Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ప్రభుత్వానికి కార్మిక సంఘాల విజ్ఞప్తి
సింగరేణి కార్మికులు 15 రోజులుగా తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తుంటే, యాజమాన్యం చర్చల పేరుతో కాలయాపన చేస్తున్నదే తప్ప, పరిష్కార దిశగా ఎలాంటి ప్రయత్నాలు చేయట్లేదని కార్మిక సంఘాలు ఆక్షేపించాయి. ఈ విషయంలో తక్షణం ప్రభుత్వం జోక్యం చేసుకొని, సింగరేణి కార్మికుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరాయి. పలు కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాల నేతృత్వంలో శుక్రవారంనాడిక్కడి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
- 26న జిల్లా కేంద్రాల్లో నిరసనలు
- కలెక్టర్ల ద్వారా సీఎంకు వినతులు
- నేడు సింగరేణి సీఎమ్‌డీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలవాలని నిర్ణయం
- స్సందించకుంటే పోరాటం ఉధృతమే
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సింగరేణి కార్మికులు 15 రోజులుగా తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తుంటే, యాజమాన్యం చర్చల పేరుతో కాలయాపన చేస్తున్నదే తప్ప, పరిష్కార దిశగా ఎలాంటి ప్రయత్నాలు చేయట్లేదని కార్మిక సంఘాలు ఆక్షేపించాయి. ఈ విషయంలో తక్షణం ప్రభుత్వం జోక్యం చేసుకొని, సింగరేణి కార్మికుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరాయి. పలు కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాల నేతృత్వంలో శుక్రవారంనాడిక్కడి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 'సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సమ్మెలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. కొనసాగుతున్న సమ్మెను నివారించాలి' అంశంపై చర్చించారు. ఇదే అంశంపై తీర్మానాన్ని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్ బోస్ సమావేశంలో ప్రవేశపెట్టారు. దీనిపై ఐఎన్టీయూసీ రాష్ట్ర కార్యదర్శి విజయకుమార్ యాదవ్, ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే సూర్యం, ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్ శ్రీనివాస్, అధ్యక్షులు జనార్థన్, హెచ్ఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెబ్బ రామారావు, టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్కే బోస్, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శులు బీ మధు, ఎస్ రమ, బీఎమ్ఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు ఐ నాగేశ్వరరావు, ఐఎఫ్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జే సీతారాములు, కే విశ్వనాధ్, రాష్ట్ర కమిటీ సభ్యులు ఏ వెంకన్న, ఐఎన్టీయూసీ రాష్ట్ర కార్యదర్శి పీ తిరుపతిరావు, ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్టీయూ, ఐఎఫ్టీయూ రాష్ట్ర కమిటీల సభ్యులు గుత్తుల సత్యనారాయణ, మారగాని కృష్ణయ్య, యాకూబ్ షావలి, బీ మధుసూదన్‌రెడ్డి తదితరులు మాట్లాడారు. టీఆర్ఎస్కేవీ, ఏఐయూటీయూసీ సంఘాలు సమావేశానికి సంఘీభావం తెలిపాయి. సింగరేణి కార్మికుల పోరాటానికి కార్మిక సంఘాలన్నీ అండగా ఉంటూ, మద్దతు ఇస్తాయని తేల్చిచెప్పారు. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల డిమాండ్లు న్యాయమైనవనీ, ప్రభుత్వం చేసిన చట్టాలనే వారు అమలు చేయమంటున్నారే తప్ప, కొత్త కోరికలు ఏమీ కోరట్లేదన్నారు. కోల్ ఇండియా జీతాలను సింగరేణిలో పర్మినెంట్ ఉద్యోగులకు వర్తింపచేసినప్పుడు, కాంట్రాక్ట్ కార్మికులకు అమలు చేయడంలో వచ్చే ఇబ్బందులు ఏంటని ప్రశ్నించారు. గత సంప్రదాయాలకు భిన్నంగా కార్మికులు, యాజమాన్యం, ప్రభుత్వం మధ్య వ్యవహారం నడుస్తున్నదని అభిప్రాయపడ్డారు. కార్మికులతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వానికి ఏవైనా భేషజాలు ఉంటే కార్మిక సంఘాల నాయకులుగా తాము చర్చల్లో పాల్గొంటామనీ, ప్రభుత్వం ఆహ్వానించాలని చెప్పారు. పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు తక్షణం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శనివారం ఆ సంస్థ సీఎమ్‌డీ ఎన్ శ్రీధర్‌ను, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రాలు ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే సింగరేణి కార్మికుల సమ్మెకు మద్దతుగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 26న అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు చేపట్టి, కలెక్టర్ల ద్వారా ముఖ్యమంత్రికి వినతి పత్రాలు అందేలా భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ జీవో 60 లేదా 22 ప్రకారం వేతనాలు పెంచాలనీ, కార్మిక చట్టాలు అమలు చేస్తూ, చట్టబద్ధ సౌకర్యాలు కల్పించాలని ఈ సందర్భంగా రౌండ్‌టేబుల్ సమావేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సెప్టెంబర్ 9 నుంచి సింగరేణి కార్మికులు సమ్మె చేస్తున్నారని తెలిపారు. కోల్ ఇండియాలో కాంట్రాక్ట్ కార్మికుడికి రోజుకి రూ.985 చెల్లిస్తుంటే, సింగరేణిలో రూ.466 మాత్రమే చెల్లిస్తున్నారని చెప్పారు. సంస్థలో 25వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారనీ, దీనివల్ల ఒక్కో కార్మికుడు నెలకు రూ.14వేలు నష్టపోతున్నాడని వివరించారు. ప్రమాదంలో మరణించిన కాంట్రాక్ట్ కార్మికులకు కోల్ ఇండియాలో రూ.15 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తున్నారనీ, సింగరేణి ఒక్క రూపాయి కూడా ఇవ్వట్లేదన్నారు. క్యాంటిన్, ఆస్పత్రి సౌకర్యాలు కల్పించట్లేదనీ, సెలవులూ ఇవ్వట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు. తమ డిమాండ్లపై గత ఏడాది డిసెంబర్లో సింగరేణి కార్మికులు యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చారనీ, ఫిబ్రవరిలో కార్మిక శాఖ అధికారుల సమావేశంలో సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన యాజమాన్యం గడచిన 7 నెలలుగా చర్చల పేరుతో కాలయాపన చేస్తున్నదని విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. లేనిపక్షంలో సింగరేణిలోని అన్ని విభాగాల్లో ఉత్పత్తి సహా అన్ని పనులనూ నిలిపివేస్తామనీ, సింగరేణి ప్రాంత అధికారపార్టీ ప్రజాప్రతినిధుల కార్యక్రమాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే సింగరేణి కార్మికులు పలు రూపాల్లో ఆందోళనలు, విజ్ఞప్తులు చేశారనీ, యాజమాన్య మొండివైఖరితో అవి ఫలించకే సమ్మెలోకి నెట్టబడ్డారని స్పష్టం చేశారు.