Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు కిషోర్‌గౌడ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పోటీ పరీక్షలకు శిక్షణ పొందే నిరుద్యోగులకు బీసీ స్టడీ సెంటర్ అందుబాటులో ఉంటుందని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు కె కిషోర్ గౌడ్ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ విద్యానగర్‌లోని వివేకానంద డిగ్రీ కళాశాలలో స్టడీ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషోర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గ్రూప్ 3, గ్రూప్ 4తోపాటు వివిధ పోటీ పరీక్షలకు శిక్షణ పొందే నిరుద్యోగుల కోసం ఈ స్టడీ సెంటర్ ఎంతగానో తోడ్పడుతోందని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన వర్గాలను అభివృద్ధిలోకి తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే నూతనంగా 50 బీసీ స్టడీ సెంటర్లను ఏర్పాటు చేశారని తెలిపారు. జోనల్వ్యవస్థను సరిచేయడం ద్వారా 95 శాతం స్థానిక యువతకే ఉద్యోగాలు దక్కేవిధంగా ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి ఆశన్న, స్వామి వివేకానంద డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సుకన్య, కోర్సు కో-ఆర్డినేటర్ సుచిత్ర, పి.వి.ఆర్ కోచింగ్ సెంటర్ కోఆర్డినేటర్ వెంకటేశ్వర్రావు, జిల్లా సహాయ సంక్షేమశాఖ అధికారులు నర్సింహులు, సంజీవులు, యాసిర్ అలీ, పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.