Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.4 లక్షలు దుర్వినియోగం
- ఇంటర్ బోర్డు కార్యదర్శిపై టిగ్లా ఆగ్రహం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇంటర్మీడియేట్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ ఈ నెలలోనే ఉద్యోగ విరమణ పొందుతున్నారని తెలంగాణ ఇంటర్మీడియట్ గవర్నమెంట్ లెక్చరర్ల సంఘం (టిగ్లా) అధ్యక్షులు ఎం జంగయ్య, ప్రధాన కార్యదర్శి మాచర్ల రామకృష్ణగౌడ్ తెలిపారు. అయితే ఆయన సొంతింటి దగ్గర ఉద్యోగ విరమణ పొందే సమయంలో 'క్యాంపు కార్యాలయం' ఏర్పాటు చేసుకోవడంపై శుక్రవారం ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద విద్యార్థుల నుంచి వసూలు చేసిన సుమారు రూ.నాలుగు లక్షల డబ్బును దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. సూర్యాపేట జిల్లాలోని హుజూర్‌నగర్‌లో చైతన్య జూనియర్ కళాశాల (52263)కు సంబంధించి లేని అధికారాన్ని ఉపయోగించి గుర్తింపు ఫీజును రద్దు చేసి ప్రస్తుతం ప్రయివేటు జూనియర్ కళాశాల పేరును మార్చారని తెలిపారు. గతనెల 22న ఎల్బీ స్టేడియంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా ఆయనకు సంబంధం లేని ఆ ముగింపు కార్యక్రమానికి దాదాపు రూ.ఐదు లక్షలు టిఫిన్లు, వాటర్ బాటిళ్లు, టీ కోసం, ఏర్పాట్ల కోసం మరో రూ.40 వేలు కలిపి మొత్తం రూ.5.40 లక్షలు ఖర్చు చేశారని పేర్కొన్నారు. ఇలా ఇంటర్ బోర్డు నిధులను దుర్వినియోగం చేశారని విమర్శించారు. ఇంటర్మీడియట్ కమిషనర్ కార్యాలయంలో స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ (ఎస్ఐవీఈ) నుంచి సికింద్రాబద్కు చెందిన పాజిబిలియన్ టెక్నాలజీ ప్రయివేట్ లిమిటెడ్‌కు 2020, జనవరిలో రూ.ఏడు లక్షలు అడ్వాన్స్‌గా ఇవ్వడం బాధాకరమని తెలిపారు.
సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ)తో ఇంటర్ బోర్డు ఫలితాల ప్రాసెసింగ్, వెబ్సైట్, యూట్యూబ్ ఛానెల్ నిర్వహణ వంటి వాటికోసం ఒప్పందం కుదుర్చుకుందని గుర్తు చేశారు. అయినప్పటికీ ఓ ప్రయివేటు సంస్థకు రూ.ఏడు లక్షలు అడ్వాన్స్ చెల్లించినా ఏడు రూపాయల పని కూడా చేయలేదని విమర్శించారు.
మరోవైపు అర్హులకు కాకుండా అనర్హులకు అక్రమంగా ఓడీలు, డిప్యూటేషన్లు, కాంట్రాక్టు అధ్యాపకులను జలీల్ బదిలీలు చేశారని తెలిపారు. కొంత మంది ఉద్యోగులపై గతంలో విధించిన క్రమశిక్షణ చర్యలను అక్రమంగా రద్దు చేశారని పేర్కొన్నారు. అందువల్ల ప్రభుత్వం తక్షణమే స్పందించి జలీల్‌పై ఏసీబీతో దర్యాప్తు జరిపించాలనీ, ఇంటర్ విద్యా వ్యవస్థను కాపాడాలని కోరారు.