు తగ్గింపు
- ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచే అమలు
- 173 ఇంజినీరింగ్ కళాశాలల ఫీజు ఖరారు
- నేడు టీఏఎఫ్ఆర్సీ సమావేశం
- ప్రభుత్వానికి ప్రతిపాదనలు.. త్వరలోనే ఉత్తర్వులు జారీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో 173 ఇంజినీరింగ్ కాలేజీల ఫీజులను తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) ఖరారు చేసింది. అన్ని కాలేజీల యాజమాన్యాలతో జులైలో సంప్రదింపులు జరిపిన విషయం తెలిసిందే. ఆడిట్ నివేదికల్లో తప్పులు దొర్లినట్టు గుర్తించిన టీఏఎఫ్ఆర్సీ మళ్లీ ఈనెల 19 నుంచి 22 వరకు 98 కాలేజీల యాజమాన్యాలతో సంప్రదించి ఫీజులను నిర్ణయించింది. ఈ ఫీజులు 2022-23, 2023-24, 2024-25 బ్లాక్ పీరియడ్‌కు వర్తిస్తాయి. అయితే రాష్ట్రంలో ఇంజినీరింగ్ విద్యకు సంబంధించి గరిష్ట ఫీజు ఎంజీఐటీలో రూ.1.60 లక్షలు, కనిష్టఫీజు రూ.35 వేల నుంచి రూ.45 వేలుగా టీఏఎఫ్ఆర్సీ ఖరారు చేసింది. అంటే కనిష్ట ఫీజు రూ.పది వేలు పెంచింది. ఈ బ్లాక్ పీరియెడ్‌లో సుమారు 25 కాలేజీల్లో రూ.లక్షపైన ఫీజు ఉండే అవకాశమున్నది. ప్రస్తుతం ఖరారు చేసిన ఫీజులో సీబీఐటీకి టీఏఎఫ్ఆర్సీ భారీ షాక్ ఇచ్చింది. ఎందుకంటే 2019-20, 2020-21, 2021-22 బ్లాక్ పీరియడ్‌లో ఆ కాలేజీ ఫీజు రూ.1.34 లక్షలు ఉన్నది. 2016-17, 2017-18, 2018-19 బ్లాక్ పీరియెడ్ అదే కాలేజీ ఫీజు రూ.1.40 లక్షలుగా ఇటీవలే టీఏఎఫ్ఆర్సీ ఖరారు చేసిన విషయం తెలిసిందే. కానీ ప్రస్తుత బ్లాక్ పీరియెడ్‌కు గతంలో రూ.1.73 లక్షలుగా ఖరారు చేసింది. మళ్లీ విచారణ చేసి తాజాగా సీబీఐటీ ఫీజు రూ.1.12 లక్షలుగా నిర్ణయించడం గమనార్హం. ఫీజు తగ్గడానికి ఆ కాలేజీ వద్ద రూ.14 కోట్ల వరకు మిగులు నిధులుండడంతో దాన్ని ఆదాయంగా పరిగణించినట్టు టీఏఎఫ్ఆర్సీ అధికారులు వివరించారు. అంటే గతంలో ఖరారు చేసిన దానికంటే ఇప్పుడు నిర్ణయించిన ఫీజు రూ.61 వేలు తగ్గింది. ఇంకోవైపు ఇటీవల మళ్లీ సంప్రదింపులు జరిపిన 98 కాలేజీలకు సంబంధించి దాదాపు ఫీజుల్లో కోత విధించినట్టు సమాచారం. అయితే మైనార్టీకి చెందిన ఒక ఇంజినీరింగ్ కాలేజీ ఫీజు మాత్రం రూ.35 వేలుగానే టీఏఎఫ్ఆర్సీ ఖరారు చేసింది.
ప్రభుత్వంపై రూ.పది వేల ఫీజు భారం?
శనివారం హైదరాబాద్‌లో సాయంత్రం నాలుగు గంటలకు టీఏఎఫ్ఆర్సీ సమావేశం జరగనుంది. ఖరారు చేసిన ఇంజినీరింగ్ ఫీజులపై సమగ్రంగా చర్చించి ఆ ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించే అవకాశమున్నది. ప్రభుత్వం వాటిని పరిశీలించి త్వరలోనే ఫీజులకు సంబంధించిన ఉత్తర్వులను విడుదల చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఖరారు చేసిన ఫీజులు మూడు విద్యాసంవత్సరాలకు అమల్లో ఉంటాయి. అయితే అటు విద్యార్థులపైనే కాకుండా ఇటు ప్రభుత్వంపైనా ఫీజుల భారం పడనుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం అందుకు అంగీకరిస్తుందా?అన్నది చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి సానుకూలంగా లేదు. దీంతో ఫీజుల భారాన్ని ప్రభుత్వం భరిస్తుందా? లేదంటే రూ.35 వేలు కనిష్ట ఫీజును కొనసాగిస్తుందా?అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉన్నది. ప్రస్తుతం ఎస్సీ,ఎస్టీ విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ వర్తిస్తుంది. ఎంసెట్‌లో పదివేలలోపు ర్యాంకు వచ్చిన విద్యార్థులందరికీ మొత్తం ఫీజును ప్రభుత్వమే భరిస్తుంది. ఆపైన ర్యాంకు వచ్చిన విద్యార్థులకు గత విద్యాసంవత్సరం వరకు కనిష్ట ఫీజు రూ.35 వేలు మాత్రమే చెల్లిస్తుంది. ఇప్పుడు కనిష్ట ఫీజును టీఏఎఫ్ఆర్సీ రూ.45 వేలకు పెంచాలని ప్రతిపాదించింది. పెరిగిన రూ.10 వేలు విద్యార్థులే చెల్లించాలా? లేక ప్రభుత్వం భరిస్తుందా?అన్నది శనివారం స్పష్టత వచ్చే అవకాశమున్నది. ఉదాహరణకు ఎంసెట్‌లో పది వేలపైన ర్యాంకు పొందిన ఓ బీసీ విద్యార్థికి కన్వీనర్ కోటాలో ఎంజీఐటీలో సీటు వస్తే అతనికి ప్రభుత్వం కనిష్ట ఫీజు (రూ.35 వేలు లేదా రూ.45 వేలు) మాత్రమే చెల్లిస్తుంది. అంటే మిగిలిన ఫీజును ఆ విద్యార్థే కట్టాలి. ఇలా పేద విద్యార్థులపై ఈ పెరిగిన ఇంజినీరింగ్ ఫీజులు పెనుభారం కానున్నాయి. అయితే ఉత్తర్వులు జారీ అయ్యాక ఫీజుపై అభ్యంతరం ఉన్న కాలేజీలు హైకోర్టును ఆశ్రయించే అవకాశమున్నట్టు తెలిసింది.
తప్పంతా మాదే... : జస్టిస్ స్వరూప్‌రెడ్డి, టీఏఎఫ్ఆర్సీ చైర్మెన్
ఇంజినీరింగ్ ఫీజుల ఖరారులో జాప్యం కావడానికి తప్పంతా తమదేనని టీఏఎఫ్ఆర్సీ చైర్మెన్ జస్టిస్ పి స్వరూప్‌రెడ్డి తనను కలిసిన విలేకర్లతో చెప్పారు. ఆడిట్ నివేదికలో తప్పులున్న మాట వాస్తవమేననీ, అయినా ఆడిటర్‌పై చర్యలు తీసుకోబోమని స్పష్టం చేశారు. ఆ తప్పును తామే గుర్తించామనీ, వాటిని సరిదిద్దామని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చెప్తేనో, హైకోర్టు ఆదేశిస్తేనో కాలేజీ యాజమాన్యాలతో మళ్లీ సంప్రదించి ఫీజులను ఖరారు చేయడం లేదన్నారు. కాలేజీలు అంగీకరించినా, అంగీకరించకపోయినా ఆదాయ, వ్యయాల ఆధారంగా ఫీజు ఖరారు చేసే అధికారం తమకుందని చెప్పారు. కాలేజీలు కోర్టును ఆశ్రయించినా మళ్లీ ఫీజు ఖరారు చేయాల్సింది టీఏఎఫ్ఆర్సీ మాత్రమేనని స్పష్టం చేశారు.