Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేటి నుంచి బతుకమ్మ సంబురాలు
- ఎంగిలిపువ్వు వేడుకకు సర్వం సిద్ధం
- పూల కొరత..కిలో బంతి రూ.150..చామంతి రూ.220
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
''ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ.. ఏమేమీ కాయొప్పునే గౌరమ్మ..
తంగేడు పువ్వప్పునే గౌరమ్మ.. తంగేడు కాయొప్పునే గౌరమ్మ..
తంగేడు చెట్టుకింద ఆటచిలకలాలా.. పాట చిలకలాల కలికి చిలకలలా..
కందుమ్మ గుట్టలు రానుపోనడుగులు.. తిరుద్దరాషలు తారు గోరింటలు..
ఘనమైన పొన్నపువ్వే గౌరమ్మ.. గజ్జేల వొడ్డాలమే గౌరమ్మ..''
.. అంటూ పాటలు పాడుతూ.. పూలను పూజించే ఏకైక పండుగ బతుమ్మ. తెలంగాణ సంస్కృతిలో తప్ప మరెక్కడా కానరాని వేడుక ఇది. అన్ని పండుగలకు పూలతో పూజలు చేస్తే.. బతుకమ్మ సంబరాల్లో మాత్రం పూలనే ఆరాధిస్తాం. తెలంగాణలో అత్యంత ప్రీతిపాత్రంగా జరుపుకునే ఈ పండుగపై ఈ ఏడు ప్రకృతి వైపరీత్యం ప్రభావం పడింది. అధిక వర్షాలతో పూల పరిమళాలు కరువై.. ధరల మంటలు మండుతున్నాయి. కోవిడ్-19 కారణంగా రెండేండ్లుగా మామూలుగానే జరిగిన ఈ పండగకు ఈసారి ధరలు ప్రతికూలంగా మారాయి. కష్టమైనా నష్టమైనా ఘనంగా బతుకమ్మ సంబురాలు చేసేందుకు ఊరూవాడ ముస్తాబయ్యాయి. ఇప్పటికే పేద ఆడపడుచులకు బతుకమ్మ చీరల పంపిణీని ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వం.. తొమ్మిదొద్దుల సంబురాల కోసం సర్వం సిద్ధం చేసింది. ఆదివారం ఎంగిలిపువ్వు బతుకమ్మతో ప్రారంభమయ్యే వేడుక అక్టోబర్ 3వ తేదీన సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది.
నేడు ఎంగిలిపువ్వు
ఉయ్యాల పాట.. చప్పట్ల మోత.. దస్తీబిస్తీ ఆట.. బతుకమ్మ పూట... తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుక మహాలయ అమావాస్య (పెత్రామాస)ను పురస్కరించుకుని ఎంగిలిపూలోత్సవంతో ప్రారంభమవుతుంది. తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మతో ఆరంభమైన వేడుకలు తొమ్మిది రోజులపాటు కొనసాగుతాయి. దసరాకు రెండు రోజుల ముందు సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మ, రెండో దినం అటుకుల బతుకమ్మ, మూడోనాడు ముద్దపప్పు బతుకమ్మ, నాల్గో రోజు నానే బియ్యం బతుకమ్మ, ఐదోనాడు అట్ల బతుకమ్మ, ఆరో రోజు అలిగిన బతుకమ్మ, ఏడో దినం వేపకాయల బతుకమ్మ, ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మ, తొమ్మిదో నాడు సద్దుల బతుకమ్మ ఉత్సవాలు నిర్వహిస్తారు.
కలెక్టర్ల ఆధ్వర్యంలో ఏర్పాట్లు
జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలకు సర్వం సిద్ధం చేశారు. ఖమ్మం నగరంలోని గుంటు మల్లేశ్వరక్షేత్రం, శివాలయం, ప్రకాశ్‌నగర్ ఏటి బ్రిడ్జి, మున్నేరు ఒడ్డు, ఎన్నెస్పీ కెనాల్ తదితర ప్రాంతాలు, ఆలయాల్లో బతుకమ్మలాడే మహిళలు కొందరు దేవస్థానంలో ఉంచుతారు. మరికొందరు ఏ రోజు బతుకమ్మను ఆరోజు నీటిలో వదులుతారు. ఆయా ప్రాంతాల ఆచారాన్ని బట్టి ఊరూరా ఇదే రీతిలో వేడుకలు కొనసాగుతాయి. ధరలు, పని ఒత్తిడి నేపథ్యంలో కొందరు మూడ్రోజులు, మరికొందరు ఎంగిలిపువ్వు, సద్దుల బతుకమ్మ మాత్రమే పేరుస్తారు. ఐద్వా, పలు మహిళా, స్వచ్ఛంద సంఘాల ఆధ్వర్యంలోనూ వేడుకలకు ఏర్పాట్లు చేశారు.
పూలు కొనేటట్టులేదు
ఈ ఏడాది అధికవర్షాల ప్రభావం బతుకమ్మ పూలపైనా పడింది. ఏ పూలు చూసినా కిలో రూ.100కు తక్కువనే మాటలేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతియేటా వంద ఎకరాలకు పైగా పూల తోటలు సేద్యం చేస్తారు. ఈ ఏడాది అధిక వర్షాల కారణంగా 30 నుంచి 40 ఎకరాలు మాత్రమే సాగు చేశారు. గోదావరి వరదల కారణంగా పినపాక, బూర్గంపాడు, భద్రాచలం తదితర మండలాల్లో స్వల్పంగా వేసిన పూల తోటలు కూడా దెబ్బతిన్నాయి. ఖమ్మం పరిసరాల్లో రఘునాథపాలెం, ఖమ్మం రూరల్, కొణిజర్ల, చింతకాని, తిరుమలాయపాలెం, ముదిగొండ, కూసుమంచి తదితర మండలాల్లోని కొన్ని గ్రామాల్లో సాగు చేసే బంతి, మల్లెపూల తోటలు కూడా వర్షం బారినపడ్డాయి. ప్రతియేటా చేలు, బీళ్లు, గుట్టలపై విరగబూసే తంగేడు పూలు కూడా ఈ ఏడాది పూత కరువైంది.
ఈ నేపథ్యంలో బెంగళూరు, విజయవాడ, కర్నూల్ తదితర ప్రాంతాల నుంచి పూలు దిగుమతి చేసుకుంటున్నారు. గతేడాది కిలో రూ.వంద లోపు పలికిన పూలన్నీ ఇప్పుడు వంద పైమాటే. కిందటి సంవత్సరం కిలో రూ.80 ఉన్న బంతిపూలు ఇప్పుడు రూ.150, రూ.100 ఉన్న చామంతి ఇప్పుడు రూ.220 వరకు పలుకుతున్నాయి. పావుకిలో తీసుకుంటే రూ.70కి అమ్ముతున్నారు. మల్లెపూలు మూర రూ.50కి విక్రయిస్తున్నారు.
ఇక గ్రామీణ ప్రాంతాల నుంచి కొందరు తంగేడు పూలు సేకరించుకొచ్చి నగరాలు, పట్టణాల్లో విక్రయిస్తున్నారు. నాలుగు మండలున్న చిన్న కట్టను రూ.50 నుంచి వంద వరకూ విక్రయిస్తున్నారు. తామరపూలు ఒక్కటి రూ.20కి పైనే. బతుకమ్మ పేర్చే వెదురు బుట్ట అడుగు రూ.100 ఉండగా పది అడుగుల వరకూ ఉన్నది రూ.వెయ్యి చొప్పున అమ్ముతున్నారు. టేకు, గునుగు పూలకు రంగులద్ది కట్ట రూ.30 నుంచి రూ.50 వరకు విక్రయిస్తున్నారు. కొందరు రూ.150 వెచ్చించి రెడీమేడ్ కాగితం బతుకమ్మలు కొనుగోలు చేస్తున్నారు.
పూలు కొనేటట్టు లేదు:కె.ప్రత్యూష- ఖమ్మం
పూల ధరలు మండిపోతున్నాయి. ఏ పువ్వు కొందామన్నా రూ.100కు పైనే చెబుతున్నారు. మూర మల్లెపూలు కూడా రూ.50కి పైనే పడుతున్నాయి. బతుకమ్మ ఆడాలనే ఉత్సాహాన్ని పూల ధరలు నీరుగారుస్తున్నాయి. పూజకు వినియోగించే సామగ్రి ధరలు భారీగా పెరిగాయి. గతంలో రూ.60, రూ.70కి ప్యాకెట్ చొప్పున వచ్చిన అగర్వొత్తులు ఇప్పుడు డబుల్ అయ్యాయి. కొబ్బరికాయ కూడా రూ.20 నుంచి రూ.30కి చేరింది.
లోకల్లో ఒక్క పువ్వు లేదు:యాదమ్మ- పూల విక్రేత- ఖమ్మం
పోయిన సంవత్సరం, కరోనాకు ముందు బంతి, చామంతి, మల్లె.. వంటి పూలేవీ బయట నుంచి తెచ్చేది కాదు. ఖమ్మం చుట్టుపక్కల తోటల నుంచే తెచ్చేది. బంతి పూలైతే మునుపెన్నడూ బయటి నుంచి కొనక్కరాలేదు. ఈయేడే విజయవాడ నుంచి తెప్పిచ్చాం. అక్కడ కిలో రూ.100 పడుతుంది. ఇక్కడ మేము రూ.150 చొప్పున అమ్ముతున్నాం. కొనుగోళ్లు మందకొడిగా ఉన్నాయి. ఇంతకుముందు ఇట్టతెస్తే అట్టఅయిపోయేవి. ఆదివారం అమ్ముడుపోకపోతే పూలు దెబ్బతింటాయి. తంగేడు పూలు తెచ్చేందుకు కూడా వందల కిలోమీటర్లు పోయినం. ఎక్కడా పూలు దొరకలేదు. దొరికిన కాడికి తెచ్చి అమ్ముతున్నాం.