Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీల గురించి ఆశాల ప్రచారం
- ఆస్పత్రుల్లో అందని సౌకర్యాలు
- ఆశాలను బస్తీల్లోకి రానివ్వని స్థానికులు
- చేతులెత్తేసిన జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు
- ఎస్పీహెచ్ఓ, మెడికల్ ఆఫీసర్లదే బాధ్యత : సీఐటీయూ
నవతెలంగాణ-సిటీబ్యూరో
'ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నారు. ప్రారంభం నుంచి డెలివరీ వరకు అక్కడే చూపించుకోండి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీ అయితే ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుంది' అంటూ ఆశా వర్కర్లు బస్తీలు, కాలనీలు, మురికివాడల్లో ప్రచారం చేస్తున్నారు. గర్భిణీలు, బాలింతలు, పిల్లలకు ఎవరికి ఏ సమస్య వచ్చినా దగ్గర ఉండి వైద్యం చేయించేందుకు కృషి చేస్తున్నారు. అయితే, తీరా ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లాక.. అక్కడ సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దాంతో ఆశాలను స్థానికులు నిలదీస్తున్నారు. అందుకు గగన్‌మహల్ పీహెచ్సీ, నాంపల్లి ఏరియా ఆస్పత్రుల్లో జరిగిన సంఘటనలే నిదర్శనం. ఇలాంటి సంఘటనలు కోకల్లాలు జరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఆస్పత్రుల్లో డాక్టర్ల నిర్లక్ష్యానికి ఆశా వర్కర్లను బలి చేస్తున్నారు. జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు సైతం ఆశాలకు అండగా ఉండటం లేదు.
అంతా బాగానే ఉందని..
అచ్చయ్యనగర్ కాలనీకి చెందిన ఓ మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి డెలివరీ వరకు గగన్‌మహల్ పట్టణ ప్రాథమిక ఆరోగ్యం కేంద్రంలోనే చికిత్స పొందింది. ప్రారంభం నుంచి అంతా బాగానే ఉందని పీహెచ్సీ వైద్యులు తెలిపారు. సాధారణంగా 5నెలల్లో తీసిన స్కానింగ్‌లో బిడ్డ కండిషన్ తెలుస్తుంది. అప్పుడు కూడా అంతాబాగానే ఉందన్నారు. 8 నెలల్లో బేబీ గ్రోత్ స్కానింగ్‌పై పీహెచ్సీ డాక్టర్‌ను అడిగితే 'అవసరం లేదమ్మా..హార్ట్ బీట్ బాగుంది. కాళ్లు, చేతులు ఆడిస్తుంది' అని చెప్పారు. ఇదిలా ఉండగా, పీహెచ్సీలో రెగ్యులర్‌గా చెకప్ చేసిన డాక్టర్లు డెలివరీ కోసం కింగ్‌కోఠి ఆస్పత్రికి రెఫర్ చేశారు. అక్కడికెళ్లాక.. 'బేబీ కండిషన్ బాగాలేదు.. నీలోఫర్‌కు వెళ్లాలి' అని డాక్టర్లు చెప్పారు. నీలోఫర్‌లో ఆగస్టు 26వ తేదీన ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీశారు. కానీ బాబు పరిస్థితి సరిలేదు. సీనియర్ డాక్టర్ మాట్లాడుతూ.. 'ఎందమ్మా బేబీ కండిషన్ 5 నెలల్లో తెలుస్తుంది.. నీకు చెప్పలేదా? బాబు బతకాలంటే 15 ఆపరేషన్లు చేయాల్సి ఉంది' అని చెప్పేవరకు కుటుంబీకులు ఆందోళనకు గురయ్యారు. బాబు పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో ఈనెల 10వ తేదీన మరణించాడు.
నాంపల్లి ఏరియా ఆస్పత్రిలో మరో మహిళకు ఆపరేషన్ ద్వారా డెలివరీ చేశారు. పరిస్థితి సీరియస్‌గా మారడంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతోంది. అయితే, 'నీ వల్లే ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చింది' అని స్థానిక ఆశా వర్కర్‌పై బస్తీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు సంఘటనల్లో ఆశా వర్కర్లది ఎలాంటి తప్పులేకపోయినా నిందలు భరించాల్సి వచ్చింది. ఇలాంటి ఘటనలు అనేకం జరుగుతున్నా వైద్యారోగ్యశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని బాధిత కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
స్థానిక డాక్టర్..
ఆశా వర్కర్లు స్థానిక డాక్టర్లుగా పనిచేస్తున్నారు. బస్తీల్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా మొదట గుర్తొచ్చేది ఆశా వర్కరే. కానీ, డాక్టర్ల నిర్లక్ష్యానికి ఆశా వర్కర్లపై దుష్ప్రచారం చేస్తున్నారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో సుమారు 50లక్షలకుపైగా జనాభా ఉంది. 94 బస్తీ దవఖానాలు, 50కిపైగా పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వీటితోపాటు 2500 కుటుంబాలకు సంబంధించిన ఆరోగ్య విషయాలను ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తూ పైఅధికారులకు చేరవేస్తూ ఉండాలి. హైదరాబాద్ జిల్లా జనాభా, కుటుంబాల సంఖ్య ఆధారంగా 2500 మంది ఆశావర్కర్లు ఉండాలి. కానీ ప్రస్తుతం 1,895 మంది మాత్రమే ఉన్నారు. ఆశాల సంఖ్య తక్కువగా ఉండటంతో పని భారం పెరిగింది. రోజుకు సుమారు 14గంటలపాటు పనులు చేయిస్తున్నారని ఆశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.